పిఎంఇండియా
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు.. 2026 సెప్టెంబరు 2 నుంచి 4 వరకు బెల్జియం ప్రధానమంత్రి శ్రీ బార్ట్ డి వెవర్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆ దేశ రక్షణ, విదేశీ వాణిజ్య శాఖ మంత్రి శ్రీ థియో ఫ్రాంకెన్, అధికారులతోపాటు వ్యాపారవేత్తలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఆయన వెంట ఉన్నాయి. 2025 ఫిబ్రవరిలో పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం.. బెల్జియం ప్రధానమంత్రి డి వెవర్ భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి.
రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళి ఘటించి.. బెల్జియం ప్రధానమంత్రి డి వెవర్ తన పర్యటనను ప్రారంభించారు. అనంతరం మొదట భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో పరిమిత స్థాయి సమావేశంలోనూ, అనంతరం ఇరుదేశాల ప్రతినిధి బృందాల స్థాయిలోనూ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఇరుదేశాల మధ్య సంబంధాల విషయంలో దాదాపు అన్ని అంశాలూ వారి మధ్య చర్చకు వచ్చాయి. బెల్జియం ప్రధానమంత్రి డి వెవర్, ఆ దేశ ప్రతినిధి బృందానికి.. ప్రధానమంత్రి శ్రీ మోదీ ఆతిథ్యాన్ని అందించారు.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్లాండర్స్ ఫీల్డ్స్‌లో ప్రాణాలర్పించిన 9,000 మందికి పైగా భారత సైనికుల త్యాగాలను ప్రధానులిద్దరూ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. 1947లో భారత్‌తో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్న మొదటి ఐరోపా దేశాల్లో బెల్జియం ఒకటిగా ఉన్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, పరస్పర విశ్వాసం, ఆర్థిక భాగస్వామ్యం, బలమైన ప్రజా సంబంధాలు పునాదులుగా.. ఈ భాగస్వామ్యం నాటి నుంచే సుసంపన్నమైందని వారు పేర్కొన్నారు. ఈ బహుముఖ సంబంధాలను మరింత విస్తరించి, బలోపేతం చేసుకోవాలని ప్రధానమంత్రులిద్దరూ ఆకాంక్షించారు. 2027 నాటికి భారత్ – బెల్జియం దౌత్య సంబంధాలు 80 ఏళ్లు పూర్తవుతున్నాయని, ద్వైపాక్షిక సంబంధాల విస్తరణకు ఇదొక చరిత్రాత్మక అవకాశమని అన్నారు.
2026 జూలై 15న బ్రస్సెల్స్‌లో భారత విదేశాంగ శాఖ మంత్రి – బెల్జియం ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి సంయుక్త అధ్యక్షతన ప్రారంభమైన మొదటి ‘భారత్ – బెల్జియం వ్యూహాత్మక చర్చల’ను ప్రధానమంత్రులిద్దరూ స్వాగతించారు. విస్తృతమైన భారత్–ఐరోపా యూనియన్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా.. వాణిజ్యం, పెట్టుబడులు, పర్యావరణ హిత పరివర్తన, సాంకేతికత, రవాణా, రక్షణ, భద్రత, ప్రజా సంబంధాల్లో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేలా ఒక క్రమబద్ధమైన, సమగ్ర వ్యవస్థను ఈ చర్చలు నెలకొల్పాయని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, వ్యూహాత్మక చర్చల్లో గుర్తించిన ప్రాధాన్యాలను వేగవంతం చేసే కీలక వేదికగా.. త్వరలో నిర్వహించనున్న విదేశాంగ శాఖ సంప్రదింపులను వారు స్వాగతించారు.
ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అత్యవసర సవాళ్లను పరిష్కరించడంతోపాటు, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో నూతన పరిణామాలకు ప్రపంచాన్ని సిద్ధం చేసేలా – సమానమైన, శాంతియుతమైన అంతర్జాతీయ క్రమాన్ని నెలకొల్పే దిశగా.. ఐక్యరాజ్యసమితి (యుఎన్) చార్టర్ కేంద్రంగా.. సంస్కరించిన, సమర్థమైన బహుపాక్షిక భాగస్వామ్య వ్యవస్థ అవసరమన్న తమ వాదనను ప్రధానమంత్రులిద్దరూ పునరుద్ఘాటించారు. నేటి ప్రపంచ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని తక్షణమే సంస్కరించాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు. సంస్కరించిన, విస్తరించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ అభ్యర్థిత్వానికి బెల్జియం మద్దతును పునరుద్ఘాటించింది. అలాగే భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వానికి పరస్పర మద్దతు విషయంలో (2028-29 కాలానికి భారత్, 2037-38 కాలానికి బెల్జియం) ఇరుదేశాలు అంగీకారానికి వచ్చాయి.
