భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు.. నేపాల్ గౌరవ ప్రధానమంత్రి బాలేంద్ర షా 2026 నవంబరు 22, 23 తేదీల్లో భారత్‌లో అధికారికంగా పర్యటించారు. సుహృద్భావ వాతావరణంలో ఫలప్రదమైన, ఆశావహ దృక్పథంతో ప్రధానులిద్దరి మధ్య న్యూఢిల్లీలో చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక సంబంధాలను సమగ్రంగా సమీక్షించారు.
పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాలు ప్రాతిపదికలుగా భారత్ – నేపాల్ దేశాల మధ్య చిరకాల నాగరికతా సంబంధాలు వికసించాయనీ, ఇరు దేశాల ప్రజల మధ్య బలమైన అనుబంధంతో బహుముఖ భాగస్వామ్యంగా అభివృద్ధి చెందాయనీ వారు పేర్కొన్నారు.
2026 ఆగస్టులో రసువా – త్రిశూలి పరీవాహక ప్రాంతం, ఇతర ప్రాంతాల్లో సంభవించిన వరదలు, మట్టిచరియలు విరిగిపడిన ఘటనల అనంతరం భారత్ అందించిన తక్షణ మానవతా సాయం, గాలింపు – రక్షణ చర్యల పట్ల నేపాల్ కృతజ్ఞతలు తెలిపింది. నేపాల్ పునర్నిర్మాణ చర్యల కోసం తదుపరి సహకారం విషయంలో ఎప్పటికప్పుడు సంప్రదింపులను కొనసాగించేందుకు ప్రధానమంత్రులిద్దరూ అంగీకరించారు.
సమకాలీన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక వాస్తవికతలకు అద్దం పట్టేలా ద్వైపాక్షిక భాగస్వామ్యం ఉండాలన్న విషయమై ప్రధానమంత్రులిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. 1950 నాటి శాంతి – మైత్రి ఒప్పందం, ప్రస్తుతం అమల్లో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలను పరస్పర అంగీకారం ప్రాతిపదికన సమీక్షించేందుకు వీలుగా.. ఆధునిక – భవిష్యత్ దృక్పథంతో కూడిన చట్టపరమైన చట్రం ఈ భాగస్వామ్యానికి మూలాధారంగా ఉండాలన్న విషయమై వారిద్దరూ అంగీకారానికి వచ్చారు. జలవనరులు, ఇంధనం, వర్తక వాణిజ్యాలు, సరిహద్దు సంబంధ అంశాలు సహా అపరిష్కృతంగా ఉన్న అన్ని అంశాలను పరస్పర చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.
భారత్ – నేపాల్ సంబంధాలను ఇరు దేశాల ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలను అందించే ఆధునిక, ఆచరణీయ భాగస్వామ్యంగా మలచడం లక్ష్యంగా.. ఈ ‘ఉమ్మడి దార్శనికత’ను ప్రధానమంత్రులిద్దరూ ఆమోదించారు. భారత్ – నేపాల్ ప్రజల, ముఖ్యంగా యువత ఆకాంక్షలపై దృష్టి సారిస్తూ.. కింది పది మౌలిక అంశాల ఆధారంగా భవిష్యత్ ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ఇది మార్గదర్శకంగా నిలుస్తుంది:
I. సమగ్ర ఆర్థిక, అభివృద్ధి భాగస్వామ్యం
దేశ సంకల్పమైన ‘వికసిత భారత్ – 2047’, నేపాల్ జాతీయ అభిలాష ‘సమున్నత్ నేపాల్’ల నడుమ అనేక పరస్పర ఆధారిత అంశాలు ఉన్నాయి. వీటిని సమర్థంగా వినియోగించుకుని ఇరుదేశాల మధ్య విస్తృత ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవచ్చు. కింది అంశాలు ఇందులో భాగంగా ఉంటాయి:
i. మరింత సమగ్రమైన ఆర్థిక భాగస్వామ్యానికి వీలు కల్పించే విధంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులకు దోహదపడే విధివిధానాలు/ఒప్పందాలను సమీక్షించడం.
ii. రాకపోకలను మెరుగుపరచడంతోపాటు ఇరుదేశాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడం కోసం కొత్త రవాణా, విమాన మార్గాలను ప్రారంభించడం.
