పిఎంఇండియా
గౌరవ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ,
గౌరవ నెసెట్ స్పీకర్ అమిర్ ఒహానా,
గౌరవ ప్రతిపక్షనేత యాయీర్ లాపిడ్,
నా ప్రియమైన సోదరీసోదరులారా,
షలోమ్!
నమస్తే!
గౌరవ సభ్యులారా,
ఈ విశిష్ట సభ ముందు నిలబడటం నాకు దక్కిన గౌరవం, అదృష్టం. భారత ప్రధానమంత్రిగా, ఒక ప్రాచీన నాగరికత ప్రతినిధిగా మరో నాగరికతను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాను. నా వెంట 1.4 బిలియన్ల మంది భారతీయులు అందించిన శుభాకాంక్షలను, స్నేహ సందేశాన్ని, గౌరవాన్ని, భాగస్వామ్యాన్ని తీసుకువచ్చాను.
ఈ అవకాశమిచ్చిన గౌరవ స్పీకర్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెసెట్‌ను భారతీయ రంగుల్లో అలంకరించిన మీ అద్భుతమైన ఆలోచనకు ధన్యవాదాలు. మూడేళ్ల క్రితం, భారత్‌లో పర్యటించిన నెసెట్ తొలి స్పీకర్‌గా మీరు నిలిచారు. ఈ గొప్ప సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న తొలి భారతీయ ప్రధానిని నేను. దీనికి కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
తొమ్మిదేళ్ల కిందట ఇజ్రాయెల్‌లో పర్యటించిన తొలి ప్రధానిగా నాకు గుర్తింపు లభించింది. నన్ను ఎప్పుడూ ఆకర్షించే ప్రదేశానికి మరోసారి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. అన్నింటికీ మించి, 1950, సెప్టెంబర్ 17న ఇజ్రాయెల్‌ను భారత్ అధికారికంగా గుర్తించింది. సరిగ్గా అదే రోజున నేను జన్మించాను.
గౌరవ సభ్యులారా,
‘‘అక్టోబర్ 7’’న హమాస్ చేసిన అనాగరికమైన ఉగ్రదాడిలో కోల్పోయిన ప్రతి ప్రాణానికి, చిన్నాభిన్నమైన ప్రతి కుటుంబానికి భారత ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతిని తీసుకువచ్చాను. మీరు అనుభవిస్తున్న బాధ మాకు తెలుసు. మీ దుఃఖాన్ని మేం పంచుకుంటాం. ఈ క్షణంలోనూ, భవిష్యత్తులో కూడా పూర్తి నిబద్ధతతో ఇజ్రాయెల్ పక్షాన భారత్ దృఢంగా నిలుస్తుంది.
పౌరుల హత్యను ఏ కారణమూ సమర్థించలేదు. ఉగ్రవాదాన్ని ఏదీ సమర్థించదు.
దీర్ఘకాలంగా భారత్ కూడా ఉగ్రవాదం వల్ల ఎదురవుతున్న బాధలను భరిస్తోంది. ఇజ్రాయెలీ పౌరులతో సహా, అమాయకులు ప్రాణాలు కోల్పోయిన 26/11 ముంబయి దాడులను మేం మరచిపోలేదు. మీలాగే, ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు లేకుండా.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించని, స్థిరమైన, రాజీలేని విధానాన్ని అనుసరిస్తున్నాం.
సమాజాలను అస్థిరపరచడం, అభివృద్ధిని నిరోధించడం, నమ్మకాన్ని దెబ్బతీయడమే ఉగ్రవాదం లక్ష్యం. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి స్థిరమైన, సమన్వయంతో కూడిన అంతర్జాతీయ చర్య అవసరం. ఎందుకంటే.. ఉగ్రవాదం ప్రతి ప్రదేశంలోనూ శాంతికి విఘాతం కలిగిస్తుంది. అందుకే, శాశ్వత శాంతి, ప్రాంతీయ స్థిరత్వం కోసం చేపట్టే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతునిస్తుంది.
కొన్నేళ్ల క్రితం, మీరు అబ్రహాం ఒప్పందాలను పూర్తి చేసినప్పడు మీ ధైర్యాన్ని, దార్శనికతను మేం ప్రశంసించాం. దీర్ఘకాలంగా సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతానికి కొత్త ఆశను చిగురింపచేసిన సమయమది. అప్పటి నుంచి, పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. మార్గం మరింత సవాలుగా మారింది. అయినప్పటికీ ఆ ఆశను నిలబెట్టుకోవడం ముఖ్యం.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదించిన గాజా శాంతి ఒప్పందం కూడా ఓ మార్గాన్ని చూపిస్తోంది. ఈ చొరవకు భారత్ తన పూర్తి మద్దతు అందించింది.
