Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ పర్యటన వివరాలను పంచుకున్న ప్రధాని


ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సంబంధించిన వివరాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ మోదీ పూజలు చేశారు. శ్రీ శివాజీ ధ్యాన మందిర్, శ్రీ శివాజీ దర్బార్ హాలును సందర్శించారు. అనంతరం, రూ.13,430 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కర్నూల్లో శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టుల్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు.

“శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో నా తోటి భారతీయుల సౌభాగ్యం కోసం, వారి ఆరోగ్యం కోసం ప్రార్థించాను. అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.”

“శ్రీశైలం నుంచి మరి కొన్ని దృశ్యాలు.”

“శ్రీశైలంలోని శ్రీ శివాజీ ధ్యాన మందిరం, శ్రీ శివాజీ దర్బార్ హాల్‌ను సందర్శించాను. మహాన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ 1677లో శ్రీశైలం వచ్చి, మల్లికార్జున మందిరంలో ప్రార్థించారు. 

ధ్యాన మందిరంలో ధ్యానం చేసి, భ్రమరాంబ దేవి ఆశీస్సులు పొందారు.”

“శ్రీశైల క్షేత్రంలో ఉండటం అపారమైన ఆనందాన్నిస్తోంది. ఈ పవిత్ర స్థలంలో అడుగడుగునా దైవత్వం నిండి ఉంది. ఇక్కడి ప్రజల సాదర స్వాగతానికి నేను కృతజ్ఞుడిని.

శ్రీ భ్రమరాంబికా దేవి, మల్లికార్జున స్వామి వార్లు ఎల్లప్పుడూ మన దేశాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.”

“వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందడం ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్‌డీయే ప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉంది. @ncbn”

“ఇటీవలి కాలంలో, ఆంధ్రప్రదేశ్ ఇంధన రంగంలో గణనీయమైన పురోగతిని సాధించింది. ఈ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు రాష్ట్ర ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి మాత్రమే పరిమితం కాకుండా, ఈ రంగంలో మొత్తం భారత వృద్ధికి దోహదం చేస్తాయి.”

“దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌‌ను ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చేస్తున్నారు. ఇది మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ ఏఐ, కనెక్టివిటీ హబ్‌గా విశాఖపట్నానికి కొత్త గుర్తింపునిస్తుంది.”

“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలును డ్రోన్ హబ్‌గా మార్చాలనుకోవడం నాకు సంతోషాన్నిచ్చింది. ఈ ప్రయత్నం భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాలకు నూతన మార్గాలను సూచిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో అవకాశాలను సృష్టిస్తుంది.”

“రాష్ట్రవ్యాప్తంగా ‘సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్’ ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. సృజనాత్మక పోటీల ద్వారా, యువతలో జీఎస్టీపై అవగాహన పెంపొందించారు. @naralokesh”

“బీహార్‌లో ఎన్డీయే విజయావకాశాల గురించి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛమైన హిందీలో మాట్లాడి అనేక మంది ఎన్డీయే కార్యకర్తల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ పట్ల తన అంకితభావాన్ని ప్రదర్శించారు. @ncbn”

“కర్నూలు ప్రజల ఉత్సాహం అసాధారణం! ఈరోజు ప్రారంభించిన అభివృద్ధి పనుల పట్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు.”

 

***