iii. తయారీ, ఇతర ప్రాసెసింగ్ పరిశ్రమల సరఫరా వ్యవస్థలతో అనుసంధానాన్ని ఏర్పరిచేలా.. భారత్ – నేపాల్ సరిహద్దు సమీపంలో ఎగుమతి ఆధారిత తయారీ కోసం సరిహద్దు ప్రత్యేక ఆర్థిక మండళ్లు/పార్కుల ఏర్పాటుకు సహకరించడం, ఐటీ పార్కుల అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని అందించడం.
iv. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించే, సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరిచే ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా.. నేపాల్ ప్రాధాన్య రంగాల్లో భారతీయ పెట్టుబడులను ప్రోత్సహించడం.
v. రూ. 15,000 కోట్ల (24,000 కోట్ల నేపాలీ రూపాయలు) అభివృద్ధి సహాయాన్ని భారత్ అందిస్తుంది. నేపాల్‌లో విపత్తు అనంతర పునర్నిర్మాణం – కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం రూ. 3,500 కోట్లు (5,600 కోట్ల నేపాలీ రూపాయలు), అలాగే ఇంధన రంగ ప్రాజెక్టుల కోసం రూ. 11,500 కోట్ల (18,400 కోట్ల నేపాలీ రూపాయలు) రూపాయి ఆధారిత రుణ సదుపాయం ఇందులో భాగంగా ఉంటాయి. ఈ అభివృద్ధి సహాయాన్ని అందించడానికి నిర్దిష్ట ప్రాజెక్టులు, విధివిధానాలను పరస్పర సంప్రదింపుల ద్వారా ఖరారు చేస్తారు.
II. భౌతిక, డిజిటల్ అనుసంధానం:
ఆర్థిక సహకారాన్నీ, ఇరుదేశాల ప్రజల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడంలో రవాణా చోదక శక్తి. ఈ రంగంలో సాధించిన గణనీయమైన పురోగతిని ప్రధానమంత్రులిద్దరూ స్వాగతించారు. అయోధ్య (భారత్) – జనక్‌పూర్ (నేపాల్) మధ్య నేరుగా నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును ప్రారంభించడం, ధార్చులా (భారత్) – దార్చులా (నేపాల్) మధ్య మహాకాళి నదిపై వాహనాల రాకపోకలకు అనువైన వంతెనను ప్రారంభించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. కింది అంశాలపైనా వారి మధ్య అంగీకారం కుదిరింది:
i. భైరహవా (నేపాల్), సునౌలి (భారత్)లలో ప్రస్తుతం కొనసాగుతున్న ఐసీపీల నిర్మాణాన్ని, అలాగే బన్‌బాసా (భారత్), దోధారా చాందని (నేపాల్)లలో కొత్త ఐసీపీల నిర్మాణాన్ని వేగవంతం చేయడం.
ii. జయనగర్ – బర్దిబాస్, జోగ్బానీ – బిరాట్‌నగర్ రైల్వే లైన్ల చివరి విభాగాల పనులను త్వరితగతిన పూర్తి చేయడం.
iii. రక్సాల్ – ఖాట్మండు రైలు మార్గం తుది స్థాన సర్వే ఖరారు కావడాన్ని స్వాగతిస్తూ.. భారత్, నేపాల్ మధ్య పరస్పర అనుసంధానం గల రైలు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం కోసం నేపాల్‌లో తూర్పు – పశ్చిమ రైలు మార్గం అభివృద్ధికి సహకరించుకోవడంపై ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఇందులో బర్దిబాస్ – నిజ్‌గఢ్ విభాగం, బీర్‌గంజ్ – నిజ్‌గఢ్ అనుసంధాన మార్గానికి ప్రాధాన్యమిస్తారు.
iv. వాహనాల రాకపోకలకు అనువైన కొత్త వంతెనలు, వాణిజ్య కేంద్రాల ద్వారా భారత్ – నేపాల్ మధ్య రహదారి అనుసంధానాన్ని మరింత మెరుగుపరచడం.
v. సిలిగురి (భారత్), ఝాపా (నేపాల్)లను కలుపుతూ కొత్త పైప్‌లైన్ నిర్మాణం సహా సరిహద్దుల నడుమ పెట్రోలియం సరఫరా మౌలిక సదుపాయాలను విస్తరించడం, భారత్ – నేపాల్ మధ్య గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించడం.
