పిఎంఇండియా
ప్యారిస్‌లో బీఏపీఎస్ స్వామి నారాయణ్ హిందూ మందిర్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఫ్రెంచ్ రాజధానిలో జరుగుతున్న ఈ చారిత్రక ప్రారంభోత్సవాన్ని ద్వైపాక్షిక సంబంధాలకు పునాదిగా ప్రధాని వర్ణించారు. ‘‘భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాల్లో ఈ విశిష్ట స్వామి నారాయణ్ ఆలయం ఓ కొత్త ప్రస్థానంగా నిలుస్తుంది’’ అని శ్రీ మోదీ తెలిపారు.
పూజనీయ సాధువులు, సనాతన సంప్రదాయ జ్ఞానుల ఆశీస్సులను కోరుతూ.. ఈ కార్యక్రమ వాతావరణాన్ని విశ్వ సౌభ్రాతృత్వానికి అసలైన ప్రతిబింబంగా ప్రధాని వర్ణించారు. ప్రపంచ వేదికపై ప్రాచీన తత్వాలను ఈ కార్యక్రమం ఆవిష్కరిస్తోందన్నారు. ‘‘వసుధైక కుటుంబ స్ఫూర్తికి ఈ రోజు ఈ కార్యక్రమం వేదికగా మారింది’’ అని శ్రీ మోదీ చెప్పారు.
దైవ కృపకు, ఆధ్యాత్మికవేత్తల ఆప్యాయతకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి పవిత్ర కార్యక్రమాలతో కొనసాగుతున్న తన అనుబంధాన్ని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ‘‘ఇలాంటి పుణ్యకార్యాలతో మమేకమయ్యే అవకాశాన్ని నేను పొందుతూనే ఉన్నాను’’ అని శ్రీ మోదీ చెప్పారు.
తాను స్వయంగా అక్కడ లేకపోయినా జరుగుతున్న ఉత్సవాలతో తనకు ఉన్న ప్రగాఢమైన భావోద్వేగ అనుబంధాన్ని ప్రధానమంత్రి తెలియజేశారు. ‘‘మనసుతో, ఆత్మతో నేను మీ మధ్యనే ఉన్న అనుభూతిని పొందుతున్నాను’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
భారతదేశ ప్రాచీన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాన్ని పునరుద్ధరించడానికి పరమ పూజ్య ప్రముఖ్ స్వామి జీ మహారాజ్ ప్రారంభించిన దార్శనిక ఉద్యమాన్ని స్మరించుకుంటూ ఆయనకు ప్రధాని నివాళులు అర్పించారు. ఏళ్లు గడిచే కొద్దీ ఈ అంతర్జాతీయ ఉద్యమం మరింత వేగాన్ని పుంజుకుంటోందన్నారు. ‘‘ప్రస్తుతం ఆ పునరుజ్జీవన వెలుగు ఐరోపాతో సహా మొత్తం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది’’ అని శ్రీ మోదీ తెలిపారు.
2024లో అబుదాబిలోని భవ్య ఆలయం నుంచి నేటి అద్భుత ఆలయం వరకు సాగిన ప్రయాణాన్ని ప్రధానమంత్రి వివరించారు. ఆధ్యాత్మికవేత్తల అచంచలమైన అంకితభావాన్ని, దూరదృష్టితో కూడిన ప్రయత్నాలను ప్రధాని ప్రశంసించారు. ‘‘ఈ నిర్మాణాల కొనసాగింపు సాధువుల దృఢ సంకల్పానికి నిదర్శనం’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
భారతదేశ ప్రాచీన తత్వశాస్తాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్మితమవుతున్న దేవాలయాలు ఎలా విస్తరింప చేస్తున్నదీ వివరిస్తూ.. బలమైన మానవ ఐక్యతకు పిలుపునిచ్చే మార్గదర్శకు సూత్రాన్ని ప్రధానమంత్రి ఉదహరించారు. ఆధ్యాత్మిక వేడుకలతో పాటే ఈ ప్రధాన విలువలు సైతం సహజంగానే ప్రయాణిస్తాయని ఆయన తెలియజేశారు. ‘‘మన ఆలోచనలు ఏకం కావాలి, మన హృదయాలు అనుసంధానం కావాలని భారతీయ ఆలోచన విధానం బోధిస్తుంది’’ అని శ్రీ మోదీ చెప్పారు.
విస్తృత సామాజిక ప్రభావం గురించి ప్రధానమంత్రి వివరించారు. ఈ అద్భుతమైన ఆలయం స్థానిక సాంస్కృతిక పరిస్థితులను మెరుగుపరచడంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు. ‘‘ఈ ఆలయం ఫ్రాన్స్
వైవిధ్యాన్ని కచ్చితంగా సుసంపన్నం చేస్తుంది. మన సాంస్కృతిక సంబంధాలను శక్తిమంతం చేస్తుంది’’ అని శ్రీ మోదీ తెలిపారు.
ఇటీవలి సంవత్సరాల్లో దౌత్య సంబంధాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరును ప్రధాని ప్రస్తావించారు. అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్‌తో కలసి చేపట్టిన సహకారాత్మక, దూరదృష్టితో కూడిన ప్రయత్నాలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘ఈ రెండు దేశాలూ కలసి ఓ ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయి’’ అని శ్రీ మోదీ వెల్లడించారు.
