Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌స్కట్‌ (ఓమాన్‌) లో భార‌తీయ సముదాయాన్ని ఉద్దేశించి 2018 ఫిబ్రవరి 11వ తేదీన ప్ర‌ధాన‌ మంత్రి ప్రసంగం

మ‌స్కట్‌ (ఓమాన్‌) లో భార‌తీయ సముదాయాన్ని ఉద్దేశించి 2018 ఫిబ్రవరి 11వ తేదీన ప్ర‌ధాన‌ మంత్రి ప్రసంగం

మ‌స్కట్‌ (ఓమాన్‌) లో భార‌తీయ సముదాయాన్ని ఉద్దేశించి 2018 ఫిబ్రవరి 11వ తేదీన ప్ర‌ధాన‌ మంత్రి ప్రసంగం

మ‌స్కట్‌ (ఓమాన్‌) లో భార‌తీయ సముదాయాన్ని ఉద్దేశించి 2018 ఫిబ్రవరి 11వ తేదీన ప్ర‌ధాన‌ మంత్రి ప్రసంగం


ఇక్క‌డకు పెద్ద సంఖ్య‌లో తరలివచ్చిన ప్రియ‌మైన నా దేశ‌ వాసుల‌కు శుభాకాంక్ష‌లు.

మన దేశం యొక్క శ‌క్తి ఎంత గొప్ప‌దో చూడండి, మ‌న దేశం లోని ప్ర‌జ‌లు మాట్లాడే వివిధ భాష‌లలో, మాండ‌లికాల‌లో నేను శుభాకాంక్ష‌లను తెలియ‌జేయ‌డం మొద‌లుపెడితే అలా చెబుతూ పోవ‌డానికి కొన్ని గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. ప్ర‌పంచం లోని ఏ ఇత‌ర దేశం లోనూ ఇంత‌టి వైవిధ్యం లేదు. ఈ రోజు నేను భారతదేశం వెలుప‌ల ఓమాన్ గ‌డ్డ‌ మీద నా క‌ళ్ల ముందు ఒక‌ బుల్లి భారతదేశాన్నే చూస్తున్నాను. దేశం న‌లుమూల‌ల నుండి వ‌చ్చిన భార‌తీయులు, వివిధ రంగాల‌లో ప‌నిచేస్తున్న భార‌తీయులు ఇక్క‌డికి త‌ర‌లి వ‌చ్చిన మ‌హాద్భుత దృశ్యం నా క‌ళ్లెదుట కనిపిస్తోంది. మీ శ‌క్తినంతా ఉప‌యోగించి భార‌త్ మాతా కీ జయ్ నినాదాన్ని బిగ్గ‌ర‌గా ప‌లికేందుకు నాతో గొంతు క‌ల‌పవలసిందిగా మీ అంద‌రినీ కోరుతున్నాను. భార‌త్ మాతా కీ జయ్, వందే మాత‌రమ్, వందే మాత‌రమ్, వందే మాత‌రమ్, వందే మాత‌రమ్,వందే మాత‌రమ్, వందే మాత‌రమ్.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, నేను ఓమాన్ ప‌ర్య‌ట‌న‌కు రావ‌డం ఇదే మొద‌టి సారి. రెండు గంట‌ల క్రిత‌మే నేను దుబాయ్ నుండి ఇక్క‌డకు వ‌చ్చాను. బ‌హుశా మీరు టివీ ల‌లో చూసే వుంటారు.. నేను దుబాయ్ అధ్య‌క్షుల వారి ఆహ్వానంపై అక్క‌డ‌కు వెళ్లాను. వరల్డ్ గవర్నమెంట్ సమిట్ లో నేను ముఖ్య అతిథిగా హాజ‌రై సాంకేతిక‌త‌, అభివృద్ధి అనే అంశం పై ప్రారంభోప‌న్యాసం చేసేందుకు నాకు మంచి అవ‌కాశం ద‌క్కింది. ఇది ఒక కార్య‌క్ర‌మంలో కేవ‌లం ఉప‌న్యాసం ఇవ్వ‌డం వంటిది కాదు. ఈ స‌మావేశాన్ని భార‌త‌దేశం సాధించిన అభివృద్ధికి ల‌భించిన గౌర‌వంగా చెప్పుకోవ‌చ్చు. ఈ అభివృద్ధి కార‌ణం గానే ప్ర‌పంచం మ‌న‌కు ఇవాళ‌ ఈ గౌర‌వాన్ని ఇస్తోంది. ఈ ఆధికారిక ప‌ర్య‌ట‌న కాక‌, నేను సుమారు ప‌ది సంవ‌త్స‌రాల క్రితం గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఓమాన్ కు వ‌చ్చాను. నేను గుజ‌రాత్‌ ముఖ్య‌మంత్రిగా అప్ప‌ట్లో ఆఫ్రికా కు వెళ్తూ, ఆ స‌మ‌యంలో నా ప్ర‌యాణంలో భాగంగా స‌లాలా మీదుగా పయనించాను. అక్క‌డ నేను కొద్దిసేపు ఆగాను. అప్పట్లో నేను క‌లుసుకొన్న వారంద‌రినీ ఇవాళ ఇక్క‌డ క‌లుసుకొనే అదృష్టం లభించింది. ఓమాన్‌లో మీ అంద‌రినీ క‌లుసుకోవాల‌ని, మీలో ఒక‌రిగా ఉండాల‌ని నేను ఎంతో కాలంగా అనుకొంటున్నాను. ఆ అవ‌కాశం ఈ రోజు వచ్చింది.

