Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత ప్రధానికి ఫోన్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని


భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గౌరవ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహు ఈ రోజు ఫోన్ లో సంభాషించారు.

వారిద్దరూ పరస్పరం నూతన సంవత్సర ఆత్మీయ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. రెండు దేశాల ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, బలమైన పరస్పర విశ్వాసం, భవిష్యత్ దృక్పథాల మార్గనిర్దేశంలో.. ఈ ఏడాది భారత్ – ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఉమ్మడి ప్రాధాన్యాలను వారు గుర్తించారు.

ఏ రూపంలో ఉన్నా, ఏ రకంగా వ్యక్తమైనా ఉగ్రవాదాన్ని సహించేది లేదని ప్రధానులిద్దరూ పునరుద్ఘాటించారు. ఈ ముప్పును ఎదుర్కోవడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

గాజా శాంతి ప్రణాళిక అమలుపై భారత ప్రధానమంత్రి శ్రీ మోదీకి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు వివరించారు. ఆ ప్రాంతంలో న్యాయమైన, శాశ్వత శాంతిని నెలకొల్పే ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ మద్దతిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.

ఉమ్మడి ప్రయోజనాలున్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చించారు.

సంప్రదింపులను కొనసాగించాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు.

 

***