ఏఐ, రక్షణ, అంతరిక్షం, వాతావరణ చర్య లాంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు ఉన్న అవకాశాలను ప్రధాని వివరించారు. రాబోయే భారత్–ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం–2026 గురించి ప్రస్తావించారు. ఈ ఉమ్మడి ప్రయత్నాలు అపూర్వమైన సాంకేతిక ప్రగతికి మార్గాన్ని సుగమం చేస్తున్నాయని చెప్పారు. ‘‘మనం సరి కొత్త వేగంతో, నూతన శక్తితో కలిసి ముందుకు సాగుతున్నాము’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
రెండు దేశాల మధ్య కొనసాగుతున్న చారిత్రక సంబంధాలే ఈ సమకాలీన సామర్థ్యానికి కారణమని తెలియజేస్తూ.. ఈ ఆధునిక స్నేహానికున్న ప్రత్యేకతను ప్రధానమంత్రి వివరించారు. ‘‘ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది మన పురాతన సాంస్కృతిక, రాజకీయ బంధాల బలమైన పునాదిపై ఆధారపడి ఉంది’’ అని శ్రీ మోదీ తెలిపారు.
విశ్వాసానికి సంబంధించిన చారిత్రక ఘట్టాలను స్మరించుకుంటూ.. దశాబ్దాల క్రితం ఫ్రాన్స్‌కు వచ్చిన ఓ ప్రముఖ ఆధ్యాత్మిక నాయకుడి గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘ఆధ్యాత్మిక సంబంధాల్లో నూతన అధ్యాయాన్ని ఇస్కాన్ ద్వారా శ్రీల ప్రభుపాద స్వామి ప్రారంభించారు’’ అని శ్రీ మోదీ గుర్తు చేశారు.
ఈఫిల్ టవర్ సమీపంలో యోగాకు లభించిన విస్తృత ఆదరణకూ, కొత్త ఆలయానికీ మధ్య సారూప్యతలను ప్రధానమంత్రి తెలియజేశారు. వాటిని ప్రజల మధ్య అనుసంధానానికి శక్తివంతమైన మాధ్యమాలుగా గుర్తించారు. ‘‘ఈ భవ్యమైన, దివ్యమైన ఆలయం ద్వారా మన సాంస్కృతిక సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది’’ అని శ్రీ మోదీ తెలియజేశారు.
ఆధ్యాత్మిక కథనంలోకి ఆర్థిక పరిభాషను మేళవిస్తూ ఈ ఆలయ నిర్మాణాన్ని, ఆధునిక ద్వైపాక్షిక వాణిజ్య చర్చలతో ప్రధానమంత్రి సరదాగా పోల్చారు. ‘‘స్వామి నారాయణ్ ఆలయం ఉమ్మడి వ్యాపార అవకాశాలకు పూర్తిగా కొత్త కోణాన్ని జోడించింది’’ అని శ్రీ మోదీ అభిప్రాయపడ్డారు.
ప్రాచీన భారతీయ శిల్పకళా నైపుణ్యాన్ని ఆధునిక ఫ్రెంచ్ ఇంజనీరింగ్‌తో మేళవించి ఈ అద్భుతమైన కట్టడం ఎలా రూపుదిద్దుకున్నదీ తెలియజేస్తూ… వాస్తు నిర్మాణ సమ్మేళనం గురించి ప్రధానమంత్రి వివరించారు. భారత్ నుంచి పంపించిన రాళ్లపై చెక్కిన సూక్ష్మమైన కళా నైపుణ్యాన్ని ప్రశంసించారు. ‘‘ఈ ఆలయం నిజంగా మేడ్ ఇన్ ఇండియా, బిల్ట్ ఇన్ ఫ్రాన్స్’’ అని శ్రీ మోదీ చమత్కరించారు.
భవిష్యత్తుపై దృష్టి సారిస్తూ… సహకారాత్మకమైన ఈ ఆలయం అందించే శాశ్వత వారసత్వంలో అపారమైన విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. “ఇది రాబోయే శతాబ్దాల్లో భారతదేశం, ఫ్రాన్స్ మధ్య సహకారానికీ, అవకాశాలకూ ప్రతీకగా నిలుస్తుంది” అని శ్రీ మోదీ ధ్రువీకరించారు.
ఈ సంస్థల్లో అంతర్లీనంగా ఉన్న ఆధ్యాత్మిక సాధన, సామాజిక సంక్షేమం అనే ద్వంద్వ లక్ష్యాన్ని బలపరుస్తూ, ఈ ప్రదేశంలో చేపట్టే మానవతా ప్రాజెక్టుల పట్ల ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘స్వామి నారాయణ్ ఆలయాలు ఎల్లప్పుడూ భక్తితో పాటు సేవకు మాధ్యమంగా ఉన్నాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.
ఈ ఆలయం చూపించే ప్రాంతీయ ప్రభావాన్ని అంచనా వేస్తూ.. భారతీయ వారసత్వ విలువలు మొత్తం ఖండాన్ని ఉద్ధరిస్తాయన్నారు. ఈ బోధనలు ప్యారిస్‌ను దాటి ప్రతిధ్వనిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఇక్కడి నుంచి వెలువడే భారతీయ సంస్కృతీ స్వరాలు మొత్తం ఐరోపా ప్రజలకు ప్రయోజనాన్ని అందిస్తాయి’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ‘‘భవిష్యత్తులో వీలు కుదిరినప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకొనేందుకు ప్రయత్నిస్తాను’’ అని శ్రీ మోదీ చెప్పారు.
ప్రారంభోత్సవానికి హాజరైన వారికి, కుటుంబాలకు, భక్తులకు, మొత్తం ప్రవాస భారతీయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
***
It is a matter of great joy that BAPS Swaminarayan Hindu Mandir is being inaugurated in Paris.@BAPS https://t.co/PaXRoM0mkv
— Narendra Modi (@narendramodi) September 6, 2026