ఇందుకు ఓమాన్ ప్ర‌భుత్వం, పాల‌నా యంత్రాంగం ఏర్పాట్లు చేసినందుకు నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లను తెలియ‌జేసుకుంటున్నాను. మిత్రులారా, భార‌త‌దేశం, ఓమాన్ ల మ‌ధ్య సంబంధాలు వంద‌లు, వేల సంవ‌త్స‌రాల నాటివి. ఐదు వేల సంవ‌త్స‌రాల క్రితం, చెక్క‌తో త‌యారు చేసిన నౌక‌ల ద్వారా గుజ‌రాత్‌ లోని లోథాల్ పోర్ట్ గుండా ఓమాన్ సంద‌ర్శనకు తరలివ‌చ్చే వారు. తిరుగు ప్ర‌యాణంలో ఈ ప‌డ‌వ‌లు లోథాల్‌ ను దాటి భార‌తీయ కోస్తా తీర ఓడ‌రేవుల మీదుగా ద‌క్షిణాదిన శ్రీ‌ లంక‌ వ‌ర‌కు వెళ్లేవి. వేలాది సంవత్సరాలలో వ్య‌వ‌స్థ‌లు మారాయి. భార‌తదేశం సుదీర్ఘ‌ కాలం పాటు వ‌ల‌స‌ పాల‌న‌ను ఎదుర్కొంది. అయితే మ‌న శ‌తాబ్దాల వ్యాపారం, సుహృద్భావ సంబంధాలు మాత్రం మారలేదు, అవి అలాగే ఉన్నాయి.

భార‌త‌దేశం స్వాతంత్ర్యం సాధించిన త‌రువాత‌ ఉభ‌య దేశాల మ‌ధ్య వ్యాపారం, ఆర్థిక‌, సామాజిక సంబంధాల‌ను బ‌లోపేతం చేసేందుకు వ్య‌వ‌స్థ‌లు ఏర్ప‌డ్డాయి. మ‌ధ్య‌ ప్ర‌దేశ్‌ లోని బినా రిఫైన‌రీ ఓమాన్ స‌హాయంతో నిర్వ‌హింప‌బ‌డుతోంది. మ‌రొక పక్క భార‌త‌దేశానికి చెందిన‌ ప‌దిహేను వంద‌లకు పైగా జాయింట్ వెంచ‌ర్లు ఓమాన్‌ లో ప‌నిచేస్తున్నాయి. ఓమాన్ ప్ర‌గ‌తిలో భార‌త‌దేశం, భార‌తీయ మేధ‌స్సు లు వాటి వంతు పాటుపడుతున్నాయి. సాధారణంగా ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఒక రాయ‌బారిని నియ‌మిస్తుంటారు. కానీ భార‌త‌దేశం త‌ర‌ఫున వంద‌లు, వేల కొద్దీ రాయ‌బారులు ఇక్క‌డ కూర్చుని ఉన్నారు. గ‌త మూడు సంవ‌త్స‌రాల‌లో గ‌ల్ఫ్ దేశాల‌తో మ‌న ప్రాచీన‌, స్నేహ సంబంధాల‌ను ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఒక విధాన రూప‌క‌ల్ప‌న‌ తో మ‌నం ఎలా కొత్త‌ రూపు ను క‌ల్పిస్తున్నదీ మీరు గ‌మ‌నించేవుంటారు. మ‌నం ఈ సంబంధాల‌ను కొత్త ఎత్తుకు తీసుకు పోవ‌డ‌మే కాకుండా, వీటిని వివిధ కోణాల‌లో అనుసంధానం చేస్తున్నాం.

భార‌త‌దేశం స్థాయి, అభివృద్ధి నానాటికీ పెర‌గ‌డంతో పాటు గల్ప్ దేశాల ప్ర‌యోజ‌నాలు భార‌త‌దేశంలో ఏమేర‌కు పెరిగాయో మీరు గ‌మ‌నించేవుంటారు. ఈ ప‌రిణామాల‌ను మీరు గ‌మ‌నించారా, గమనించలేదా ? వీటిని మీరు మీ అనుభ‌వంలో తెలుసుకున్నారా, తెలుసుకోలేదా ? దీని ప్ర‌తిధ్వ‌నులు అన్ని వైపుల నుండీ విన‌ప‌డుతున్నాయి. గ‌ల్ఫ్ దేశాల‌తో భార‌త‌దేశ సంబంధాలు అది ఇంధ‌నం కానివ్వండి, లేదా వాణిజ్యం కానివ్వండి, లేదా పెట్టుబ‌డులు కానివ్వండి.. ప్ర‌తి రంగంలో ఎంతో ప్రాధాన్య‌ాన్ని సంత‌రించుకొంటున్నాయి. భార‌తదేశం, ఓమాన్ ల యొక్క చారిత్ర‌క సంబంధాలు కొత్త ఉత్తేజాన్ని, నూతన శ‌క్తి ని సంత‌రించుకోవ‌డం సాధార‌ణం. భౌగోళికంగా చూసిన‌ట్ట‌యితే గ‌ల్ఫ్ ప్రాంతంలో భారతదేశానికి ఎంతో ద‌గ్గ‌రి పొరుగుదేశం ఓమాన్. ఇంకా మ‌న అదృష్టం ఏమిటంటే, రాజ‌ కుటుంబంతో భార‌త‌దేశానికి ఎంతో కాలంగా స‌త్సంబంధాలు ఉన్నాయి. అలాగే, మాన్య శ్రీ సుల్తాన్‌ గారికి భార‌తదేశంతో విడ‌దీయ‌రాని బంధం ఉంది.