vi. భారత్ యూపీఐ, నేపాల్ జాతీయ చెల్లింపుల వ్యవస్థల అనుసంధానం ఆధారంగా.. సరిహద్దు రిటైల్ చెల్లింపుల అమలును వేగవంతం చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.
vii. పీఎం గతి శక్తి వంటి వేదికల ద్వారా సమీకృత మౌలిక సదుపాయాల ప్రణాళిక, అనుసంధానంలో పరస్పర సహకారం. నేపాల్ తన భౌగోళిక, అభివృద్ధి ప్రాధాన్యాలకు అనుగుణంగా స్వీకరించడాన్ని దీనిని స్వీకరించే అంశాన్ని పరిశీలించవచ్చు.
viii. భారత్ – నేపాల్ మధ్య అంతర్జాతీయ సరిహద్దును స్వేచ్ఛాయుతంగా, సురక్షితంగా, చక్కటి నియంత్రణలో ఉంచడం, అలాగే సరిహద్దు నేరాలు, అక్రమ కార్యకలాపాలను ఎదుర్కొనే చర్యల్లో సహకారాన్ని బలోపేతం చేయడం.
III. ఇంధనం, జల వనరులు, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం:
ఇంధనం, జలవనరులు, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం వంటి అంశాల్లో భారత్, నేపాల్ మధ్య సహకారాన్ని మరింత విస్తరించడానికి ఉన్న అపారమైన అవకాశాలను గుర్తిస్తూ… సంస్థాగత సహకారాన్ని బలోపేతం చేయడానికి, పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి, సుస్థిర, సుదృఢ, సమ్మిళిత అభివృద్ధి దిశగా ఉమ్మడి ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ దిశగా:
i. విద్యుత్ రంగ సహకారంపై భారత్ – నేపాల్ ఉమ్మడి దార్శనిక పత్రానికి అనుగుణంగా.. నేపాల్ జలవిద్యుత్, విద్యుత్ ప్రసార మౌలిక సదుపాయాల్లో మరిన్ని పెట్టుబడులను భారత్ ప్రోత్సహిస్తుంది. ఇందుకు గాను అలాంటి పెట్టుబడులకు అనుకూలమైన, పరస్పర ప్రయోజనకరమైన విధివిధానాలు సహా తగిన సహకారం, సదుపాయాలను నేపాల్ అందిస్తుంది. భారత్ – నేపాల్ మధ్య విద్యుత్ వాణిజ్యాన్ని మరింత విస్తరించే లక్ష్యంతో.. పరస్పర ప్రయోజనం, మార్కెట్ డిమాండ్ ఆధారంగా విద్యుత్ వాణిజ్యాన్ని మరింత పెంచే అవకాశాలను సంబంధిత అధికారులు పరిశీలిస్తారు.
ii. పరస్పర ప్రయోజనాల కోసం జల వనరులను వినియోగించుకోవడానికీ, వరదల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికీ.. పంచేశ్వర్, సప్తకోశి, సున్‌కోశి బహుళార్థసాధక ప్రాజెక్టులు సహా ప్రస్తుతం కొనసాగుతున్న, ప్రతిపాదిత జలవిద్యుత్, బహుళార్థసాధక ప్రాజెక్టుల అమలు ప్రక్రియను ఇరు పక్షాలు వేగవంతం చేస్తాయి.
iii. విపత్తుల ముప్పును తగ్గించడం, ముందస్తు హెచ్చరికలు, విపత్తు అనంతర సహాయక చర్యల ద్వారా ప్రజల ప్రాణాలనూ, జీవనోపాధినీ, మౌలిక సదుపాయాలనూ రక్షించే దిశగా క్రియాశీల భాగస్వామ్యంపై ఇరుపక్షాలూ అంగీకారానికి వచ్చాయి.
iv. ఇరుపక్షాల నడుమ ఎప్పటికప్పుడు జల – వాతావరణ సంబంధిత సమాచార మార్పిడి, హిమనదీయ సరస్సుల పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరికల వ్యవస్థను సంస్థాగతీకరించడానికి వారు అంగీకరించారు. హెచ్‌డీఏఆర్ విన్యాసాలు, సామర్థ్యాభివృద్ధి, శిక్షణ – మానవతా సాయం రూపంలో ఇరుదేశాల సంబంధిత సంస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు వారు అంగీకారానికి వచ్చారు.
v. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి, ఐసీఐఎంఓడీ, అంతర్జాతీయ పెద్ద పులి జాతుల కూటమి వంటి బహుపాక్షిక సంస్థల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై వారు అంగీకారానికి వచ్చారు.
vi. నేపాల్‌లో గ్రీన్ హైడ్రోజన్‌పై ఒక పైలట్ ప్రాజెక్టు సహా సౌరశక్తి నుంచి భూగర్భ వనరుల వరకు అదనపు ఇంధన వనరుల అభివృద్ధిలో సహకరించుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.
vii. విధాన రూపకల్పన, నియంత్రణ, ప్రమాణాలు, అటవీ శాస్త్రం, ప్రమాద చిత్రణ, వాతావరణ మార్పులను తట్టుకోగల వ్యవసాయం వంటి పర్యావరణ సంబంధిత రంగాలలో నేపాల్ యువ వృత్తి నిపుణులు, అధికారులు, నిపుణులకు శిక్షణను అందించడంలో భారత్ సహకరిస్తుంది.
viii. జలాశయాల పునరుజ్జీవనం, భూగర్భ జల కాలుష్య నిర్మూలన వంటి అంశాల్లోనూ భారత్ తన నైపుణ్యాలను నేపాల్‌తో పంచుకుంటుంది.
IV. సుపరిపాలన:
సుపరిపాలనకు సంబంధించి నేపాల్ ప్రాధాన్యతలకు భారత్ అనుసరిస్తున్న విధానాలకు మధ్య గణనీయమైన సారూప్యత ఉంది. ముఖ్యంగా డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకోవడం.. పౌర–ప్రభుత్వ అనుసంధాన ప్రక్రియను మరింత పారదర్శకంగా, సౌకర్యవంతంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దడం వంటి అంశాల్లో ఈ సాన్నిహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ లక్ష్య సాధన దిశగా:
i. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డిజిటల్ సార్వభౌమాధికారం, డేటా రక్షణ సూత్రాలకు అనుగుణంగా ‘డిజిటల్ నేపాల్ ఫ్రేమ్‌వర్క్’ అమలుకు వీలు కల్పించటానికి డిజిటల్ గుర్తింపు, చెల్లింపులు, ఈ–గవర్నెన్స్ రంగాల్లో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు (డీపీఐ) సంబంధించిన సాంకేతిక నైపుణ్యం, ఉత్తమ విధానాల పరస్పర మార్పిడి జరుగుతుంది.
ii. నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సీజీజీ) ద్వారా భారత్‌లో నేపాల్ సివిల్ సర్వెంట్ల శిక్షణకు తగిన ఏర్పాటు చేస్తారు.
iii. జాతీయ, రాష్ట్ర– ప్రాంతీయ స్థాయిలలో చట్టసభల మధ్య అనుభవాలు, ఉత్తమ విధానాలను ఇరుపక్షాలు పరస్పరం పంచుకుంటాయి.
iv. భారత్‌లోని సంబంధిత సంస్థలలో సందర్శనలు, శిక్షణా కార్యక్రమాల పరస్పర మార్పిడి ద్వారా స్థానిక పరిపాలనలో సహకారాన్ని ఇరుపక్షాలు బలోపేతం చేసుకుంటాయి.
V. సాంకేతికత, అంతరిక్షం, ఆవిష్కరణలు:
సాంకేతికత వినియోగాన్ని, స్వీకరణను మరింత ప్రోత్సహించేందుకు.. సాంకేతిక కేంద్రంగా ఎదగాలన్న నేపాల్ లక్ష్యానికి అనుగుణంగా ఈ రంగాల్లో భారత్‌కు ఉన్న సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుంటూ భారత్–నేపాల్ భాగస్వామ్యం ఈ కింది కార్యక్రమాలను అమలు చేయడానికి కృషి చేస్తుంది:
i. భారత్‌లో నేపాల్ అంకురాలకు శిక్షణ, మార్గదర్శకత్వం అందించడం.. ఖాట్మండులో ‘స్టార్టప్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‘, పోఖారాలో ‘డిజిటల్ నోమాడ్స్ అండ్ ఇన్నోవేషన్ హబ్‘ ఏర్పాటు చేయడంతో సహా ఇండియన్–నేపాల్ స్టార్టప్ పార్టనర్‌షిప్ నెట్‌వర్క్ (ఇన్–స్పాన్) విస్తరణ.