భారత్ – ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
భారత్ – బెల్జియం సంబంధాల్లో.. ‘భారత్–ఐరోపా యూనియన్ వ్యూహాత్మక భాగస్వామ్యం’ అత్యంత కీలకమైనదని ప్రధానమంత్రులిద్దరూ పునరుద్ఘాటించారు. 2026 జనవరి 27న నిర్వహించిన భారత్ – ఈయూ సదస్సులో.. భారత్ – ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలు విజయవంతం కావడాన్ని వారు స్వాగతించారు. అలాగే భారత్ – ఐరోపా యూనియన్ల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో.. ‘ఈయూ–భారత్ పెట్టుబడుల పరిరక్షణ ఒప్పందం’, ‘భౌగోళిక గుర్తింపుల ఒప్పందా’లపై చర్చలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.
వ్యూహాత్మక భాగస్వామ్యంలో చరిత్రాత్మక మైలురాయిగా భారత్ – ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వారిద్దరూ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందాన్ని సకాలంలో అమలు చేయాలని పిలుపునిచ్చారు. తద్వారా కీలకమైన ప్రతి దశలోనూ మరింత విస్తరిస్తూ, కొత్త మార్కెట్లను అందుబాటులోకి తెస్తూ.. వాణిజ్యం, పెట్టుబడి సహకారంలో పూర్తిస్థాయి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు.
వాణిజ్యం – సాంకేతికత రెండూ రోజు రోజుకూ విడదీయలేని విధంగా ముడిపడిపోతున్న నేటి తరుణంలో.. మరింత సమీకృత, పటిష్టమైన, సుస్థిర ఆర్థిక–సాంకేతిక భాగస్వామ్యాన్ని నిర్మించే దిశగా ‘భారత్ – ఈయూ వాణిజ్య, సాంకేతిక మండలి’ సాధిస్తున్న విశేష పురోగతిని, 2026 జూలైలో బ్రస్సెల్స్‌లో నిర్వహించిన మంత్రివర్గ స్థాయి సమావేశాన్ని ప్రధానమంత్రులిద్దరూ స్వాగతించారు. ఈ నేపథ్యంలో వాణిజ్యం, సాంకేతికత, ఆర్థిక భద్రత, పటిష్టమైన సరఫరా వ్యవస్థల విషయంలో భారత్, బెల్జియం, ఐరోపా సమాఖ్యల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్టు పునరుద్ఘాటించారు.
భారత్ – ఈయూ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడం, బలోపేతం చేయడం ద్వారా.. రెండు పక్షాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా పరస్పర ప్రయోజనకరమైన, స్పష్టమైన, విప్లవాత్మకమైన ఫలితాలను అందించే ‘సంయుక్త భారత్ – ఈయూ సమగ్ర వ్యూహాత్మక ఎజెండా – 2030’ని ఇరుపక్షాలు ఆమోదించాయి. అలాగే సముద్ర భద్రత, రక్షణ పరిశ్రమ, సాంకేతికత, సైబర్ – హైబ్రిడ్ ముప్పు, అంతరిక్షం, ఉగ్రవాద నిరోధక రంగాలు సహా ఉమ్మడి ప్రయోజనాలున్న కీలక అంశాల్లో వ్యూహాత్మక సహకారాన్ని.. ‘భారత్ – ఈయూ భద్రత, రక్షణ భాగస్వామ్యం’ బలోపేతం చేస్తుందని వారు పేర్కొన్నారు.
వాణిజ్యం, ఆర్థిక సహకారం, పెట్టుబడులు
ప్రపంచంలో 24వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బెల్జియం, త్వరలోనే 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న ఆకాంక్షతో భారత్ ఉన్న నేపథ్యంలో.. ఇరుదేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాలకు పుష్కలంగా అవకాశాలున్నాయని ప్రధానమంత్రులిద్దరూ అంగీకరించారు. రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య ఉన్న బలమైన అనుకూలతలను గుర్తించిన వారు.. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు స్థిరంగా విస్తరించడం, ద్వైపాక్షిక వాణిజ్య రంగాలు విస్తరిస్తుండడాన్ని వారు స్వాగతించారు. వచ్చే అయిదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెండింతలు చేసుకునే లక్ష్యంతో.. ఉమ్మడి ప్రయోజనాలున్న కీలక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు.