ఈరోజు, శ్రేష్ఠులైన సుల్తాన్ గారి పేరుతో ఉన్నటువంటి ఈ స్టేడియమ్ లో ఇంత పెద్ద సంఖ్య‌లో మిమ్మల్ని కలుసుకొని మీతో సంభాషించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్య‌ం ఉంది. భారతదేశం అన్నా, భార‌తీయులు అన్నా శ్రేష్ఠులైన సుల్తాన్‌ గారికి ఎంతటి అభిమాన‌ం ఉన్నదీ ఈ ఘటన ప్రతిబింబిస్తోంది. ఈ ప్ర‌త్యేక అవ‌కాశాన్ని క‌ల్పించినందుకు సుల్తాన్ గారికి మేం అమిత కృత‌జ్ఞ‌ులం.

మీతో ముచ్చ‌టించిన అనంత‌రం నేను రాజు గారిని క‌ల‌వ‌డానికి వెళ్తున్నాను. నేను వారు చిర‌కాలం ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని, మీ అంద‌రి త‌ర‌ఫున‌, 125 కోట్ల మంది భార‌తీయ‌ల త‌ర‌ఫున వారికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌నున్నాను. మ‌న రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు మ‌రింత బ‌లోపేతం చేయ‌డ‌మే నా ప‌ర్య‌ట‌న ఉద్దేశ‌మ‌ని నేను వారికి తెలియ‌జేయ‌నున్నాను. ఈరోజున ఓమాన్‌ లో మీరు ఇంటిని పోలినటువంటి వాతావ‌ర‌ణాన్ని క‌లిగివున్నారు. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు. ఇంటి వ‌ద్ద ఉన్న‌ట్టు ఉండే వాతావర‌ణాన్ని మీరు అనుభ‌విస్తున్నారంటే అది ఇక్క‌డి ప్ర‌జ‌లు, ఇక్క‌డి నాయ‌క‌త్వం అనుస‌రిస్తున్న విలువ‌ల‌కు ప్ర‌తిబింబంగా చెప్పుకోవ‌చ్చు. భార‌త‌దేశంలో వైవిధ్య‌ానికి, స‌హ‌జీవ‌నానికి ఇది ఎంతో ముఖ్య‌మైందిగా మ‌నం భావిస్తాం.