ii. ప్రైవేట్ పెట్టుబడుల ప్రోత్సాహంతో సహా నేపాల్‌లో డిజిటల్ పార్కులు, డేటా సెంటర్ల అభివృద్ధి.
iii. ‘భాషిణి‘ సహకారంతో సహా నేపాలీ భాష కోసం లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) అభివృద్ధి తదితర అంశాలతో కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం.
iv. ఉపగ్రహ అభివృద్ధి, భూ పరిశీలన, విపత్తు నిర్వహణ కోసం రిమోట్ సెన్సింగ్, సామర్థ్య నిర్మాణం కోసం నేపాల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సంబంధిత నేపాల్ సంస్థలు ఇస్రో, ఇన్–స్పేస్‌తో కలిసి పనిచేయడం ద్వారా అంతరిక్ష రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం.
v. 5జీ లేదా 6జీ, ఇతర తదుపరి తరం నెట్‌వర్క్‌లు వంటి అభివృద్ధి చెందుతున్న టెలికమ్యూనికేషన్ సాంకేతికతలలో సహకారాన్ని పెంపొందించడం.
VI. విద్య, నైపుణ్యాభివృద్ధి:
నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య నిర్మాణానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ శిక్షణ, మానవ వనరుల అభివృద్ధి, విద్యాపరమైన మార్పిడి రంగాలలో మరింత బలమైన సహకారాన్ని సాధించేందుకు ఇరు దేశాలు కృషి చేస్తాయి. ఇందులో భాగంగా ఈ కింది అంశాలు ఉన్నాయి:
i. నేపాల్‌లో ప్రఖ్యాత భారతీయ ఉన్నత విద్యా సంస్థల శాఖలు, క్యాంపస్‌ల ఏర్పాటును పరిశీలిస్తారు. ఇది ఒక ఐఐటీ ఏర్పాటుతో ప్రారంభమవుతుంది.
ii. అత్యంత విజయవంతంగా కొనసాగుతున్న ప్రస్తుత ఉపకారవేతన పథకాలకు కొనసాగింపుగా నేపాల్ విద్యార్థుల కోసం న్యాయశాస్త్రం, సాంకేతికత, కృత్రిమ మేధస్సు (ఏఐ) వంటి నూతన విభాగాలలో ఉపకారవేతనాలు, శిక్షణా అవకాశాలను అందిస్తారు.
iii. విద్యా, శిక్షణా సంస్థల మధ్య మరింత బలమైన భాగస్వామ్యాలతో పాటు అధ్యాపకులు, నిపుణుల పరస్పర మార్పిడిని ప్రోత్సహించి, సంస్థాగతం చేస్తారు.
iv. తయారీ, సేవా రంగాలు, వ్యవస్థాపకతకు సంబంధించిన విభాగాల్లో నేపాల్ యువతకు నైపుణ్యాలు, శిక్షణ అందించేందుకు భారత్ సహకారంతో ఒక వృత్తి విద్యా శిక్షణా సంస్థను ఏర్పాటు చేస్తారు.
VII. క్రీడలు:
క్రీడల వృద్ధికి, సంబంధిత మౌలిక సదుపాయాల అభివృద్ధికి నేపాల్ ఇస్తున్న ప్రాధాన్యతను మరింత బలోపేతం చేయడానికి భారత్, నేపాల్ ఈ కింది ప్రధాన కార్యక్రమాలపై కలిసి పనిచేస్తాయి:
i. జాతీయ, రాష్ట్ర లేదా ప్రాంతీయ స్థాయిలలో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మద్దతు ఇవ్వడంతో పాటు నేపాల్‌లో జాతీయ క్రికెట్ కోచింగ్ లేదా శిక్షణ అకాడమీ ఏర్పాటుకు భారత్ తోడ్పాటునందిస్తుంది.
ii. నేపాల్‌లోని రాష్ట్ర లేదా ప్రాంతీయ క్రికెట్ జట్ల క్రీడాకారులకు భారత్‌లోని జాతీయ శిక్షణా అకాడమీలలో శిక్షణ పొందే అవకాశం కల్పిస్తారు.
