పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఉత్తర గువాహాటీ రెవిన్యూ సర్కిల్ పరిధిలోని కామరూప్ లో కొత్త ఎఐఐఎమ్ఎస్ ను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1123 కోట్లు. దీనిని ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పిఎమ్ఎస్ఎస్ వై) లో భాగంగా నెలకొల్పనున్నారు.
కొత్త ఎఐఐఎమ్ఎస్ ను భారత ప్రభుత్వ ఆమోదం లభించిన నాటి నుండి 48 మాసాల లోపల పూర్తి చేస్తారు. స్థూలంగా పరిశీలించినప్పుడు నిర్మాణ పూర్వ దశ 15 నెలలుగాను, నిర్మాణ దశ 30 నెలలుగాను, స్థిరీకరణ/కమిషనింగ్ దశ మూడు నెలలు గాను ఉంటుంది.
వివరాలు:
ఈ సంస్థలో 750 పడకల సామర్థ్యం కలిగిన ఒక ఆసుపత్రి, ట్రామ సెంటర్ సదుపాయాలు, సంవత్సరానికి 100 మంది ఎమ్ బిబిఎస్ విద్యార్థులను చేర్చుకొని వారికి విద్యను బోధించే ఒక వైద్య కళాశాల, సంవత్సరానికి 60 మంది బి.ఎస్ సి. (నర్సింగ్) విద్యార్థులను చేర్చుకొని వారికి విద్యను బోధించే ఒక నర్సింగ్ కళాశాల, ఆశ్రమ భవన సముదాయాలు, ఇంకా సంబంధం గల సౌకర్యాలు/ సేవలు ఉంటాయి. ఇవన్నీ దాదాపుగా న్యూ ఢిల్లీ లోని ఎఐఐఎమ్ఎస్ కోవలోనే ఉంటాయి. ఆసుపత్రిలో 16 ఆపరేషన్ థియేటర్లు, 22 స్పెషాలిటీ/ సూపర్- స్పెషాలిటీ విభాగాలు కూడా ఉంటాయి. సాంప్రదాయక వైద్య విధానంలో చికిత్సను అందజేసేందుకు 30 పడకలతో ఓ ఎవైయుఎస్ హెచ్ (‘ఆయుష్’) విభాగం కూడా ఇందులో ఉంటుంది.
ప్రభావం:
కొత్తగా ఏర్పాటుచేసే ఎఐఐఎమ్ఎస్ రెండు రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఆ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ తరహాకు చెందిన ఆరోగ్య సంరక్షణ సేవలను సమకూర్చడమే కాకుండా, ఆ ప్రాంతంలో వైద్యులను మరియు ఇతర ఆరోగ్య శ్రామికులను పెద్ద సంఖ్యలో తయారు చేయడంలో సహాయకారి కానుంది. ఈ సిబ్బంది జాతీయ స్వస్థత అభియాన్ (ఎన్ హెచ్ఎమ్) లో భాగంగా నెలకొల్పుతున్న ప్రాథమిక మరియు మాధ్యమిక సంస్థలు/ సదుపాయాలకు కూడా వారి సేవలను అందించగలుగుతారు.
పూర్వరంగం :
ఈ పథకంలో భాగంగా ఎఐఐఎమ్ఎస్ లను భువనేశ్వర్, భోపాల్, రాయ్ పుర్, జోధ్ పూర్, రుషికేశ్, పట్నా లలో ఏర్పాటు చేయడం జరిగింది. కాగా, రాయ్ బరేలీలో ఎఐఐఎమ్ఎస్ నిర్మాణ పనులు పురోగమిస్తున్నాయి. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరి లోను, పశ్చిమ బెంగాల్ లోని కళ్యాణి లోను మరియు మహారాష్ట్ర లోని నాగ్ పుర్ లోను మరో మూడు ఎఐఐఎమ్ఎస్ లను 2015 సంవత్సరంలో మంజూరు చేయడం జరిగింది. గోరఖ్ పూర్ మరియు భటిండా లలో మరో రెండు ఎఐఐఎమ్ఎస్ లను 2016 సంవత్సరంలో మంజూరు చేశారు.
****