మన ప్రయత్నాలు విజ్ఞత, ధైర్యం, మానవత్వంతో కూడి ఉండాలి. శాంతిని సాధించే మార్గం అంత సులభమైనదేమీ కాదు. కానీ ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం మీతో, ప్రపంచంతో భారత్ కలసి నడుస్తోంది.
గౌరవ సభ్యులారా,
ఇజ్రాయెల్ సంకల్పాన్ని, తెగువను, సాధించిన విజయాలను భారత్‌లో బాగా అభిమానిస్తారు. ఆధునిక దేశాలుగా మన మధ్య సంబంధాలు ఏర్పడటానికి చాలా ముందే, సుమారుగా రెండు వేల ఏళ్ల కంటే ముందే మన బంధం ఏర్పడింది. ఎస్తేర్ పుస్తకంలో భారత్‌ను హోదుగా పిలిచారు. పురాతన సమయాల్లో భారత్‌తో వాణిజ్యం చేసినట్లు తాల్ముడ్ రికార్డుల్లో ఉంది.
మధ్యధరాను హిందూ మహాసముద్రంతో కలిపే సముద్ర మార్గాల్లో యూదు వర్తకులు ప్రయాణించారు. వారు అవకాశాన్ని, గౌరవాన్ని వెతుక్కుంటూ భారత్‌కు వచ్చారు. మాలో ఒకరిగా మారిపోయారు.
ఎలాంటి హింస, వివక్ష అన్న భయం లేకుండా భారత్‌లో యూదు సమాజాలు నివసించాయి. వారు తమ విశ్వాసాన్ని పరిరక్షించుకున్నారు. సమాజంలో భాగస్వాములయ్యారు. ఇది మనం గర్వించాల్సిన అంశం.
గౌరవ సభ్యులారా,
మహారాష్ట్రలో ఉన్న బెనె ఇజ్రాయెల్, కేరళంలోని కొచ్చిని యూదులు, కోల్ కతా, ముంబయిలోని బాగ్దాదీ యూదులు, ఈశాన్య రాష్ట్రాల్లోని బ్నె మెనాషేలు భారత్‌ను సుసంపన్నం చేశారు. నా స్వరాష్ట్రం గుజరాత్‌లో బెనె ఇజ్రాయిలీ కుటుంబమైన – మిస్టర్ అండ్ మిసెస్ బెస్ట్ ఓ పాఠశాలను ప్రారంభించారు. అది చాలా గొప్ప పాఠశాల. నిజానికి దానిని ఉత్తమ పాఠశాల అని పిలుస్తారు.
భారత చలనచిత్ర విభాగాన్ని ఎడ్విన్ మైయర్స్ తీర్చిదిద్దారు. భారతీయ సినిమా చరిత్రలో ఆయన ఓ దిగ్గజం. అహ్మదాబాద్‌లోని కంకారియా జూ వ్యవస్థాపకులు డాక్టర్ రూబెన్ డేవిడ్. నటుడు డేవిడ్ అబ్రహాం చౌల్కర్ (అంకుల్ డేవిడ్) దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితమే. ఆల్ ఇండియా రేడియో సిగ్నేచర్ ట్యూన్‌కు వాల్టర్ కాఫ్‌మన్ బాణీలు రూపొందించారు. భారత సమాజానికి ఇప్పటికీ సేవలందిస్తున్న అనేక సంస్థలను డేవిడ్ ససూన్ నిర్మించారు.
అలాగే, 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో లెఫ్టినెంట్ జనరల్ జేఎఫ్ఆర్ జాకబ్ వీరోచిత సేవలు సుప్రసిద్ధం. ఆయన పదవీ విరమణ చేసిన అనంతరం ఆయనతో కలసి పనిచేసే అదృష్టం నాకు దక్కింది. ఎన్నో కప్పుల టీ తాగుతూ భారత్–ఇజ్రాయెల్ సంబంధాలు, అనేక ఇతర అంశాల గురించి మేం చర్చించాం. ఇలా అనేక మంది భారతదేశ సంక్షేమానికి విశిష్ట సేవలు అందించారు.
