పిఎంఇండియా
గిఫ్ట్ సిటీ నుంచి షాపూర్ వరకు 3.33 కిలోమీటర్ల పొడవున మెట్రో కారిడార్ విస్తరణకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది. ఇందులో మూడు ఎలివేటెడ్ స్టేషన్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టును దాదాపు నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయడం లక్ష్యంగా నిర్దేశించారు.
ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,067.35 కోట్లు. ఈ విస్తరించిన కారిడార్ 2029 నాటికి సుమారు 23,702 మంది ప్రయాణికులకు, 2041 నాటికి సుమారు 58,059 మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా వేస్తున్నారు.
అహ్మదాబాద్, గిఫ్ట్ సిటీ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని ఈ కారిడార్ బలోపేతం చేస్తుంది. ప్రతిపాదిత మార్గంలో ఉన్న ప్రధాన బహుళజాతి కంపెనీలు, విద్యా సంస్థలు, వాణిజ్య కేంద్రాలకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుంది.
ఈ విస్తరణ అహ్మదాబాద్–గిఫ్ట్ సిటీ ప్రాంతాల మధ్య ప్రయాణించే రోజువారీ ప్రయాణికులకు వ్యాపారం, ఉపాధి, విద్యా సంబంధిత ప్రయాణ అవసరాలను తీర్చడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. తద్వారా నెట్‌వర్క్ ఏకీకరణ, ప్రయాణికుల సౌలభ్యం గణనీయంగా మెరుగవుతుంది.
ఈ ప్రాజెక్టు నిర్మాణం సుమారు 1,000 ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. నిర్మాణానంతర దశలో కార్యాచరణ, నిర్వహణ ద్వారా సుమారు 250 మంది ఉపాధి పొందుతారు. ఈ ప్రాజెక్టు పైన పేర్కొన్న సంఖ్యకు సమానమైన ప్రత్యక్ష ఉపాధి అవకాశాలనూ గణనీయ సంఖ్యలో సృష్టిస్తుంది. ఇతర కార్యకలాపాల ద్వారా మరింత మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.
భారత ప్రభుత్వం, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాల 50:50 జాయింట్ వెంచర్ అయిన గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అమలు చేస్తుంది.
నేపథ్యం:
ప్రస్తుతం, గుజరాత్ మెట్రో 68.28 కిలోమీటర్ల విస్తీర్ణంలో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్–I {ఏపీఎంసీ నుంచి మోతెరా స్టేడియం (నార్త్–సౌత్ కారిడార్)… థాల్తేజ్ గామ్ నుంచి వస్త్రల్ గామ్ (ఈస్ట్–వెస్ట్ కారిడార్)}… ఫేజ్–II (మోతెరా స్టేడియం నుంచి మహాత్మా మందిర్, జీఎన్ఎల్యూ నుంచి గిఫ్ట్ సిటీ వరకు) మొత్తం 53 స్టేషన్లతో సెప్టెంబర్-2022 (ఫేజ్–I), జనవరి-2026 (ఫేజ్–II) నుంచి విజయవంతంగా కార్యకలాపాలను ప్రారంభించాయి. ఈ లైన్‌లో ప్రయాణిస్తున్న రోజువారీ ప్రయాణికుల సంఖ్య దాదాపు 1,60,000గా ఉంది.
****