ఓమాన్‌ లో నివ‌సిస్తున్న 8 ల‌క్ష‌ల మంది నా సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులు భార‌త‌దేశ‌పు సహృద్భావ రాయ‌బారులు. మీరు ఓమాన్ అభివృద్ధికి మీ విలువైన చేయూత‌ను అందించారు. మీరు మీ యొక్క స్వేదాన్ని చిందించారు. మీరు మీ య‌వ్వ‌నాన్ని ఈ ప్రాంతం కోసం త్యాగం చేశారు. మీ తీవ్ర క‌ష్టానికి ఓమాన్ ప్ర‌భుత్వం మీకు పూర్తి గౌర‌వాన్ని ఇస్తున్న‌ట్టు తెలిసి సంతోషిస్తున్నాను.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, మ‌న భార‌తీయుల‌ సాంస్కృతిక విలువ‌లు ఎలాంటివంటే, ప్ర‌తి స‌మాజంలోనూ మ‌నం మ‌న కోసం సుల‌భంగా కొంత ప్ర‌దేశాన్ని మ‌లుచుకోగ‌లం. నిజంగా ఇలాగే జ‌రుగుతూ ఉంటుందా లేదా ? మ‌నం పాల‌లో చ‌క్కెరలా క‌లిసిపోతాం.. అవునా, కాదా ? అంతేకాదు, పాల‌ను తియ్య‌గా చేస్తాం. ఇవీ మ‌న విలువ‌లు. ఇదీ మ‌న స్వ‌భావం. దీనిని మ‌నం మ‌న‌ వార‌స‌త్వంగా పుణికిపుచ్చుకున్నాం. ఎందుకంటే మ‌నం వ‌సుధైక కుటుంబ‌కమ్ అనే సూత్రాన్ని అనుస‌రించే వాళ్లం. అంటే ప్ర‌పంచ‌మంతా ఒకే పరివారం అని భావించే వాళ్లం. ఆయా స‌మాజాలకు, కాలాల‌కు అనుగుణంగా స‌ర్దుకుపోవ‌డం, ప్ర‌తి ఒక్క‌రినీ గౌర‌వించ‌డం, మ‌న సంస్కృతి సంప్ర‌దాయాల‌ను ఆచారాల‌ను పాటిస్తూనే ప్ర‌తి ఒక్క సంప్ర‌దాయాన్నీ గౌర‌వించ‌డమ‌నేది భార‌త‌దేశానికి మాత్ర‌మే ప్ర‌త్యేక‌మైంది. అందువ‌ల్ల భార‌త‌దేశానికి ఎంతో దూరంలో ఉండి, ఇక్క‌డ భార‌తీయ విలువ‌ల‌ను పాటిస్తూ ఈ ప్రాంత సామాన్య ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకొనేందుకు మీరు చేస్తున్న అద్భుత కృషి కి నిజంగా మీరు ప్ర‌శంస‌ల‌కు , అభినంద‌న‌ల‌కు అర్హులు. దీనినే ఇంకా సంక్షిప్తంగా చెప్పాలంటే, ప్ర‌పంచంలో ఎన్నో ప్ర‌ముఖ దేశాలు క‌నుమ‌రుగైనా, ప్ర‌పంచ ప‌టం ఎన్నో మార్పుల‌కు లోనైనా భార‌త‌దేశం మాత్రం విజ‌య‌ ప‌థం లో నేటికీ ముందుకు దూసుకుపోతూ ఉండ‌డానికి ముఖ్య కార‌ణం ఇదే. మ‌నం ప‌య‌నించే మార్గం ఎంత క్లిష్ట‌మైందైనా, ప‌రిస్థితులు ఎంత సంక్లిష్టైమైన‌వైనా స‌రే వాటిని అధిగ‌మించ‌డం ఎలాగో తెలిసిన‌ వాళ్లం మ‌న‌మే. మార్పు కోసం అవిశ్రాంతంగా శ్ర‌మించ‌డం మ‌న న‌రాల్లో ఉంది. భ‌విష్య‌త్తు పై ఆశ‌, ఉత్సాహంతో ఎంత‌టి క‌ష్టాన్ని అయినా అధిగ‌మించ‌గ‌ల‌మ‌న్న‌ది మ‌న గ‌ట్టి సంక‌ల్పం.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, ఇవాళ ప్ర‌తి ఒక్క భార‌తీయుడు న్యూ ఇండియా ఆవిష్కరణను ఫలింప చేసేందుకు త‌న‌కు తాను పూర్తిగా అంకితం అవుతున్నాడు. ఇందుకోసం వారు రాత్ర‌న‌క , ప‌గ‌ల‌న‌క క‌ష్ట‌ప‌డుతున్నారు. అక్క‌డ భార‌త‌దేశంలో ఏదైనా మంచి జ‌రిగితే ఇక్క‌డ ఓమాన్‌ లో ఉన్న మీ ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. మీరు ఎంతో సంతోషిస్తారు. అక్క‌డ ఏదైనా చెడు జ‌రిగిన‌ట్టు తెలిస్తే ఇక్క‌డ మీరు ఎంతో ఆందోళ‌న చెందుతారు. నిజంగా ఇదీ మ‌న విశిష్టత‌. నా వాళ్లు అన్న భావ‌నకు ఇది నిద‌ర్శ‌నం. దేశం లోని అత్యంత నిరుపేద‌లు వృద్ధి లోకి రావ‌డానికి స‌మాన అవ‌కాశాలను పొందే దిశ‌గా మ‌నం ముందుకు క‌దులుతున్నాం. ఎక్క‌డ నిరుపేద‌లు వారి అభివృద్ధి ని గురించి క‌ల‌లు క‌న‌గల‌రో, ఎక్క‌డ ఆ క‌ల‌లు సాకారం కాగ‌ల‌వ‌న్న ఆశ పెరుగుతుందో, ఎక్క‌డ ఈ క‌ల‌ల‌ను పండించుకొనేందుకు క‌ష్టించి ప‌నిచేయ‌డానికి అవ‌కాశం ల‌భిస్తుందో, ఎక్క‌డ త‌న‌కు స‌కాలంలో ఎవ‌రి నుండి అయినా మ‌ద్ద‌తు, మార్గ‌నిర్దేశం ల‌భిస్తాయో .. ఆ విధంగా దేశం ఇంత‌కు ముందటి కంటే వేగంతో న్యూ ఇండియా స్వప్నాల‌ను సాకారం చేసుకొనేందుకు 125 కోట్ల మంది ప్ర‌జ‌ల‌ను వెంట‌ బెట్టుకొని అభివృద్ధి ప‌థంలో ముందుకు దూసుకుపోతోంది. మ‌న దేశం లోని సామాన్యుల జీవితాల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు, జీవ‌న సౌల‌భ్యాన్నిపెంచేందుకు మేం ఈ కింది మంత్రాన్ని అనుస‌రిస్తున్నాం. అదే క‌నీస ప్ర‌భుత్వం, గ‌రిష్ఠ‌ పాల‌న‌. మేం వీట‌న్నింటినీ ప్ర‌భుత్వ సంస్కృతిలో భాగం చేశాం. ప‌లు ప్ర‌క్రియ‌ల‌ను సుల‌భ‌త‌రం చేశాం. అన‌వ‌స‌ర చ‌ట్టాల‌ను తొల‌గించాం. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌లో 40-50 పేజీలు ఉండే ఫారాల‌ను నాలుగైదు ఫారాల‌కు త‌గ్గించాం. ఆ ఫారాల‌ను ఆన్‌లైన్ ద్వారా దాఖ‌లు చేసే వీలు క‌ల్పించాం; ప్ర‌జ‌ల ఫిర్యాదుల‌ను చిత్త‌శుద్దితో విని, వాటిని ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకొంటున్నాం. ఇది అదే ప్ర‌భుత్వం; అదే ప్ర‌జ‌లు; అదే అధికార యంత్రాంగం; అవే ఉప‌క‌ర‌ణాలు; అవే వ‌న‌రులు; అదే ఫైలు; అదే క్ల‌ర్కు; ప్ర‌తి ఒక్క‌టి అదే.. కానీ, విభిన్న‌మైన ఫ‌లితాలను సాధిస్తున్నాం. ప్ర‌జ‌లు మార్పును గుర్తిస్తున్నారు. మారిన భార‌త‌దేశంలో పేద ప్ర‌జ‌లు అవ‌మాన భారంతో బ్యాంకుల‌ నుండి వెనుదిరిగి వెళ్లే ప‌రిస్థితి ఇప్పుడు లేదు. మారిన భార‌త‌దేశంలో గ్యాస్ క‌నెక్ష‌న్‌, విద్యుత్తు క‌నెక్ష‌న్ ఇవ్వ‌డానికి ప్ర‌భుత్వమే పేద‌ల ఇంటికి వెళ్తోంది. మోదీ గారూ, ఇదంతా ఎలా సాధ్యం ? అని ఇవాళ మ‌న దేశం లో, ఓమాన్‌ లో ఉన్న మీరూ అనుకోవ‌చ్చు, మీరు న‌మ్మ‌క‌పోచ్చు. ఉదాహ‌ర‌ణ‌కు బీమా నే తీసుకోండి. ఇది సంపన్న వ‌ర్గాల‌కు సంబంధించింద‌న్న భావ‌న ఉండేది. ఇలాంటి వాటి చ‌ర్చ డ‌బ్బున్న వారికి సంబంధించింద‌న్నట్టు ఉండేది. కానీ ఇవాళ రోజుకు 90 పైస‌ల ప్రీమియమ్ తో పేద‌ల‌కు జీవిత భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు ప్ర‌జ‌లు ఢిల్లీ లోని కేంద్ర‌ ప్ర‌భుత్వానికి అవ‌కాశం ఇచ్చారు. మ‌రో ప‌థ‌కం, నెల‌కు ఒక రూపాయి ప్రీమియమ్ తో క‌ల్పిస్తున్న బీమా ప‌థ‌కం. 90 పైసలు. నేను చాయ్ అమ్మిన వ్య‌క్తి ని. అందుకే నాకు తెలుసు, ఈ 90 పైస‌ల‌కు ఇప్పుడు క‌ప్పు చాయ్ అయినా రాదు. ప్ర‌భుత్వం సంవేదనశీలంతో ఉండి, అది ఇలాంటి విధానాల‌ను రూపొందిస్తే ఈ తరహా ప‌థ‌కాల వ‌ల్ల ఎలాంటి మేలు క‌లుగుతుందో మీకు తెలుసు. పేద‌లు ఎవ‌రికైనా క‌ష్టం ఎదురైన‌పుడు వారికి ఈ ప‌థ‌కం లో భాగంగా బీమా సదుపాయం ఉంటే వారికి సాయ‌ప‌డేందుకు బీమా సంస్థ వారు ముందుకు రావ‌డానికి వీలుంటుంది. అది మీకు సంతృప్తిని ఇస్తుంది. ఈ కుటుంబాల‌కు క‌లిగిన ప్ర‌యోజ‌నం పాత‌ది కాదు. దాదాపు ఏడాది కాల‌ం అవుతోంది. ఈ బీమా ప‌థ‌కాల కింద దాదాపు 2000 కోట్ల రూపాయల‌ను పేద ప్ర‌జ‌ల‌కు బీమా క్లెయిములు గా పంపిణీ చేయ‌డం జ‌రిగింది. దీనికి సంబంధించి మీలో కొంద‌రికి తెలిసే ఉంటుంది. మీ కుటుంబ స‌భ్యులకో, మీ బంధువుల‌కో ఇలాంటి ప‌రిస్థితి ఎదురైనందువ‌ల్ల దీని గురించి మీకు తెలిసి ఉండ‌వ‌చ్చు.