గౌరవ సభ్యులారా,
ఇరవయ్యో శతాబ్దం మధ్యలో అనేక మంది యూదులు భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు వలస వచ్చారు. ఇప్పుడు, శక్తిమంతమైన భారతీయ మూలాలున్న యూదు సమాజం ఇక్కడ నివసిస్తోంది. ప్రయోగశాలలు, ఆసుపత్రులు, తరగతి గదులు, యుద్ధ రంగంలో సేవలందిస్తూ.. ఆధునిక ఇజ్రాయెల్ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించారు. ఇజ్రాయెల్‌ను తమకు పితృభూమిగా, భారత్‌ను మాతృభూమిగా వారు పరిగణిస్తారు. వారిని చూసి మేం గర్విస్తున్నాం.
గౌరవ సభ్యులారా,
ఈ భూమితో భారతదేశానికున్న అనుబంధం రక్తం, త్యాగంతో లిఖితమైంది. మొదటి ప్రపంచ యుద్ధంలో నాలుగు వేల మందికి పైగా భారతీయులు ఈ ప్రాంతంలో తమ ప్రాణాలను అర్పించారు. 1918 సెప్టెంబర్లో హైఫా వద్ద జరిగిన ఆశ్విక దాడి సైనిక చరిత్రలో ముఖ్యమైన అధ్యాయంగా నిలిచిపోయింది.
ఈ ఉమ్మడి చరిత్రకు హైఫా వీరుడిగా చిరస్మరణీయుడైన మేజర్ ఠాకూర్ దలపత్ సింగ్ చిహ్నంగా నిలిచారు. గత పర్యటనలో భారతీయ సైనికుల కోసం ఏర్పాటు చేసిన హైఫా స్మారకం వద్ద నివాళులు అర్పించాను.
గౌరవ సభ్యులారా,
గత నెలలో అంతర్జాతీయంగా ప్రపంచ హాలోకాస్ట్ సంస్మరణ దినం నిర్వహించారు. మానవజాతి చీకటి అధ్యాయాల్లో హాలోకాస్ట్ ఒకటి. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కొన్ని మానవతా చర్యలు ప్రత్యేకంగా నిలుస్తాయి. జామ్ సాహెబ్‌గా గుర్తింపు పొందిన గుజరాత్‌లోని నవానగర్ మహారాజు పోలెండ్ చిన్నారులతో పాటు యూదు బాలలకు సైతం ఆశ్రయమిచ్చారు. మోషావ్ నెవాటిమ్‌లో జామ్ సాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించారని తెలుసుకున్నాను.
ఈ గౌరవానికి, స్మృతికి ధన్యవాదాలు.
గౌరవ సభ్యులారా,
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం, భారతీయ నాయకులు ఇజ్రాయెల్ ప్రజలతో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎడారిలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసిన ఇజ్రాయెల్ కృషి గురించి 1950ల్లో భారత పార్లమెంటులో చర్చించారు. ఇది మా నాయకులకున్న అభిమానానికి నిదర్శనం. ఆచార్య వినోబాభవే, లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ్ లాంటి మా నాయకులు ఇజ్రాయెల్ కిబ్బట్జ్ ఉద్యమం నుంచి స్ఫూర్తి పొందారు. వ్యవసాయంలో ‘‘పర్ డ్రాప్, మోర్ క్రాప్’’ విధానం తొలుత నా స్వరాష్ట్రమైన గుజరాత్‌లో, ఆ తర్వాత భారతదేశమంతటా అనేక అద్భుతాలను సాధించడాన్ని నేను గమనించాను.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2006లో నేను ఇజ్రాయెల్‌ను తొలిసారి సందర్శించాను. తర్వాత 2017లో ప్రధానమంత్రిగా ఇజ్రాయెల్‌ను సందర్శించినప్పుడు, మన రెండు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంగా సంబంధాలను మెరుగుపరుచుకున్నాయి. అప్పటి నుంచి మన భాగస్వామ్యం తన స్థాయిని, పరిధిని విస్తరిస్తోంది. అనేక రంగాల్లో ఈ సంబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం.
గౌరవ సభ్యులారా,
గడచిన కొన్నేళ్లుగా, ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. త్వరలోనే మూడు అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారబోతున్నాం. అదే సమయంలో ఇజ్రాయెల్ ఆవిష్కరణలకు, సాంకేతిక నాయకత్వానికి శక్తి కేంద్రంగా ఉంది. ఇది భవిష్యత్తు ఆధారిత భాగస్వామ్యానికి సహజ పునాదిని ఏర్పాటు చేస్తుంది.