iii. నేపాల్‌లో ఆధునిక బహుళ–క్రీడా కేంద్రాల అభివృద్ధితో సహా బ్యాడ్మింటన్, టెన్నిస్, షూటింగ్, అథ్లెటిక్స్ వంటి ఇతర క్రీడల్లో కూడా ఇదే తరహా అవకాశాలను పరిశీలిస్తారు.
iv. సంయుక్త సాహస యాత్రలు చేపట్టడంతో సహా పర్వత క్రీడల్లో సహకారాన్ని పరిశీలిస్తారు.
v. క్రికెట్, ఫుట్‌బాల్, ఇతర క్రీడల్లో భారత్, నేపాల్ క్రీడాకారులు ఒకరి క్రీడా లీగ్‌లలో మరొకరు పాల్గొనే అవకాశాలను అన్వేషించేలా ఇరు దేశాలలోని సంబంధిత క్రీడా సంస్థలు లేదా అధికారులను ప్రోత్సహించడం.
VIII. సంస్కృతి, పర్యాటకం:
ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాలు ద్వైపాక్షిక బంధానికి అత్యంత ముఖ్యమైన మూలస్తంభాలలో ఒకటిగా ఉన్నాయి. ఈ చైతన్యవంతమైన పరస్పర సంబంధాలను మరింత సుసంపన్నం చేయడానికి:
i. ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్‌లు, కొత్త పర్యాటక గమ్యస్థానాలను అభివృద్ధి చేయడానికి భారత్, నేపాల్ భాగస్వామ్యం వహిస్తాయి. ఇందులో భాగంగా జనక్‌పూర్–అయోధ్య, లుంబిని–బోధ్ గయ–సారనాథ్–కుషీనగర్, ఖాట్మండు (పశుపతినాథ్)–వారణాసిలను అనుసంధానించడం.. సోదర–నగర ఒప్పందాల ద్వారా రామాయణ, బౌద్ధ, శివ–శక్తి సర్క్యూట్‌లను అభివృద్ధి చేయటం వంచి చర్యలు చేపడతారు.
ii. నేపాల్, భారత్‌లో ఒకదాని తర్వాత ఒకటిగా వార్షిక యువజన సాంస్కృతిక ఉత్సవాన్ని నిర్వహించడానికి.. చిత్ర నిర్మాణం, నాటకరంగం, లలిత కళలలో కళాకారులకు శిక్షణ, పరస్పర మార్పిడి కార్యక్రమాలను విస్తరించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.
iii. లుంబిని బౌద్ధ విశ్వవిద్యాలయంలో (ఎల్‌బీయూ) ‘నలందా కేంద్రం‘ ఏర్పాటు చేయడం ద్వారా నలందా విశ్వవిద్యాలయం, ఎల్‌బీయూ మధ్య సహకారం మరింత బలోపేతం అవుతుంది.
iv. పర్యాటక, ఆతిథ్య రంగాల్లో యువ పారిశ్రామికవేత్తల మధ్య సహకారాన్ని సులభతరం చేయడానికి, ద్వైపాక్షిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్ల అవగాహన పర్యటనలను ప్రోత్సహించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.
IX. ఆరోగ్యం:
దేశవ్యాప్తంగా సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ నమూనాపై నేపాల్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు, ఆరోగ్య రంగం పట్ల భారత్ అనుసరిస్తున్న విధానానికి మధ్య గణనీయమైన సమన్వయం ఉంది. ప్రస్తుతమున్న పరస్పర అనుకూలతలను దృష్టిలో ఉంచుకొని ఈ రంగంలో మరింత బలమైన సహకారాన్ని పెంపొందించడానికి ఇరుపక్షాలు ఈ కింది చర్యలు తీసుకుంటాయి:
i. నేపాల్ ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆరోగ్య కేంద్రాలు, ప్రసూతి కేంద్రాలు, ఆసుపత్రుల నిర్మాణం కోసం హై–ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (హెచ్ఐసీడీపీ) విధానం కింద ప్రాజెక్టులను కొనసాగించడం ద్వారా ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం.
ii. నేపాల్ జాతీయ వైద్య ప్రయోగశాల ఆధునికీకరణకు పరస్పరం సహకరించుకోవడం.
iii. తక్కువ ధరలకు నాణ్యమైన మందుల లభ్యతను మెరుగుపరిచేందుకు భారత్–నేపాల్ జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయడం.