మిత్రులారా, మీరు కొత్త పాస్‌పోర్ట్ ను పొంద‌డానికి, లేదా దాని పునరుద్ధరణకు ఇబ్బందులు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. మేం పోస్టాఫీసుల‌లో కూడా పాస్ పోర్టు సౌక‌ర్యాన్ని క‌ల్పించాం. ప‌దిహేను రోజుల‌ త‌రువాత అయినా పాస్ పోర్టు వ‌స్తుందా లేదా అన్న అనుమానాలు పెట్టుకోకుండా, సామాన్యుడు ఎలాంటి స‌మ‌స్య‌లను ఎదుర్కోకుండా చూసేలా వారి స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించే విధంగా ఏర్పాట్లు చేశాం. వికేంద్రీక‌ర‌ణ‌, సామర్ధ్యం , పాస్‌పోర్టు సేవ‌ల వ్య‌వ‌స్థ‌ లోకి పోస్టాఫీసుల‌ను తీసుకురావ‌డం వ‌ల్ల ఇప్పుడు పాస్‌ పోర్టు ను ఒక‌టి రెండు రోజుల‌లో అంద‌జేయ‌డం జ‌రుగుతోంది. ఎవ‌రైనా మ‌న‌ దేశంలో వ్యాపారం చేయాల‌నుకున్నా , ఏదైనా కొత్త కంపెనీని పెట్టాల‌నుకున్నా, కొంత మొత్తం పెట్టుబ‌డిగా పెట్టాల‌నుకున్నా, కొత్త కంపెనీ రిజిస్ట‌ర్ చేయాల‌న్నా గ‌తంలో చాలా రోజులు ప‌ట్టేది. అయితే ఇవాళ ఈ ప‌ని కేవ‌లం 24 గంట‌ల‌లో పూర్త‌ి అవుతోంద‌ని నేను సంతృప్తితో చెప్ప‌గ‌ల‌ను. గ‌తంలో ప్ర‌భుత్వాలు, మేం ఈ చ‌ట్టం లేదా ఆ చ‌ట్టం తెచ్చామ‌నో, మేం ఆ ప‌ని చేశామ‌నో ప్ర‌క‌టించ‌డం వినే ఉంటారు. ఇలాంటి మాట‌లు మీరు విని ఉంటారా, లేదా ? నేను మీకు ఇందుకు భిన్నమైన స‌మాచారాన్ని తెలియ‌జేస్తాను. అవస‌ర‌ం ఉన్న‌ప్పుడు చ‌ట్టాలు చేస్తారు. మేం కూడా చ‌ట్టాలు చేస్తుంటాం. అయితే మా ప్ర‌భుత్వం అధికారం చేప‌ట్టిన త‌రువాత ఈ కాలంలో అవ‌స‌రం లేని 1400-1500 చ‌ట్టాల‌ను తొల‌గించాం. 1400-1450 చ‌ట్టాల‌ను తొల‌గించ‌డ‌ం అంటే, కాలం చెల్లిన ఒక చ‌ట్టాన్ని మా పాల‌నా కాలంలో స‌గ‌టున రోజు కు ఒక చ‌ట్టం వంతున తొల‌గించిన‌ట్టు లెక్క‌. అవ‌స‌రం లేని చ‌ట్టాలు పేరుకుపోవ‌డం సామాన్యుడికి భారం. మ‌నం ఈ చ‌ట్టాల‌ను మార్చి సామాన్య‌ుడు స్వేచ్ఛ‌గా ఊపిరి పీల్చుకొనే వీలు ను క‌ల్పించాం. వారి దిశ మార్చాం. పాత చ‌ట్టాల బ‌రువు నుండి విముక్తి ప్రసాదించాం.