వాణిజ్యాన్ని విస్తరించేందుకు, పెట్టుబడులను బలోపేతం చేసేందుకు, ఉమ్మడి మౌలిక వసతుల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. గతేడాది కుదుర్చుకున్న ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం మన వ్యాపారాలకు ఆత్మవిశ్వాసాన్ని, హామీని ఇస్తుంది.
గత కొన్నేళ్లలో ఇతర దేశాలతో అనేక ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలను భారత్ ఖరారు చేసింది. మీ పశ్చిమంలో యూరోపియన్ యూనియన్, యూకే, మీ తూర్పు దిశలో యూఏఈ, ఒమన్ దేశాలతో ఈ ఒప్పందాలు కుదిరాయి.
ఇటీవలి సంవత్సరాల్లో మన ద్వైపాక్షిక వస్తు వాణిజ్యం అనేక రెట్లు పెరిగింది. కానీ, ఇది మనకున్న అవకాశాల పూర్తి పరిధిని ప్రతిబింబించడం లేదు. అందుకే మన బృందాలు స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంపై చర్చించడానికి విశేష కృషి చేస్తున్నాయి. ఇది మన వాణిజ్య సంబంధాలకున్న విస్తృత సామర్థ్యాన్ని వెలికి తీస్తుంది.
భారత్–మధ్యప్రాచ్య–ఐరోపా ఆర్థిక కారిడార్, భారత్, ఇజ్రాయెల్, యూఏఈ, యూఎస్ మధ్య ఐ2యూ2 విధానం లాంటి విభిన్నమైన విధానాలపై కలసి పని చేయాలి. మన భాగస్వామ్యంలో రక్షణ, భద్రత ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. గతేడాది నవంబర్‌లో రక్షణ సహకారానికి ఎంవోయూపై మనం సంతకం చేశాం. అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత ప్రపంచంలో ఇండియా, ఇజ్రాయెల్ లాంటి విశ్వసనీయమైన భాగస్వాముల మధ్య బలమైన రక్షణ సహకారం అత్యంత కీలకం.
గౌరవ సభ్యులారా,
ఇజ్రాయెల్‌ను ‘‘స్టార్టప్ నేషన్’’ అని పిలుస్తారు. ఇటీవలి కాలంలో మేం కూడా మా దేశ యువతలో ఆవిష్కరణలను, సృజనాత్మకతను వెలికి తీసేందుకు కృషి చేస్తున్నాం. 2018లో నేను, ప్రధానమంత్రి నెతన్యాహు కలసి ఐక్రియేట్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్‌ను భారత్‌లో ప్రారంభించాం. అప్పటి నుంచి, ఈ సంస్థ 900 అంకుర సంస్థలకు తోడ్పాటు అందించింది.
గత వారమే ప్రపంచలోనే అతి పెద్దదైన, అత్యంత ప్రజాస్వామ్యపూరితమైన ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు మేం ఆతిథ్యమిచ్చాం. దీనిలో 100కు పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్ ఆవిష్కరణల వ్యవస్థకు మా ఆకాంక్షాత్మక స్ఫూర్తి సహజంగానే అనుగుణంగా ఉంటుంది. క్వాంటం సాంకేతికత, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ లాంటి రంగాల్లో అనేక సారూప్యతలు కనిపిస్తున్నాయి. డిజిటల్ పౌర మౌలిక వసతులను ఉపయోగించుకొని సీమాంతర ఆర్థిక సంబంధాలను ఏర్పాటు చేసేందుకు ఇజ్రాయెల్‌తో కలసి పనిచేస్తున్నాం.
గౌరవ సభ్యులారా,
ఎడారిలో ఇజ్రాయెల్ చేపట్టిన వ్యవసాయం మాకెంత స్ఫూర్తిదాయకమో నేను చెప్పాను. కచ్చితమైన నీటిపారుదల, నీటి నిర్వహణలో ఇజ్రాయెలీ నైపుణ్యం ఇప్పటికే భారత్‌లో వ్యవసాయ పద్ధతులను మార్చేసింది.
