పిఎంఇండియా
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకాన్ని 2026-27 నుంచి 2030-31 వరకు కొనసాగించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కాలానికి గాను పథకం కోసం రూ.3.15 లక్షల కోట్ల ఆర్థిక కేటాయింపులకు ఆమోదం లభించింది.
రైతుల సమృద్ధే దేశ సమృద్ధికి పునాది అనే ప్రభుత్వ అంకితభావాన్ని ఈ ఆమోదం పునరుద్ఘాటిస్తుంది. పీఎం-కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతుల కుటుంబాలకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) వ్యవస్థ ద్వారా సకాలంలో, పారదర్శక విధానంలో ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారు. ఇది వ్యవసాయ పెట్టుబడులను పెంచుకొనే, జీవనోపాధిని బలోపేతం చేసుకొనే వీలును రైతులకు అందిస్తోంది.
పీఎం-కిసాన్: పారదర్శకమైన, సాంకేతిక ఆధారమైన రైతు సంక్షేమానికి విజయవంతమైన నమూనా
2019 ఫిబ్రవరిలో పీఎం-కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అర్హులైన, భూమి ఉన్న రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం లభిస్తుంది. ఈ మొత్తాన్ని మూడు సమాన వాయిదాల్లో బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారు. ఆధార్ ధ్రువీకరణ, డిజిటల్ ధ్రువీకరణ, పటిష్టమైన డీబీటీ వ్యవస్థ ద్వారా ఈ పథకం పారదర్శకత, సామర్థ్యం, జవాబుదారీతనంలో సమర్థమైన ఉదాహరణగా నిలిచింది.
పీఎం-కిసాన్ పథకం ముఖ్యమైన విజయాలు:
· ఈ పథకం పరిధిలో 23 వాయిదాల ద్వారా 4.47 లక్షల కోట్లకు పైగా నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు.
· 23వ విడత కింద రూ.18,984 కోట్లకు పైగా విడుదల చేయడంతో 9.49 కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందారు.
· కొవిడ్-19 మహమ్మారి సమయంలో రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి రూ.1.71 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేశారు.
· పీఎం-కిసాన్ పథకం ద్వారా మహిళా రైతులకు రూ.1.06 లక్షల కోట్లకు పైగా అందింది. పథకం లబ్ధిదారుల్లో ప్రతి నలుగురిలో ఒక మహిళా రైతు ఉన్నారు.
వ్యవసాయ పెట్టుబడులను, రైతుల ఆదాయాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర:
పీఎం-కిసాన్ పథకం కింద అందుతున్న సాయం వల్ల రైతులు విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల, వ్యవసాయ యంత్రాలు, ఇతర అవసరాలకు సమయానికి పెట్టుబడి పెట్టగలుగుతున్నారు. ఇది రైతుల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, అనధికారిక రుణాలపై ఆధారపడటాన్ని తగ్గించి, గ్రామీణ కుటుంబాల ఆర్థిక స్థితిని బలోపేతం చేసింది.
స్వంతత్ర మూల్యాంకనాల ద్వారా సానుకూల ప్రభావాల నిర్దారణ:
పీఎం-కిసాన్ పథకం ప్రభావాన్ని వివిధ స్వతంత్ర సంస్థలు అంచనా వేశాయి. నీతి ఆయోగ్ పరిధిలోని అభివృద్ధి పర్యవేక్షణ, మూల్యాంకన కార్యాలయం (డీఎంఈవో) నిర్వహించిన అంచనా ప్రకారం:
· ఆర్థిక సాయం కింద అందిన మొత్తాన్ని వ్యవసాయ కార్యకలాపాలు, వ్యవసాయ పెట్టుబడి కోసం వినియోగించుకున్నట్లు 92 శాతం కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు తెలిపారు.
· తమ వ్యవసాయ ఆదాయం పెరిగిందని, అనధికారిక రుణాలపై ఆధారపడటం తగ్గిందని 85 శాతం లబ్ధిదారులు ధ్రువీకరించారు.
2020-21 నుంచి 2025-26 మధ్య కాలంలో ఆహార ధాన్యాల దిగుబడిలో గణనీయమైన వృద్ధి నమోదయింది. ఈ కాలంలో సాగు విస్తీర్ణం సుమారు 9.65 శాతం, ఉత్పాదకత సుమారుగా 10.53 శాతం, మొత్తం ఆహార ధాన్యాల దిగుబడి సుమారుగా 21.18 శాతం పెరిగాయి. ఇది పీఎం-కిసాన్ పథకం పరిధిలో రైతులకు అందుతున్న సమగ్ర మద్దతును, పెరుగుతున్న వ్యవసాయ రంగ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
డిజిటల్ ఇండియా ద్వారా రైతులకు ప్రత్యక్ష ప్రయోజనాలు
డిజిటల్ ఇండియాను సమర్థంగా వినియోగించుకోవడంలో పీఎం-కిసాన్ పథకం ఉదాహరణగా నిలుస్తోంది. ఆధార్ ఆధారిత ధ్రువీకరణ, డిజిటల్ లబ్ధిదారుల ధ్రువీకరణ, డీబీటీ వ్యవస్థ ద్వారా ఆర్థిక సాయం నేరుగా రైతుల ఖాతాకే చేరుకుంటోంది. ఈ పథకం కేవలం ఆర్థిక సాయానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇది రైతుల ఆత్మవిశ్వాసాన్ని, స్వావలంబనను, వ్యవసాయంలో పెట్టుబడి పెట్టే సామర్థ్యాన్ని కూడా బలోపేతం చేస్తోంది.
ఆత్మనిర్భర భారత్, సంపన్న రైతులు దిశగా సాధించిన విజయం:
పీఎం-కిసాన్ పథకాన్ని కొనసాగించడం ద్వారా వ్యవసాయంలో పెట్టుబడి పెట్టే అంశంలో రైతుల సామర్థ్యం పెరుగుతుంది. ఉత్పాదకత మెరుగవుతుంది. వ్యవసాయ నష్టాలు తగ్గుతాయి. అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది.
ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కేంద్రీకృత విధానాల్లో పీఎం-కిసాన్ పథకం ముఖ్యమైన కార్యక్రమంగా ఉంది. కోట్లాది మంది రైతులకు సాధికారత కల్పించడం, తద్వారా వికసిత్ భారత్ దిశగా చేస్తున్న ప్రయాణంలో వారి పాత్రను బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యం.
***