ఈ సారి బ‌డ్జెటు ను మీరు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించండి.. ప్ర‌పంచం మొత్తాన్ని ఆక‌ర్షించేలా చేసిన ప‌థ‌కాన్ని మేం ప్ర‌క‌టించాం. మీరు చూసే ఉంటారు. ఇది సాధ్యమే. నేను చెప్పే పేరు ను మీరు విని ఉండ‌క పోవ‌చ్చు. వేరే పేరు ను విని ఉండ‌వచ్చు. కానీ మేం ఈ బ‌డ్జెలు లో ప్ర‌క‌టించిన ప‌థ‌కం పేరు ‘ఆయుష్మాన్ భార‌త్ యోజ‌న‌’. ఈ ఆయుష్మాన్ భార‌త్ యోజన లో భాగంగా దేశం లోని ప‌ది కోట్ల పేద కుటుంబాలకు మేం ఆరోగ్య బీమా స‌దుపాయాన్ని అందిస్తున్నాం. అంటే సుమారు 45 నుండి 50 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య బీమా స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నాం. ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య బీమా స‌దుపాయం క‌ల్పించేందుకు ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించాం. ఈ ప‌థ‌కంలో భాగంగా 40-50 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. దీని వ‌ల్ల పేద కుటుంబాలు ఏడాదికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఉచిత వైద్య‌ చికిత్సా స‌దుపాయాన్ని పొందుతాయి. ఈ బీమా ప‌థ‌కం కింద వివిధ జ‌బ్బుల‌కు చికిత్స కోసం అయ్యే ఖ‌ర్చును 5 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ప్ర‌భుత్వం భ‌రిస్తుంది.

ఇప్పుడు నేను ఆయుష్మాన్ భార‌త్ ను గురించి వివరించాను. బ‌హుశా మీరు ఈ పేరుకు బ‌దులు భార‌తీయ ప‌త్రిక‌లు ఒక కొత్త పేరుతో దీనిన గురించి ప్ర‌స్తావించ‌డం చూశాం అని అనుకొంటూ ఉండ‌వ‌చ్చు. మంచిదే. ఆ పేరు ను ఎవరైనా విన్నారా ? భార‌తీయ ప‌త్రిక‌లు ఈ ప‌థ‌కాన్ని ‘మోదీ కేర్’ అంటూ అభివ‌ర్ణిస్తున్నాయి. ఈ ప‌థ‌కాన్ని మా ప్ర‌త్య‌ర్థులు కూడా వ్య‌తిరేకించ‌డం లేదు. వారు కేవ‌లం అంటోంది ఏమిటంటే, సోద‌రా ఈ ప‌థ‌కం మంచిదే, దీనిని ఎలా అమ‌లు చేస్తారు ? అని. సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, భార‌త‌దేశం ఏదైనా నిర్ణ‌యించిందంటే, ఎలాగైనా స‌రే దానిని సాధించి తీరుతుంది. అలాంటి దేశం భార‌త‌దేశం. జీవ‌న సౌల‌భ్యాన్ని పెంచే ఇలాంటి ఎన్నో ప‌థ‌కాలు 125 కోట్ల మంది భార‌తీయుల జీవితాన్ని సుల‌భ‌త‌రం చేస్తున్నాయి.