భారత్‌లో లక్షలాది రైతులకు శిక్షణ ఇచ్చేందుకు 43 ఎక్సలెన్స్ సెంటర్లను సంయుక్తంగా ఏర్పాటు చేశాం. అలాగే లక్షలాది రైతులు, మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేలా ఈ కేంద్రాలను 100కు పెంచాలనే లక్ష్యాన్ని మనం నిర్దేశించుకోవాలి.
గౌరవ సభ్యులారా,
మన ప్రజల మధ్య సంబంధాలే భారత్–ఇజ్రాయెల్ భాగస్వామ్యానికి కేంద్రంగా ఉన్నాయి. 2006లో నేను ఇజ్రాయెల్‌ను మొదట సందర్శించినప్పుడే వేళ్లపై లెక్కపెట్టే సంఖ్యలో మాత్రమే యోగా కేంద్రాలుండేవి. ఇప్పుడు దాదాపు అన్ని చోట్లా యోగాను అభ్యసిస్తున్నారు.
అలాగే ఆయుర్వేదంపై ఇజ్రాయెల్లో ఆసక్తి పెరుగుతోందని విన్నాను. భారత్‌ను సందర్శించమని ఇజ్రాయెలీ యువతను నేను ఆహ్వానిస్తున్నాను. మా సమాజం వేగాన్ని వారు చూస్తారు. సమగ్ర ఆరోగ్యం విధానం వల్ల శరీరానికి, మనసుకు ఎలాంటి మేలు జరుగుతుందో అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు.
ఇజ్రాయెల్ కోసం పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూపును భారత పార్లమెంట్ ఏర్పాటు చేసిందని ఈ సభకు తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను. మీ అందరినీ భారత్‌లో పర్యటించాలని ఆహ్వానిస్తున్నాను. మన పార్లమెంటు సభ్యుల మధ్య మరిన్ని చర్చల కోసం ఎదురు చూస్తున్నాను.
భారతదేశానికి చెందిన సహయకులు, నిపుణులు ఇజ్రాయెల్ కుటుంబాలకు, సమాజాలకు అపారమైన సహకారాన్ని అందిస్తున్నారని నాకు తెలుసు. అక్టోబర్ 7 తో సహా సంక్షోభ సమయంలో వారు అసమానమైన ధైర్యాన్ని, అంకిత భావాన్ని కనబరిచారు. వారిని చూసి మేం గర్విస్తున్నాం.
‘‘ఒక ప్రాణాన్ని రక్షించిన వారు మొత్తం ప్రపంచాన్నే రక్షిస్తారు’’ అని యూదుల బోధన మనకు గుర్తు చేస్తుంది. మన సహకారం వెనక ఉన్న మానవ సంబంధాల బలాన్ని వారి సేవలు ప్రతిబింబిస్తున్నాయి. రెండు దేశాలకు ప్రయోజనం చేకూర్చేలా వివిధ రంగాల్లో కార్మికులు, నిపుణుల ప్రయాణ సౌలభ్యాన్ని మేం కొనసాగిస్తాం.
గౌరవ సభ్యులారా,
మన నాగరికతలు రెండూ పురాతనమైనవి. అందుకే మన నాగరికత సంప్రదాయాల్లో తాత్విక స్వరూపాలు ఒకే విధంగా ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇజ్రాయెల్లో టిక్కున్ ఓలం అనే సూత్రం ప్రపంచాన్ని మెరుగుపరచడం గురించి మాట్లాడుతుంది. ఈ ప్రపంచమంతా ఒకటే కుటుంబమని భారతదేశ వసుధైవ కుటుంబం స్పష్టం చేస్తుంది. సరిహద్దులను దాటి విస్తరించిన బాధ్యతను ఈ రెండు ఆలోచనలూ తెలియజేస్తాయి. కరుణ, నైతిక ధైర్యంతో వ్యవహరించాలని అవి సమాజాలకు సూచిస్తాయి.
న్యాయం, ఆచరణ ద్వారా మన దైనందిన జీవితాన్ని నిర్దేశించే హలాఖాకు యూదు మతం ప్రాధాన్యమిస్తుంది. బాధ్యత, సరైన చర్యలను తీర్చిదిద్దే నైతిక వ్యవస్థ అయిన ధర్మం గురించి హిందూతత్వం మాట్లాడుతుంది. మనం చేసే పనుల ద్వారానే నైతిక జీవనం సాధ్యమవుతుందని, ప్రవర్తన ద్వారానే విశ్వాసం వ్యక్తమవుతుందని ఈ రెండు సంప్రదాయాలు తెలియజేస్తున్నాయి.
