పిఎంఇండియా
2008, 2011 లలో సంతకాలు జరిగిన అవగాహనపూర్వక ఒప్పందాల (ఎమ్ఒయు ల)కు మరియు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ), కాలేజ్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టడీస్ (సిబిఎఫ్ఎస్), ఓమాన్ ల మధ్య ఎమ్ ఒ యు నవీకరణకు కేంద్ర మంత్రిమండలి ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ ఎమ్ఒయు ఓమాన్‌లో గల అకౌంటింగ్, ద్రవ్య, ఆడిట్ పరిజ్ఞానాల బలోపేతానికి ఉమ్మడిగా కృషి చేసేందుకు వీలు కల్పిస్తుంది.
మధ్య ప్రాచ్యంలో ఐసిఎఐ కి 6,000 మంది సభ్యులు ఉన్నారు. ఓమాన్ పౌరులకూ సంస్థలో సభ్యత్వం ఇవ్వడం ద్వారా సిబిఎఫ్ఎస్ కు సహాయ సహకారాలు అందించడం లక్ష్యంగా ప్రస్తుత ఎమ్ఒయు ను కుదుర్చుకొన్నారు. సభ్యులు, విద్యార్థులు, సంస్థల అత్యుత్తమ పరస్పర ప్రయోజనాలతో కూడిన సంబంధాలను అభివృద్ధి చేయడమే ఈ ఉమ్మడి కృషి ధ్యేయం. అంతేకాకుండా, ఐసిఎఐ సభ్యులు వారి వృత్తిపరమైన ప్రాబల్యాన్ని విస్తరించుకొనేందుకు ఈ ఎమ్ఒయు అవకాశం కల్పిస్తుంది. అదే సమయంలో ఓమాన్‌లో ఆసక్తి గల పౌరులకు వృత్తిపరమైన సామర్థ్యాలను బలోపేతం చేసే సంస్థగా అవతరించాలని ఐసిఎఐ భావిస్తోంది.
ఇటువంటి కార్యకలాపాలు భారతదేశానికి, ప్రవాస భారతీయ పౌరులకు, ఓమాన్ లోని భారత చార్టర్డ్ అకౌంటెంట్ లకు గణనీయ సౌహార్ద లబ్ధిని చేకూర్చగలదని భావిస్తున్నారు. దీని వల్ల ప్రవాసులు భారతదేశానికి పంపే ద్రవ్యంలో పెరుగుదలకు కూడా ఈ ఎమ్ఒయు దోహదపడగలదని అంచనా. ఓమాన్‌లో వృత్తిపరమైన సామర్థ్యం గల అకౌంటెన్సీ సంస్థ లేనందువల్ల ఐసిఎఐ అక్కడి సిబిఎఫ్ఎస్ తో సంయుక్తంగా సదరు వృత్తిపరమైన అంశాల్లో తోడ్పాటును అందిస్తోంది. ఓమాన్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్ లకే గాక ఓమాన్ లోని ఇతర సంస్థల కోసం పనిచేసే ఆసక్తి గల భారతీయ అకౌంటెంట్ లు అక్కడికి చేరడానికి ఇది సానుకూలత చూపుతుందని భావిస్తున్నారు. అలాగే ఓమాన్ సల్తనత్ లో భారతీయ అకౌంటింగ్ వృత్తి నిపుణులకు లభించే కొత్త ఉపాధి అవకాశాల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
పూర్వ రంగం
భారత పార్లమెంటులో ది చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్-1949ని ఆమోదించడం ద్వారా ఐసిఎఐ చట్టబద్ధ సంస్థగా అవతరించింది. ఇదే విధంగా ఓమాన్ సల్తనత్ రాచ ఉత్తర్వు ఆధారంగా సిబిఎఫ్ఎస్ కూడా ప్రభుత్వ సంస్థగా ఏర్పడింది. బ్యాంకర్లకు అవగాహన, శిక్షణతో పాటు బ్యాంకింగ్, ఆర్థికాంశాలపై పరిశోధనలు లక్ష్యంగా ఈ సంస్థ ఉనికిలోకి వచ్చింది. అంతేకాకుండా ఓమాన్ కేంద్ర బ్యాంకు (సిబిఒ) చట్టబద్ధ పర్యవేక్షణలో వాణిజ్య బ్యాంకుల మద్దతుతో ఈ కళాశాల పనిచేస్తుంది. ఓమాన్‌లోని అకౌంటింగ్ పరిశ్రమకు గడచిన మూడు దశాబ్దాలుగా ఈ కళాశాల సేవలు అందిస్తోంది. ఆ మేరకు ప్రగతిపథంలో పయనిస్తున్న ఓమాన్ భవిష్యత్ అవసరాలకు దీటైన విద్యా, శిక్షణ కోర్సుల రూపకల్పన, నిర్వహణద్వారా మానవ వనరుల అవసరాలను తీరుస్తోంది.