పిఎంఇండియా
ఉన్నత విద్యా సంస్థలలో మూలధన ఆస్తులను సృష్టించడానికి వీలుగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ (హెచ్ ఇ ఎఫ్ ఎ) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. దేశంలోని ప్రధాన విద్యా సంస్థలలో ఉన్నత స్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను కల్పించడం ఈ హెచ్ ఇ ఎఫ్ ఎ ముఖ్యోద్దేశం.
గుర్తించిన ఓ ప్రమోటర్, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ (ఎమ్ హెచ్ ఆర్ డి) లు కలసి రూ.2,000 కోట్ల అధీకృత మూలధనంతో హెచ్ ఇ ఎఫ్ ఎ ను ప్రమోట్ చేస్తాయి. ప్రభుత్వ ఈక్విటీ రూ.1,000 కోట్లు ఉంటుంది.
ప్రభుత్వ రంగ బ్యాంకు/ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్ బి ఎఫ్ సి (ప్రమోటర్)లో భాగంగా ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్ పి వి)గా హెచ్ ఇ ఎఫ్ ఎ ను ఏర్పాటు చేస్తారు. ఐ ఐ టి లు, ఐ ఐ ఎమ్ లు, ఎన్ ఐ టి లు ఇంకా అటువంటి ఇతర సంస్థలలో ప్రపంచ శ్రేణి ప్రయోగశాలలను తీర్చిదిద్దడానికి మరియు ఆధునిక మౌలిక వసతుల కల్పన కోసం ఈక్విటీని రూ.20,000 కోట్ల వరకు పెంచుకొనేందుకు హెచ్ ఇ ఎఫ్ ఎ ప్రయత్నిస్తుంది.
అంతే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు పీఎస్‌యూలు/ కార్పొరేట్ ల నుండి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి ఎస్ ఆర్) నిధులను కూడా హెచ్ ఇ ఎఫ్ ఎ సమీకరిస్తుంది. ఈ నిధులను ఆయా విద్యా సంస్థలలో పరిశోధన, ఆవిష్కరణ కోసం గ్రాంటు మూలంగా విడుదల చేస్తారు.
ఆయా విద్యా సంస్థలలో ప్రయోగశాలలు, ఇతర నిర్మాణాలకు హెచ్ ఇ ఎఫ్ ఎ పది సంవత్సరాల రుణం పద్ధతిలో ద్రవ్య సహాయం చేస్తుంది. రుణంలో అసలు భాగాన్ని సంస్థల ‘అంతర్గత వనరుల’ (రుసుం వసూళ్లు, పరిశోధన ఆదాయం వంటి వాటి ద్వారా ఆర్జించింది) నుండి తిరిగి చెల్లిస్తారు. వడ్డీ భాగాన్ని నియమిత ప్రణాళిక సహాయం ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తున్న విద్యాసంస్థలన్నింటికీ ఈ హెచ్ ఇ ఎఫ్ ఎ లో సభ్యులుగా చేరడానికి అర్హత ఉంటుంది. సభ్యలుగా చేరేందుకు ఆ సంస్థలు వాటి అంతర్గత వనరుల నుండి నిర్ధిష్ట సొమ్మును పది సంవత్సరాల పాటు ఎస్క్రో అకౌంట్‌లో వేయాడానికి అంగీకరించాలి. ఇలా అందే సొమ్మును హెచ్ ఇ ఎఫ్ ఎ మార్కెట్ నుండి నిధులను సమీకరించడం కోసం సెక్యూరిటైజ్ చేస్తుంది. ఎస్క్రో అకౌంట్‌లో వేసిన సొమ్ము ఆధారంగా ప్రతి ఒక్క సభ్యత్వ విద్యాసంస్థ హెచ్ ఇ ఎఫ్ ఎ నిర్ణయించిన ప్రకారం రుణ పరిమితికి కూడా అర్హతను కలిగి ఉంటుంది.