సొద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, ప్ర‌భుత్వాలు వ‌స్తుంటాయి, పోతుంటాయి; ప్ర‌జ‌లు వ‌స్తుంటారు, పోతుంటారు; కానీ, గ‌మ‌నించాల్సిన‌ ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే, ప్ర‌భుత్వం ఎలాంటి పాల‌న ను అందించింద‌న్న‌ది. గ‌తంలో ఒక ర‌క‌మైన పాలన ఉండేది. 30-40 సంవ‌త్స‌రాలు అయినప్పటికీ ప‌లు ప‌థ‌కాలు ఆచ‌ర‌ణ‌కు నోచుకోని కాలం అది. నేను గుజ‌రాత్ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉండే వాడిని. అక్క‌డ ఒక ఆనకట్ట ఉంది. దాని పేరు స‌ర్దార్ స‌రోవ‌ర్ ఆనకట్ట. ఆ ఆనకట్టకు పండిత్ నెహ్రూ శంకుస్థాప‌న చేశారు. దాని ప‌నులు కేవ‌లం గ‌త ఏడాది పూర్తి అయ్యాయి. కొన్ని సార్లు, ఆనకట్ట నిర్మాణం పూర్త‌ి అయితే దానికి అవ‌స‌ర‌మైన కాల్వ ప‌నులు పూర్తి కాని ప‌రిస్థితి. కొన్ని సంద‌ర్భాల‌లో వంతెనలు పూర్త‌ి అయితే వాటిని అనుసంధానం చేసే రహదారుల నిర్మాణం చేపట్ట‌లేదు. విద్యుత్తు స్తంభాలు నాటితే వాటికి వైర్లను బిగించ‌లేదు. కొన్ని సంద‌ర్భాల‌లో వైర్లు వేసినా క‌రెంటు స‌ర‌ఫ‌రా చేయ‌నందువ‌ల్ల ఆ తీగ‌ల‌పై ప్ర‌జ‌లు బ‌ట్ట‌లు ఆరేసుకొనే పరిస్థితి. కొత్త రైలు స‌ర్వీసులను ప్ర‌క‌టించారు; కానీ, రైల్వే ట్రాక్‌ల గురించి, రైళ్ల గురించి ఎవ‌రూ ఆలోచించ‌డానికి ప్ర‌య‌త్నించ‌లేదు. కొన్ని సంద‌ర్భాల‌లో ట్రాక్‌ ల‌కు సంబంధించిన డ్రాయింగ్‌ లు కూడా కాగితాల మీదకు ఎక్కలేదు. ఇలాంటి అస్త‌వ్య‌స్త పాల‌న తో దేశం 21 వ శ‌తాబ్దం లో అభివృద్ధి ప‌థం లోకి వెళ్ల‌జాలదు. ఈ ప‌రిస్థితి మారాలి. ఈ మార్పు త‌ప్ప‌నిస‌రి. అంతే కాదు, కుంభ‌కోణాల భారీ జాబితా కార‌ణంగా దేశం లోప‌లా, వెలుప‌లా దేశ ప్ర‌తిష్ఠ‌కు భంగం క‌లిగింది. ఇప్పుడు మేం దేశాన్ని ఇలాంటి ప‌రిస్థితి నుండి బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చాం.

మా ప్ర‌భుత్వం అధికారం లోకి వ‌చ్చి దాదాపుగా నాలుగు సంవ‌త్స‌రాలు పూర్త‌ి అవుతోంది. కానీ ఎవ‌రూ మోదీ ఎంత తీసుకు పోయార‌ని అన‌డం లేదు.

ప్రియ‌మైన భార‌తీయ సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, ఈ రోజున నేను ఈ విషయాన్ని ఎంతో విన‌మ్ర‌త‌ తోను, సంతృప్తి తోను చెప్ప‌గ‌లుగుతున్నాను. ఈ దేశం నాకు ఇచ్చిన బాధ్య‌త‌ ను నేను ఏనాడూ వ‌ద‌ల‌ను. మీ ఆశ‌లకు, ఆకాంక్ష‌లకు నేను ఏనాడూ తూట్లు పొడ‌వ‌ను. ఈ విష‌యాన్ని శిర‌స్సు వంచి మీకు తెలియ‌జేసుకుంటున్నాను.

ఈ నాడు ఏమవుతోంది.. గ‌తాని కంటే భిన్నంగా జ‌రుగుతోంది. నేను ఎక్క‌డ‌కు వెళ్లినా, ఎవ‌రితో స‌మావేశ‌మైనా, ఆఖ‌రుకు నా శ‌త్రువులు కూడా ఈ విష‌యంలో నా పైన ఆరోప‌ణ‌లు చేయ‌డం లేదు. విమ‌ర్శ‌ల‌కు బ‌దులుగా వారు న‌న్ను అడుగుతున్నారు.. మోదీ గారూ, ఎంత వ‌చ్చిందో ద‌య‌చేసి మేం తెలుసుకొనేటట్టు చేయండ‌ని. గ‌తంలో ప్ర‌జ‌లు ఎంత మొత్తం అక్ర‌మ ఖాతాల లోకి వెళ్లిపోయింద‌ని అడిగే వారు. ఇప్పుడు మాత్రం మోదీ గారూ ఎంత వ‌చ్చిందో చెప్పండ‌ని అడుగుతున్నారు. నేడు దేశంలో పెరుగుతున్న ఈ న‌మ్మ‌కం, ఈ విశ్వాసంతో కొత్త ఆశ‌లు చివుళ్లు వేస్తున్నాయి. అలా క‌లుగుతున్న నవీనమైన ఆశ అనేది న్యూ ఇండియా ఆవిష్కారానికి నిజాయతీ తో కూడిన మ‌ద్ద‌తును ఇస్తోంది.

ప్ర‌జ‌ల‌కు అనుకూల‌మైన‌, అభివృద్ధితో కూడిన‌, బాధ్య‌త‌తో కూడిన పాల‌నపైన దృష్టి పెట్టి దేశాన్ని ముందుకు తీసుకుపోవ‌డానికి ఈ రోజున మేం కృషి చేస్తున్నాం. గ‌తంలో నేను చెప్పిన‌ట్టుగానే.. మా కృషికి ఫ‌లితాల‌ను ఇప్పుడు చూస్తున్నాం.
ప్ర‌భుత్వం చేప‌ట్టిన అనేక ప‌నులు చాలా వేగ‌వంతంగా అమ‌ల‌వుతున్నాయి. రహదారుల నిర్మాణంలో, రైల్వే ట్రాకుల‌ను వేయ‌డంలో, రైల్వే ట్రాకుల‌ను విద్యుదీక‌రించ‌డంలో, నూత‌న విమానాశ్ర‌యాల‌ను నిర్మించ‌డంలో, పేద‌ల‌కు గృహాలను నిర్మించడంలో, బ్యాంకు ఖాతాలను తెరిపించ‌డంలో, గ్యాస్ క‌నెక్ష‌న్ లను అందించ‌డంలో.. ఇలాంటి ప‌నులు అన్నీ గ‌తంలో కంటే రెండు మూడు రెట్లు వేగంతో పూర్త‌ి అవుతున్నాయి.