iv. నేపాల్ ఆరోగ్య సంరక్షణ నిపుణుల సామర్థ్య నిర్మాణం కోసం భారతీయ సాంకేతిక, ఆర్థిక సహకార కార్యక్రమం (ఐటీఈసీ) కింద ఆరోగ్య సంబంధిత రంగాల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం.
v. ఇరు దేశాల్లోని ప్రముఖ వైద్య సంస్థల మధ్య అనుబంధాలను పెంపొందించడం.. విద్యార్థులు, అధ్యాపకుల పరస్పర మార్పిడిని ప్రోత్సహించడం.
vi. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), నేపాల్ ఆరోగ్య పరిశోధనా మండలి (ఎన్‌హెచ్ఆర్‌సీ) మధ్య.. భారత ఔషధ నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ), నేపాల్ ఔషధ నియంత్రణ విభాగం మధ్య పరిశోధన సహకారాన్ని బలోపేతం చేయడం.
X. వ్యవసాయం:
అనుభవాల పరస్పర మార్పిడి, శిక్షణ– ముసాయిదా ఒప్పందాల ఖరారు వంటి అంశాలతో సహా ఈ రంగంలో భారత్, నేపాల్ మధ్య గణనీయమైన పరస్పర సహకారం కొనసాగుతోంది. ఈ రంగంలో భవిష్యత్ దృక్పథంతో కూడిన భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడానికి, ఇరుపక్షాలు ఈ కింది చర్యలు చేపడతాయి:
i. నేపాల్ వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు కల్పించేందుకు భారతదేశ గ్రాంట్ సహాయంతో చిత్వాన్‌లో ఒక వ్యవసాయ–పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయడం.
ii. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్), నేపాల్ వ్యవసాయ పరిశోధనా మండలి (ఎన్ఏఆర్‌సీ) మధ్య 2026–2030 కార్యాచరణ ప్రణాళిక అమలును వేగవంతం చేయడం.
iii. నేపాల్ అధికారులు, రైతులు, ఇతర వ్యవసాయ సంబంధిత నిపుణుల సామర్థ్య నిర్మాణం కోసం వ్యవసాయం, పశుసంవర్ధక సంబంధిత రంగాల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం.
iv. నేపాల్‌లో ఒక ఐకార్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయడం, ప్రముఖ వ్యవసాయ విశ్వవిద్యాలయాలను అనుసంధానించడం.. వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల్లో నేపాల్ అధికారులు, రైతులు, పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక శిక్షణను ఏర్పాటు చేయడం.
అమలు విధివిధానాలు
నేపాల్ విదేశాంగ కార్యదర్శి, భారత రాయబారి నేతృత్వంలోని ఉన్నత స్థాయి పర్యవేక్షణ బృందాన్ని క్రియాశీలం చేయాలని ఇరువురు ప్రధానమంత్రులు నిర్ణయించారు. ఈ పర్యవేక్షణ బృందం కనీసం ఆరు నెలలకు ఒకసారి సమావేశమై ప్రతిపాదిత ప్రాజెక్టులు, ఆలోచనలు, కార్యక్రమాల వేగవంతమైన అమలును నిర్ధారించటంతో పాటు సంబంధిత అనుమతులు, ఆమోదాలను సులభతరం చేస్తుంది.
ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సహ–అధ్యక్షతన గల భారత్–నేపాల్ సంయుక్త కమిషన్‌కు ఈ ఉన్నత స్థాయి పర్యవేక్షణ బృందం తన నివేదికను సమర్పించాలని ఇరువురు నేతలు అంగీకరించారు. భారత్–నేపాల్ సంయుక్త కమిషన్ తదుపరి సమావేశాన్ని 2027లో నిర్వహించాలని నేతలు నిర్ణయించారు.
రెండు స్నేహపూర్వక దేశాల మధ్య ఆకాంక్షాత్మకమైన, ఆధునికమైన, పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యానికి ఈ ఉమ్మడి దార్శనిక పత్రం ఒక సమగ్ర నమూనాను అందిస్తుందని ప్రధానమంత్రులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఉమ్మడి దార్శనికతను సాకారం చేసే దిశగా కృషి చేయాలని భారత్, నేపాల్‌ల అధికారులను వారు ఆదేశించారు.
***