బెల్జియం యువరాణి ఆస్ట్రిడ్ నేతృత్వంలో 2025 మార్చిలో భారత్‌లో ‘బెల్జియం ఆర్థిక బృందం’ పర్యటన విజయవంతం కావడంపై ప్రధానమంత్రులిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంలోనూ, వ్యాపార సంస్థలు, వ్యవస్థల మధ్య కొత్త భాగస్వామ్యాలను నెలకొల్పడంలోనూ ఈ పర్యటన కీలక మైలురాయిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. మహిళల ఆర్థిక సాధికారతపై చర్చలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయన్నారు. అంతేకాకుండా లైఫ్ సైన్సు, ఔషధం, ఆరోగ్య రక్షణ, ఇంధనం, పునరుత్పాదక ఇంధనం, రక్షణ, విమానయాన – అంతరిక్ష రంగం, లాజిస్టిక్స్, రవాణా, ఓడరేవులు, క్లీన్టెక్ – గ్రీన్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, అధునాతన పరికరాలు, తయారీ రంగం, డిజిటల్ సాంకేతికతలు, ఆవిష్కరణల వంటి ప్రాధాన్యతా రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడంలోనూ ఈ పర్యటన దోహదపడిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఔషధాలు, బయోటెక్నాలజీ, చికిత్సాపరమైన పరిశోధన, ఆవిష్కరణ, అధునాతన ఆరోగ్య సంరక్షణ విధానాల్లో ఇరుదేశాల బలాలు పరస్పర పూరకాలుగా ఉన్నాయనీ, ఈ క్రమంలో లైఫ్ సైన్సుల రంగంలో భారత్–బెల్జియం భాగస్వామ్యానికి అపారమైన అవకాశాలు ఉన్నాయనీ వారు వెల్లడించారు. ఈ దిశగా పరిశ్రమలు, విద్యా సంస్థలు, పరిశోధన సంస్థల మధ్య మరింత సన్నిహిత సహకారం ఉండాలని ఆకాంక్షించారు. బెల్జియం ప్రాంతీయ వాణిజ్య, పెట్టుబడి సంస్థలు సహా.. నిరంతర ఉన్నత స్థాయి చర్చల ద్వారా ఈ భాగస్వామ్యంలో పురోగతిని ఇలాగే కొనసాగించాలని ప్రధానమంత్రులిద్దరూ అంగీకారానికి వచ్చారు.
సెమీకండక్టర్లు, రసాయనాలు, ఔషధ రంగం, రక్షణ రంగ పారిశ్రామిక సహకారం, కీలక ఖనిజాల శుద్ధి – పునర్వినియోగం, సుస్థిర పరిశ్రమలు, అణు ఇంధనం వంటి రంగాల్లో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు పెంపొందుతుండడం, సహకారం విస్తరిస్తుండడాన్ని వారు స్వాగతించారు. ప్రైవేటు రంగానికి భాగస్వామ్యం కల్పిస్తూ.. సరికొత్త రంగాల్లో సహకారం కోసం అవకాశాల అన్వేషణపై కూడా చర్చించారు. ముంబయి, సూరత్‌లతో.. ఆంట్వర్ప్ నగరాన్ని అనుసంధానించే వజ్రాల వాణిజ్యానికి ఎనలేని ప్రాధాన్యం ఉందన్నారు. కొత్త ఆర్థిక అవకాశాలనూ, ఉమ్మడి పురోగతినీ వేగవంతం చేస్తూ.. ఈ చరిత్రాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ప్రధానమంత్రులిద్దరూ అంగీకారానికి వచ్చారు.
నౌకా వాణిజ్యం, ఓడరేవులపరంగా ఇరుదేశాల మధ్య సహకారానికి ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని వారిద్దరూ స్పష్టం చేశారు. ఓడరేవుల అభివృద్ధి, వస్తు రవాణా, అనుసంధానం, పూడికతీత, తీరప్రాంత పవన శక్తి మౌలిక సదుపాయాల రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలను స్వాగతించారు. ఈ నేపథ్యంలో 2026 అక్టోబరులో న్యూఢిల్లీలో నిర్వహించతలపెట్టిన ‘సాగర్మంథన్: మహాసముద్ర చర్చ’ కార్యక్రమంలో ఫ్లెమిష్ రవాణా, ఓడరేవుల శాఖ మంత్రి అనిక్ డి రిడర్ పాల్గొంటుండడాన్ని ఇరుపక్షాల నేతలు స్వాగతించారు. అలాగే ఏపీఈసీ (ఆంట్వర్ప్/ ఫ్లాండర్స్ ఓడరేవు శిక్షణ కేంద్రం), భారత్‌కు చెందిన జవహర్లాల్ నెహ్రూ ఓడరేవుల ప్రాధికార సంస్థ (జేఎన్‌పీఏ) మధ్య విస్తృత సహకారానికి గల అవకాశాలను వారు స్వాగతించారు. ముఖ్యంగా భారతీయ ఓడరేవుల రంగానికి, విస్తృతమైన నౌకా వాణిజ్య రంగానికి చెందిన అన్ని స్థాయుల అధికారులు, ఉద్యోగుల శిక్షణ అవసరాలను గుర్తించడం, వారి సామర్థ్యాలను పెంపొందించడం వంటి అంశాల్లో ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భారత ఓడరేవు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో.. బెల్జియం తన డ్రెడ్జింగ్ నైపుణ్యాలతో అందిస్తూ వస్తున్న తోడ్పాటునూ, తీరప్రాంత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఊతమివ్వడంలో దాని సామర్థ్యాన్నీ చర్చించారు.
‘బెల్గో – ఇండియన్ ఖగోళశాస్త్ర, ఖగోళ భౌతిక శాస్త్ర నెట్వర్క్ (బీఐఎన్ఏ)’ ద్వారా.. ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతికశాస్త్రం, అంతరిక్ష సాంకేతికతలల్లో పరిశోధన, ఉన్నత విద్యలో ఇరుదేశాల మధ్య సహకారం విస్తరించడాన్ని ప్రధానమంత్రులిద్దరూ స్వాగతించారు. దేవస్థల్ ఆప్టికల్ టెలిస్కోప్, దేవస్థల్ అంతర్జాతీయ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్, మౌంట్ అబు టెలిస్కోప్, ఉదయ్‌పూర్‌లోని బహుళ అనువర్తన సౌర టెలిస్కోప్ సహా.. పలు చరిత్రాత్మక ఖగోళ పరిశోధన కేంద్రాల ఏర్పాటులో బెల్జియం తోడ్పాటును ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు. ఇది ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వైజ్ఞానిక సహకార శక్తికి ఇది నిదర్శనమన్నారు.
