Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒడిశాలోని బెర్హామ్‌పూర్‌లో కొత్త ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’ ఏర్పాటు, పని ప్రారంభించటం.


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ కింది అంశాలకు ఆమోదం తెలిపింది:

1. ఒడిశాలోని బెర్హమ్‌పూర్‌ సొసైటీ కింద సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం 1860 ప్రకారం.. గతంలో నిర్ణయించినట్లుగా.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) ఏర్పాటునకు ఆమోదం.

2. 2016-17 విద్యాసంవత్సరం నుంచి బెర్హమ్‌పూర్‌లో ఐఐఎస్‌ఈఆర్ ను ఏర్పాటుచేసి తాత్కాలిక క్యాంపస్‌నుంచే పని ప్రారంభించాలి. ఇందుకోసం మొదటి మూడేళ్లకు (2016-19) రూ. 152.69 కోట్ల వ్యయం అవుతుంది. 2016-17 విద్యా సంవత్సరం తరగతులు 2016 ఆగస్టు 1 నుంచి ప్రారంభం అయ్యేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

3. ఇందుకోసం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన భూమిని అంగీకరించటం.

4. రూ. 80వేల వేతనంతో డైరెక్టర్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూట్ పదవి ఏర్పాటుకు ఆమోదం.

5. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (రెండో సవరణ) బిల్లు 2016 (అనుబంధం-3) ను పార్లమెంటులో ప్రవేశపెట్టడం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఎన్‌ఐటీఎస్‌ఈఆర్) చట్టం, 2007 (2009లో 27) రెండో షెడ్యూల్‌లో ఐఐఎస్ఈఆర్‌ తిరుపతి, ఐఐఎస్ఈఆర్ బెర్హమ్‌పూర్‌ను చేర్చటం. ఈ మార్పులు చేర్పులతో ముసాయిదాను సిద్ధం చేయాలి. దీని పర్యవసనాలను న్యాయ శాఖ చూసుకుంటుంది.

పూర్వరంగం:

నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఎన్‌ఐటీఎస్‌ఈఆర్) చట్టం, 2012 ప్రకారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్)లు జాతీయ ప్రాముఖ్య కేంద్రాలుగా గుర్తించబడ్డాయి. అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్యాడ్యుయేట్ స్థాయిల్లో శాస్త్ర రంగంలో పరిశోధనలతోపాటు నాణ్యమైన సైన్స్ విద్యను అందించేందుకు వీటికి రూపకల్పన జరిగింది. గతంలో ఐదు ఐఐఎస్‌ఈఆర్ లు (కోల్‌కత, పుణె, మొహాలీ, భోపాల్, తిరువనంతపురంలలో) మాత్రమే ఉండేవి. ఈప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015లో తిరుపతిలో ఐఐఎస్‌ఈఆర్‌ను ప్రారంభించింది.
వివిధ రాష్ట్రాలు, భౌగోళిక ప్రాంతాల్లో ఐఐఎస్‌ఈఆర్‌ల సంఖ్యను పెంచటం, తద్వారా సైన్స్, పరిశోధన రంగాల్లో నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ఆర్థిక మంత్రి 2015లోని తన బడ్జెట్ ప్రసంగంలో ఒడిశాలో ఐఐఎస్‌ఈఆర్ ఏర్పాటును ప్రకటించారు.

దీనికి అనుగుణంగానే, బెర్హమ్‌పూర్‌లోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ భవనంలో తాత్కాలికంగా ఐఐఎస్‌ఈఆర్ క్యాంపస్‌/వర్క్‌షాప్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నేడు ఆమోదం తెలిపింది. ఈ ఏడాదికోసం బీఎస్-ఎంఎస్ కోర్సుల్లో 60 మంది చొప్పున విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. మూడో సంవంత్సరం కల్లా ఎంఎస్ డిగ్రీ, ఎంఎస్-పీహెచ్‌డీ, పీహెచ్‌డీ, పోస్టు డాక్టోరల్ ఫెలోషిప్స్ విద్యార్థులను కలుపుకుని ఈ సంఖ్య 665కు చేరుతుంది. ఈ తాత్కాలిక ప్రాజెక్టు క్యాంపస్ మొత్తం ఖర్చు రూ.152.79 కోట్లు. తాత్కాలిక క్యాంపస్ నిర్మాణానికి పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా హెచ్చార్డీ మంత్రిత్వశాఖలోని ఎడ్‌సీఐఎల్ విభాగాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ తర్వాత క్యాంపస్‌ ఏర్పాటు విధానం మొదలవుతుంది.

****