మన పండగల్లో కూడా సారూప్యత ఉంది. కొవ్వొత్తుల వెలుగుల్లో హనుక్కాను మీరు జరుపుకొంటారు. అదే సమయంలో దీపాల పండగ దీపావళిని మేం జరుపుకొంటాం. ఆనందం, రంగులతో నిండిన హోలీ పర్వదినాన్ని భారత్‌లో నిర్వహించే సమయంలోనే ఇజ్రాయెల్లో పూరిమ్‌ను ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకొంటారు.
గౌరవ సభ్యులారా,
మన ఆధునిక భాగస్వామ్యానికి అవసరమైన శక్తిని మన ఉమ్మడి ఆదర్శాలే అందిస్తున్నాయి. చరిత్ర తీర్చదిద్దిన, భవిష్యత్తుపై దృష్టి సారించిన ప్రజాస్వామ్య దేశాలు మనవి. ఉమ్మడి అనుభవం, ఆకాంక్షలపై మన భాగస్వామ్యం ఆధారపడి ఉంది. జాతీయ ఆసక్తులతో పాటుగా, అంతర్జాతీయ స్థిరత్వానికి, సంక్షేమానికి కూడా మన బలమైన భాగస్వామ్యం దోహదపడుతుంది.
అస్థిరత నిండిన ఈ ప్రపంచంలో భారత్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న స్నేహ బంధం దృఢమైన శక్తిగా నిలిచేలా మనం కృషి చేద్దాం.
ఆమ్ ఇజ్రాయెల్ ఖాయ్,
జై హింద్,
ధన్యవాదాలు.
***
Addressing the Knesset. Do watch my speech. @KnessetENG https://t.co/a8V6Ah5HwY
— Narendra Modi (@narendramodi) February 25, 2026
I bring with me the greetings of 1.4 billion Indians and a message of friendship, respect and partnership: PM @narendramodi at the Knesset pic.twitter.com/9SL3bQjr5Y
— PMO India (@PMOIndia) February 25, 2026
I am very happy to be here again, returning to a land to which I have always felt drawn.
— PMO India (@PMOIndia) February 25, 2026
After all, I was born on the same day that India formally recognised Israel – September 17, 1950: PM @narendramodi at the Knesset pic.twitter.com/4gotvXEsy8
Nothing can justify terrorism: PM @narendramodi pic.twitter.com/VuwpULEjXF
— PMO India (@PMOIndia) February 25, 2026
Countering terrorism requires sustained and coordinated global action, because terror anywhere threatens peace everywhere: PM @narendramodi pic.twitter.com/iUK05sBJi7
— PMO India (@PMOIndia) February 25, 2026
Jewish communities have lived in India without fear of persecution or discrimination.
— PMO India (@PMOIndia) February 25, 2026
They have preserved their faith and participated fully in society: PM @narendramodi at the Knesset pic.twitter.com/cDML2cljFB
The Holocaust stands as one of humanity’s darkest chapters. Yet, even in those turbulent years, some acts of humanity stood out.
— PMO India (@PMOIndia) February 25, 2026
The Maharaja of Nawanagar in Gujarat, also known as the Jam Saheb, offered refuge to Polish children, including Jewish children, who had nowhere else… pic.twitter.com/ptX3SKezs6
In Israel, the principle of Tikkun Olam speaks of healing the world.
— PMO India (@PMOIndia) February 25, 2026
In India, Vasudhaiva Kutumbakam affirms that the world is one family. pic.twitter.com/QhzqqpjHAn
I bring with me the greetings of 1.4 billion Indians and a message of friendship, respect and partnership. pic.twitter.com/fD3P1spB29
— Narendra Modi (@narendramodi) February 25, 2026
We feel your pain.
— Narendra Modi (@narendramodi) February 25, 2026
We share your grief. pic.twitter.com/mmYDPjwwP3
In India, there is great admiration for Israel’s resolve, courage and achievements. pic.twitter.com/pjXIaU5PIt
— Narendra Modi (@narendramodi) February 25, 2026
Historical connect between India and Israel… pic.twitter.com/qnGC88oySx
— Narendra Modi (@narendramodi) February 25, 2026
May the India-Israel friendship remain a source of strength in an uncertain world. pic.twitter.com/aLRDcNJXB1
— Narendra Modi (@narendramodi) February 25, 2026