‘భారత్–బెల్జియం వేగవంతమైన పెట్టుబడి ఆమోద ప్రక్రియ’ ప్రారంభాన్ని వారిద్దరూ స్వాగతించారు. ద్వైపాక్షిక పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక ముందడుగుగా దీనిని స్వాగతించారు. భారత్‌లో బెల్జియం పెట్టుబడులనూ, బెల్జియంలో భారతీయ పెట్టుబడులనూ సులభతరం చేయడంతోపాటు మరింత విస్తరించడానికి ఒక ప్రత్యేక వేదికగా ఈ ప్రతిపాదిత వ్యవస్థ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వ్యాపార సంస్థలకు సహకారాన్ని అందించడం, పెట్టుబడుల్లో అవరోధాలను తొలగించడం, ఇరుదేశాల మధ్య సుదీర్ఘకాల ఆర్థిక సహకారం కోసం అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడంలో ఇదెంతగానో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.
బెల్జియం అత్యున్నత వెల్త్ ఫండ్ అయిన ఫెడరల్ హోల్డింగ్, ఇన్వెస్ట్మెంట్ కంపెనీ (ఎస్ఎఫ్పీఐఎం) – భారత జాతీయ పెట్టుబడి, మౌలిక సదుపాయాల నిధి (ఎన్ఐఐఎఫ్) మధ్య సంప్రదింపులను కూడా వారు స్వాగతించారు. ఆ రెండు సంస్థల మధ్య సహకారాన్ని క్రమబద్ధీకరించి.. ఇండో– బెల్జియన్ ఆర్థిక, పెట్టుబడి కారిడార్‌ను ఏర్పాటు చేయడంపై చర్చించారు. బెల్జియంకు చెందిన అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం పెట్టుబడి సంస్థ (బీఐవో ఇన్వెస్ట్) సహకారాన్ని కూడా వారు స్వాగతించారు. పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో.. బీఐవో ఇన్వెస్ట్ – ఎన్ఐఐఎఫ్ మధ్య సహకారానికి అవకాశమున్న రంగాలను పరిశీలించడంపై అంగీకారానికి వచ్చారు.
ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడంలో.. భారత్ – బెల్జియం – లగ్జెంబర్గ్ ఆర్థిక యూనియన్ (బీఎల్ఈయూ) సంయుక్త ఆర్థిక కమిషన్ ఒక కీలక యంత్రాంగంగా ఉంటుందని ప్రధానమంత్రులిద్దరూ స్పష్టం చేశారు. ఈ ఏడాది చివర్లో నిర్వహించనున్న బీఎల్ఈయూ 19వ సమావేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు.
రక్షణ, భద్రతా సహకారం
సరిహద్దు ఉగ్రవాదం సహా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వెవర్ భారత్‌కు పూర్తి సంఘీభావం తెలిపారు. 2025 ఏప్రిల్ నెలలో భారత్‌లోని జమ్మూ కాశ్మీర్లో గల పహల్గామ్లో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడిని ఆయన మరోసారి ఖండించారు. ఉగ్రవాద నిరోధానికి సమగ్రమైన, ప్రపంచవ్యాప్త విధానానికి తాము కట్టుబడి ఉన్నామని ఇరువురు నేతలు స్పష్టం చేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో, ఏ రీతిలో, ఎక్కడ కొనసాగుటనూ తాము ఎన్నటికీ సమర్థించలేమని వారు పునరుద్ఘాటించారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడేవారిని అంతర్జాతీయ చట్టాల ప్రకారం జవాబుదారీగా చేయాలని వారు పిలుపునిచ్చారు. ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా… ఉగ్రవాద నెట్‌వర్క్‌లు, వాటి సురక్షిత స్థావరాలు, వాటికి అందే ఆర్థిక సహాయానికి వ్యతిరేకంగా… ఐక్యరాజ్యసమితి, ఎఫ్ఏటీఎఫ్ సహా అంతర్జాతీయ సమాజమంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరముందని వారు అంగీకరించారు. జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆంక్షల విధింపు సహా… ఉగ్రవాదాన్ని నివారించడానికి, ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరువురు నేతలు పిలుపునిచ్చారు. నానాటికీ పెరుగుతున్న ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో, ఉగ్రవాదాన్ని నిరోధించడం కోసం బెల్జియం–భారత్ సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను అన్వేషించాలనే తమ ఉద్దేశాన్ని ఇరువురు నేతలు వ్యక్తం చేశారు.
