Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వినాయక చవితి సందర్భంగా సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకుంటూ గణేశుని ఆశీస్సులు కోరిన ప్రధానమంత్రి


వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.  విఘ్నహరుడైన గణేశుని ఆరాధిస్తూ, ఆశీస్సులు అభిలషించే ఈ పవిత్రమైన పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో నవ్యోత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు. గణేశుని దివ్యాశీర్వాదంతో అందరి కృషి ఫలించి, దేశం ప్రగతి పథంలో దూసుకెళ్లాలని శ్రీ మోదీ ప్రార్థించారు.

ఈ నేపథ్యంలో

“ముదాకరత్తమోదకం సదా విముక్తిసాధకం

కలాధరావతంసకం విలాసిలోకరక్షకమ్” అనే సంస్కృత సుభాషితాన్ని ఆయన ప్రజలతో పంచుకున్నారు. అలాగే…

“అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం

నతాశుభాషునాశకం నమామి తమ్‌ వినాయకమ్” అని స్తుతించారు.

“మోదకాలంకృత పవిత్ర హస్తుడైన శ్రీ వినాయక భగవానునికిదే నా శిరసాభివందనం” అన్నది ఈ సుభాషితానికి అర్థం. అలాగే, “సాధకులకు సదా విముక్తిపథ నిర్దేశం చేసేవాడు.. ఫాలభాగాన చంద్రవంకను ఆభరణంగా ధరించినవాడు.. సమస్త విశ్వ రక్షకుడు.. విశ్వమంతటికీ ఏకైక సర్వోన్నత నాథుడు.. గజాసురుడునే రాక్షసుడిని దునుమాడిన వాడు.. తన భక్తులకు సకల దుఃఖాలు, బాధల నుంచి సత్వర విముక్తి  ప్రదాత అయిన విశ్వేశ్వరునికి వందనం” అని రెండో శ్లోకానికి అర్థం.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“గణేశ చతుర్థి సందర్భంగా నా దేశ పౌరులందరికీ అశేష శుభాకాంక్షలు. ఆటంకాలను ఆవలకు నెట్టే దేవుడిని ఆరాధించే, దర్శించుకునే ఈ పర్వదినాన ప్రతి ఒక్కరిలో నవ్యోత్సాహం, ఉత్తేజం నిండేలా ఆశీర్వదించాలని ఆ విఘ్న నాయకుడిని వేడుకుంటున్నాను. ఆయన దివ్యాశీస్సులు అందరి కృషినీ విజయవంతం చేయాలని, దేశ పురోగమనం నిరంతరాయంగా, నిరాటంకంగా సాగిపోయేలా చూడాలని ప్రగాఢంగా ఆకాంక్షిస్తున్నాను.. గణపతి బప్పా మోరియా!” అని పేర్కొంటు ప్రధానమంత్రి పై శ్లోకాలను ఉటంకించారు.

 

***