రక్షణ రంగ సహకారంలో భాగంగా ఇరు దేశాల రక్షణ మంత్రిత్వ శాఖలు లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకాలు చేయడాన్ని ఇరువురు ప్రధానమంత్రులు స్వాగతించారు. ఇది నిరంతర చర్చలు, సిబ్బంది స్థాయి చర్చలు, విద్య, శిక్షణ, పరిశోధన రంగాల్లో పరస్పర సహకారం, రక్షణ రంగ పారిశ్రామిక భాగస్వామ్యాల కోసం ఒక విధాన ప్రణాళికను రూపొందిస్తుంది. ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని సంస్థాగతం చేయడం, మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా 2025 మార్చిలో భారత్–బెల్జియం రక్షణ మంత్రుల మధ్య కుదిరిన అవగాహనను ఈ ఒప్పందం మరింత ముందుకు తీసుకువెళ్తుందని వారు పేర్కొన్నారు. సముద్ర భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, విద్య, సైనిక సంబంధిత సహకారం సహా ఇండో–పసిఫిక్‌లో సహకారం వంటి అంశాల్లో ఇరు దేశాల రక్షణ సంస్థల మధ్య సంబంధాలు క్రమంగా బలపడటాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. 2026 నవంబర్ 5 నుంచి 8వ తేదీ వరకు బెల్జియన్ ఫ్రిగేట్ ‘లియోపోల్డ్ I’ భారత్ పర్యటన… బెల్జియన్ డిఫెన్స్ కాలేజ్ తన ‘వరల్డ్ స్టడీ ట్రిప్ 2027′ను భారత్‌లో నిర్వహించాలనే ఉద్దేశం… కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్, సికింద్రాబాద్ 2026 అక్టోబరులో బెల్జియంలో జరిపే అధ్యయన పర్యటన వంటి కార్యక్రమాలను వారు స్వాగతించారు. ఇరు దేశాల రక్షణ సంస్థల మధ్య పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే స్పష్టమైన అవకాశాలుగా వాటిని అభివర్ణించారు.
న్యూఢిల్లీలో ఒక డిఫెన్స్ అటాచీని నియమించాలని బెల్జియం… సమీప భవిష్యత్తులో బ్రస్సెల్స్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఒక రెసిడెంట్ డిఫెన్స్ అటాచీని నియమించాలని భారత్ తీసుకున్న నిర్ణయాన్ని వారు స్వాగతించారు. సముద్ర భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ఇండో–పసిఫిక్‌లో సహకారం వంటి అంశాలపై ఇరు దేశాల రక్షణ సంస్థల మధ్య సంబంధాలు క్రమంగా బలపడటాన్నీ ఇరువురు నేతలు స్వాగతించారు.
భారత్, బెల్జియంల మధ్య పెరుగుతున్న రక్షణ–పారిశ్రామిక సహకారాన్ని ఇరు దేశాల ప్రధానమంత్రులు స్వాగతించారు. 2025 మార్చిలో భారత్‌లో జరిగిన బెల్జియం ఆర్థిక మిషన్ సందర్భంగా ఇటువంటి భాగస్వామ్యాలు మరింత బలోపేతమయ్యాయని వారు పేర్కొన్నారు. రక్షణ తయారీ, సాంకేతికత, ఆవిష్కరణ, సహ–అభివృద్ధి, సహ–ఉత్పత్తి రంగాల్లో మరింత సహకారానికి గల అవకాశాలను గుర్తించిన ఇరువురు నేతలు… బెల్జియం–భారత్ రక్షణ పరిశ్రమల మధ్య కుదిరిన పలు ఒప్పందాలు, భాగస్వామ్యాలను స్వాగతించారు. ఇరు దేశాల పరిశ్రమలు ఈ ప్రక్రియలో పూర్తిగా నిమగ్నమై ఉండాలని ప్రోత్సహించారు.
యిప్రెస్లోని ఫ్లాండర్స్ ఫీల్డ్స్ మ్యూజియం, న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హిస్టారికల్ రీసెర్చ్ మధ్య కొనసాగుతున్న సహకారాన్నీ ఇరువురు నేతలు గుర్తించారు. ఈ సహకారం భారత్–బెల్జియం ఉమ్మడి చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి దోహదం చేస్తోందని వారు పేర్కొన్నారు.
అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు, సైబర్ నేరాలు, సంబంధిత విషయాలపై పోరాటంలో సహకారం లక్ష్యంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ పోలీస్ ఆఫ్ బెల్జియం మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఇరువురు ప్రధానులు స్వాగతించారు. ఈ ఒప్పందం సంస్థాగత సంబంధాలను బలోపేతం చేస్తుందని… సమాచార భాగస్వామ్యాన్ని సులభతరం చేస్తుందని… సామర్థ్యాలను పెంపొందించడం, ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడాన్ని ప్రోత్సహిస్తుందని… పారిపోయిన వ్యక్తులను గుర్తించడంలో సహకారాన్ని పెంపొందిస్తుందని… అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు, సైబర్ నేరాలు, సంబంధిత విషయాలను ఎదుర్కోవడం కోసం ద్వైపాక్షిక చట్టాల అమలులో సహకారాన్ని మరింత పెంపొందిస్తుందని వారు పేర్కొన్నారు.
హరిత పరివర్తన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ఆరోగ్య సంరక్షణలో సహకారం, అంకురసంస్థలు
భారత్, బెల్జియంల మధ్య పునరుత్పాదక ఇంధన సహకారంపై అవగాహన ఒప్పంద పునరుద్ధరణను ఇరు దేశాల ప్రధానమంత్రులు స్వాగతించారు. 2015 విధాన ప్రణాళిక ద్వారా నెలకొల్పిన సహకారాన్ని, పునరుత్పాదక ఇంధనంపై సంయుక్త కార్యాచరణ బృందం కృషిని ఈ అవగాహన ఒప్పందం పునరుద్ధరణ మరింత ముందుకు తీసుకువెళ్తుందని వారు అభిప్రాయపడ్డారు. గ్రీన్ హైడ్రోజన్, సౌరశక్తి, ఇంధన నిల్వ, ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ, బయో–ఎనర్జీ, చిన్న జలవిద్యుత్, పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు వంటి కీలక రంగాల్లో సహకారాన్ని ఇది విస్తరిస్తుందని వారు పేర్కొన్నారు.
పారిశ్రామిక భాగస్వామ్యాలు, విజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడం సహా గ్రీన్ హైడ్రోజన్ రంగంలో భారత్–బెల్జియంల మధ్య పెరుగుతున్న సహకారాన్ని ఇరు దేశాలూ స్వాగతించాయి. జీహెచ్2 ఇండియా, బెల్జియన్ హైడ్రోజన్ కౌన్సిల్, ఫ్లాండర్స్ ఇన్వెస్ట్మెంట్ – ట్రేడ్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం కింద సహకారాన్ని వారు గుర్తించారు. బ్రస్సెల్స్‌లోని ఎగ్మాంట్ ఇనిస్టిట్యూట్ గ్రీన్ హైడ్రోజన్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో భారత అధికారుల చురుకైన భాగస్వామ్యాన్ని… ఇరు దేశాల ప్రభుత్వ, పారిశ్రామిక, పరిశోధనా రంగాల ప్రతినిధుల పరస్పర పర్యటనలనూ వారు గుర్తించారు. డీకార్బనైజేషన్ను ముందుకు తీసుకెళ్లడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఇంధన భద్రతను పెంచడం, సుస్థిర ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో… ఉత్పత్తి, రవాణా, నిల్వ, తుది వినియోగ అనువర్తనాలు సహా గ్రీన్ హైడ్రోజన్ సంబంధిత వాణిజ్య కార్యకలాపాల బలోపేతంలో భారత్–బెల్జియంల కీలక పాత్రను ఇరు దేశాల ప్రధానమంత్రులు ప్రముఖంగా ప్రస్తావించారు.
విభిన్న జాతీయ పరిస్థితుల దృష్ట్యా, పారిస్ ఒప్పంద ఉష్ణోగ్రత లక్ష్యం సహా దాని దీర్ఘకాలిక లక్ష్యాలు… సమానత్వం, విభిన్నమైన ఉమ్మడి బాధ్యతలు, సంబంధిత సామర్థ్యాలు సహా దాని సూత్రాల పట్ల భారత్–బెల్జియం దేశాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. అమలును ముందుకు తీసుకువెళ్లి, క్షేత్రస్థాయిలో మెరుగైన చర్యలకు దారితీసే విజయవంతమైన సీఓపీ31కి ఇరు దేశాలు మద్దతునిస్తున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అన్ని వనరుల నుంచి తగినంత, అంచనా వేయగల, అందుబాటులో ఉండే వాతావరణ సంబంధిత నిధులను సమీకరించడం… వాతావరణ సాంకేతికతలను అభివృద్ధి చేయడం, వ్యాప్తి చేయడం… సామర్థ్యాలను పెంపొందించుకోవడం ద్వారా మెరుగైన వాతావరణ చర్యలు సాధ్యమవుతాయని వారు గుర్తించారు. ఈ రంగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతనూ వారు ప్రముఖంగా ప్రస్తావించారు. వాతావరణ అనుకూలత, అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యం, విపత్తు సంసిద్ధతను బలోపేతం చేయడానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడం, సుస్థిర అభివృద్ధి, తీరప్రాంత ప్రజల శ్రేయస్సుకు మద్దతునివ్వడంలో సముద్రాలు, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థల కీలక పాత్రను ఇరువురు నేతలు గుర్తించారు. సుస్థిర అభివృద్ధిని సాధించడం, వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో ఒక భాగంగా పటిష్ఠమైన సముద్ర నిర్వహణ ప్రాముఖ్యతనూ వారు గుర్తించారు. జాతీయ అధికార పరిధికి అతీతమైన జీవవైవిధ్య (బీబీఎన్‌జే) ఒప్పందం, నౌకా వాణిజ్య వ్యవహారాల్లో విస్తృత అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యతను ఇరు దేశాల నేతలు ప్రముఖంగా ప్రస్తావించారు.
సెమీకండక్టర్ కంపెనీలు, చిప్ఇన్ సెంటర్, సి–డాక్, విశ్వవిద్యాలయాలతో కూడిన భారతీయ మైక్రో–ఎలక్ట్రానిక్స్ వ్యవస్థ… బెల్జియంకు చెందిన ఐమెక్ల మధ్య పరస్పర సహకారాన్ని ఇరువురు నేతలు ప్రోత్సహించారు. సెమీకండక్టర్ సాంకేతికతల్లో ఈ పరస్పర సహకారాన్ని మరింత లోతైన భాగస్వామ్యాలుగా అభివృద్ధి చేయడానికి తమ మద్దతును తెలిపారు. తద్వారా ఇరు దేశాల్లో పటిష్ఠమైన, అధునాతన సాంకేతిక వ్యవస్థల ఏర్పాటుకు సహకారం అందిస్తామని వారు పేర్కొన్నారు.
భారత్ ఆతిథ్యం ఇచ్చిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఫ్లాండర్స్ ప్రభుత్వ మంత్రి–అధ్యక్షులు పాల్గొనడాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. కృత్రిమ మేధ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ఆవిష్కరణల్లో పెరుగుతున్న సహకార ప్రాముఖ్యతను ఈ పర్యటన స్పష్టం చేసిందని వారు పేర్కొన్నారు.
స్టార్టప్ ఇంక్యుబేషన్ రంగాల్లో సహకారాన్ని ఇరుపక్షాలూ స్వాగతించాయి. ఈ విషయంగా, ఆవిష్కరణ–ఆధారిత వ్యవస్థాపనకు మద్దతునివ్వడం… డిజిటల్ నైపుణ్యాల అభివృద్ధిని మెరుగుపరచడం ద్వారా అంకురసంస్థల వ్యవస్థలను మెరుగుపరచడం కోసం ఎమ్ఈఐటీవై స్టార్టప్ హబ్, హబ్ బ్రస్సెల్స్‌తో పాటు ఇతర స్టార్టప్ హబ్‌లు, నైపుణ్య కేంద్రాల మధ్య సహకారాన్ని కొనసాగించడానికి ఇరు దేశాల ప్రధానమంత్రులు అంగీకరించారు.
అనుసంధానం, రవాణా, విద్య, సంస్కృతి, ప్రజా సంబంధాలు
సమర్థమైన వీసా సేవల ద్వారా ప్రజా సంబంధాలనూ, అనుసంధానాన్నీ బలోపేతం చేయాల్సిన ప్రాధాన్యాన్ని ఇద్దరు నాయకులు గుర్తించారు. ఈ దిశగా వీసాల జారీ ప్రక్రియ సజావుగా, వేగంగా జరగాల్సిన అవసరాన్ని కూడా వారు గుర్తించారు. భారత్, బెల్జియం దేశాల మధ్య రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో రెండు దేశాల్లోని దౌత్య కార్యాలయాల్లో వీసాల జారీ సామర్థ్యం గణనీయంగా వృద్ధి చెందుతోంది. ఈ నిర్దుష్ట అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని భారత్‌లో బెల్జియం వీసా సేవలను మెరుగుపరుస్తుండటాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు.
రవాణాపై సమగ్ర సహకార ముసాయిదాపై ఈయూతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్నీ, భారత్‌లో ప్రయోగాత్మకంగా యూరోపియన్ యూనియన్ లీగల్ గేట్‌వే కార్యాలయాన్ని ప్రారంభించడాన్నీ నాయకులు స్వాగతించారు. నిపుణులు, నైపుణ్య శ్రామిక శక్తి, విద్యార్థుల రాకపోకలకు వీలుగా చట్టబద్ధమైన మార్గాలను ప్రోత్సహించడంలోనూ, భారత్–ఈయూ మధ్య ప్రజా సంబంధాలను బలోపేతం చేయడంలోనూ ఈ కార్యాలయం పోషించే పాత్రను వారు గుర్తించారు. వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజా సంబంధాలు పెరిగే కొద్దీ నిపుణులు, విద్యార్థులు, పరిశోధకులు, వ్యాపారుల రాకపోకలను కూడా విస్తరించడం అవసరమని వారు అంగీకరించారు. అనుసంధానాన్ని బలోపేతం చేయడానికున్న ప్రాధాన్యాన్ని నాయకులిద్దరూ స్పష్టం చేశారు. బెల్జియం, భారత్ మధ్య నేరుగా విమాన అనుసంధానాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని విమానయాన సంస్థలను ప్రోత్సహించారు. భారత్ నుంచి అర్హత కలిగిన నర్సులు బెల్జియం వెళ్లేందుకు వీలు కల్పించే కార్యక్రమాలు, ఆరోగ్యసేవలు, విద్యా రంగాల్లో రెండు దేశాల మధ్య కొనసాగుతున్న పౌర సమాజ సహకారంతో సహా ఆరోగ్య రంగంలో బెల్జియం ఆరోగ్య సేవా సంస్థలు, భారత్ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని వారు స్వాగతించారు. రవాణా, వలసలకు సంబంధించిన ఎంవోయూపై సంతకం చేసే దిశగా చర్చలు కొనసాగించాలని ప్రోత్సహించారు.
బెల్జియన్ ఎకనామిక్ మిషన్ సందర్భంగా కుదిరిన అనేక విద్యా భాగస్వామ్యాలను ప్రధానమంత్రి మోదీ గుర్తు చేసుకున్నారు. భారత నూతన విద్యా విధానం ప్రకారం ఇక్కడ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని బెల్జియం విశ్వవిద్యాలయాలను, ప్రఖ్యాత విద్యా సంస్థలను ఆహ్వానించారు. భారత్, బెల్జియం దేశాలకు చెందిన నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక, వృత్తి విద్య, శిక్షణ (టీవీఈటీ) రంగాల్లో సహకారాన్ని అన్వేషించాలని రెండు దేశాలకు చెందిన సంబంధిత అధికారులనూ, సంస్థలనూ, పారిశ్రామిక ప్రతినిధులనూ నాయకులిద్దరూ ప్రోత్సహించారు. ఉత్తమ పద్ధతులను పంచుకోవడం, పరిశ్రమ అవసరాలకు తగిన శిక్షణ అందించడం, శిక్షణ ఇచ్చేవారి, మదింపుదారుల సామర్థ్యాల పెంపు, అప్రెంటిస్షిప్పులు, పని ఆధారిత అభ్యాసం, అభివృద్ధి చెందుతున్న, భవిష్యత్తు నైపుణ్యాల్లో సహకారం, అర్హతా ప్రమాణాలను పరిగణించడం, వాటిని గుర్తించడంపై చర్చలు లాంటి చర్యలు చేపట్టాలని సూచించారు. తద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడానికి, పరస్పర ప్రయోజనం అందేలా నిపుణుల రాకపోకలను మెరుగుపరచడానికి వీలు కలుగుతుందన్నారు. భారతీయ సంస్థలతో కలసి పరిశోధనా సహకారం, ఆవిష్కరణలు, విజ్ఞాన వినిమయాన్ని ప్రోత్సహించడంలో ఫ్లెమిష్ ఇనిస్టిట్యూట్ ఫర్ టెక్నలాజికల్ రీసెర్చి (వీఐటీవో) పోషిస్తున్న పాత్రను నాయకులు ప్రశంసించారు. సుష్మా స్వరాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్, బెల్జియం ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ ఫారిన్ అఫైర్స్ మధ్య దౌత్య పరమైన శిక్షణలో సహకారాన్ని వారు స్వాగతించారు.
అంతర్జాతీయ సమస్యలు
ఉక్రెయిన్, పశ్చిమాసియా ప్రాంతాల్లో ఇటీవలి పరిణామాలతో సహా అంతర్జాతీయ పరిణామాలపై ప్రధానమంత్రులు ఇద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధం విషయానికి వస్తే ఐక్యరాజ్యసమితి చార్టర్ నియమాలు, అంతర్జాతీయ చట్టాలకు లోబడి చర్చలు, దౌత్యం ద్వారా సమగ్రమైన, న్యాయబద్ధమైన, శాశ్వతమైన శాంతిని సాధించే దిశగా చేపట్టే ప్రయత్నాలకు తమ మద్దతును ఉభయపక్షాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమాసియాకు సంబంధించి ఆ ప్రాంతంలో ఆందోళన కలిగిస్తున్న తాజా పరిణామాలను వారు చర్చించారు. శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవడంలో చర్చలు, దౌత్య విధానాల ప్రాధాన్యాన్ని వారు స్పష్టం చేశారు. సముద్ర మార్గాల రక్షణ, భద్రతను నిర్దారించడం, సురక్షితమైన, ఆటంకాలు లేని నౌకాయానాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని వారు తెలియజేశారు.
పరస్పర విశ్వాసం, శాంతి, సంక్షేమం, అభివృద్ధి కోసం ఉమ్మడి లక్ష్యంతో భారత్–బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో, విస్తృతం చేయడంలో తమకున్న నిబద్ధతను ఇద్దరు ప్రధానులు పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్యం, చట్టం, మానవ హక్కుల పట్ల గౌరవం, స్త్రీ పురుష సమానత్వం, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ క్రమం పట్ల ఉన్న ఉమ్మడి నిబద్ధత అందిస్తున్న మార్గదర్శకత్వంలో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు వారు అంగీకరించారు. ఈ పునాదుల ఆధారంగా నిర్మితమైన భారత్–బెల్జియం సహకారం రెండు దేశాల ప్రజలకు, ప్రపంచానికి ప్రయోజనాన్ని చేకూరుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఉమ్మడి అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడానికి, భారత్, ఐరోపా మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి సైతం దోహదపడుతుందని భావిస్తున్నారు.
భారత్–బెల్జియం మధ్య సహకారం బలోపేతమవుతున్న, విస్తరిస్తున్న నేపథ్యంలో, భారత్–ఐరోపా భాగస్వామ్యాలు, భారత్–ఈయూ సంబంధాలు పెరుగుతున్న తరుణంలో ఉభయపక్షాలకు అనువైన సమయంలో ద్వైపాక్షిక పర్యటన కోసం బెల్జియం రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రధాని బార్ట్ డి వెవర్ ఆహ్వానించారు.
***