మ‌న దేశానికి సంబంధించిన మొదటి రెండు ద‌శాబ్దాల పూర్తి స్థాయి స‌మ‌ర్థత ఇప్పుడు అనుభ‌వం లోకి వ‌స్తుంద‌నే విష‌యం తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు. ప‌లు ప్ర‌భుత్వాలు వ‌చ్చాయి, వెళ్లిపోయాయి; మొత్తం ప్ర‌పంచ‌మే మారిపోయింది. కానీ, భార‌త‌దేశానికి తనదైనటువంటి ఒక సొంత విమాన‌యాన రంగ విధానమంటూ లేదు. మా ప్ర‌భుత్వం పాల‌న చేప‌ట్టిన త‌రువాత మేం విమాన‌యాన విధానాన్ని రూపొందించాం. ఒకటో అంచె, రెండో అంచె ప‌ట్ట‌ణాలలో, చిన్న చిన్న న‌గ‌రాలలో, జిల్లా ప్ర‌ధాన ప‌ట్ట‌ణాలలో ఉన్న విమానాశ్ర‌యాల‌ను తిరిగి పని చేసేటట్టు చేశాం. నూత‌న విమానాశ్ర‌యాల‌ను నిర్మించ‌డానికిగాను ఉద్య‌మ‌ రీతిలో కృషి చేస్తున్నాం.

ప్రియ‌మైన నా మిత్రులారా, నేడు మ‌న దేశంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగాలలో దాదాపు 450 విమానాలు ఎగురుతున్నాయి. దీని అర్థం ఏమిటంటే ఈ డెబ్బ‌యి సంవ‌త్స‌రాలలో మ‌నం 450 విమానాల స్థాయికి చేరుకొన్నాం అని. ఈ ఒక సంవ‌త్స‌రంలో వివిధ ప్రైవేటు కంపెనీలు, ప్రైవేటు రంగాల‌కు చెందిన ప్ర‌జ‌లు 900 కొత్త విమానాల‌ను కొనడం కోసం ఆర్డ‌ర్లు ఆయా విమాన త‌యారీ కంపెనీలకు పంపారు. 70 ఏళ్ల‌ లో 450 విమానాల స్థాయికి చేరుకొంటే ఈ ఒక్క సంవ‌త్స‌రం లోనే 900 కొత్త విమానాల‌ కోసం ఆర్డ‌ర్లను పంపించ‌డం జ‌రిగింది. ఇది ఎలా సాధ్య‌మైంది ?. స్లిప్ప‌ర్లను ధ‌రించే సామాన్యుడు కూడా విమానాలలో ప్ర‌యాణం చేయాల‌నేది మేం రూపొందించిన విమాన‌యాన విధాన ఉద్దేశం.

మిత్రులారా, క్షేత్ర‌ స్థాయిలో ప‌రిస్థితుల‌ను మెరుగు చేయ‌క‌పోయి ఉంటే ఇప్పుడు మీరు చూస్తున్న వృద్ధి, వేగం మీరు చూసి ఉండే వారు కాదు. భారీ స్థాయిలో, సుస్థిర‌మైన మార్పుల‌ను సాధించడం అంత సులువైన విష‌యం కాదు. మొత్తం వ్య‌వ‌స్థ‌నే మార్చాలి. ఈ మార్పుల‌న్నీ వ‌చ్చాయి కాబ‌ట్టే ప్ర‌పంచ‌ బ్యాంకు ప్ర‌చురించిన సుల‌భ‌త‌ర వాణిజ్య జాబితా లో మ‌న దేశ స్థానం 142 నుండి 100 వ స్థానానికి ఎగ‌బాకింది. ఇది చూసి మొత్తం ప్ర‌పంచ‌మే ఆశ్చ‌ర్య‌పోతోంది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, 21వ శ‌తాబ్దం అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని రాబోయే త‌రానికి అవ‌స‌ర‌మ‌య్యే మౌలిక వ‌స‌తుల‌ను అభివృద్ధి చేయ‌డం జ‌రుగుతోంది. ప్ర‌త్యేకంగా ర‌వాణా రంగాన్ని చ‌క్కగా అభివృద్ధి చేస్తున్నాం. ఇది ఎలా జ‌రుగుతోందంటే ఈ రంగానికి సంబంధించిన ప‌లు అంశాలు ఒక‌దానితో మ‌రొక‌టి చ‌క్క‌గా స‌హ‌క‌రించుకొంటున్నాయి. ప్ర‌ధాన ర‌హ‌దారులు, విమాన‌యాన మార్గాలు, రైల్వేలు, నౌకాయానం.. ఈ నాలుగింటిని వాటి వాటి అవ‌స‌రాల ఆధారంగా అనుసంధానించ‌డం జ‌రిగింది. భారత్ మాలా ప్రాజెక్టు లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం 53 వేల కిలోమీట‌ర్ల పొడ‌వైన ర‌హ‌దారుల నిర్మాణాన్ని ప్రారంభించింది. దేశం లోని వివిధ ప్రాంతాలలో రైల్వే కారిడోర్ లకు సంబంధించిన ప‌నులు కొన‌సాగుతున్నాయి. మెట్రో రైలు సౌక‌ర్యాన్ని 11 న‌గ‌రాల‌కు విస్త‌రించ‌డం జ‌రిగింది. గ‌త ఏడాదే కోచి మెట్రో ను ప్ర‌జ‌ల‌కు అంకితం చేసే అవ‌కాశం నాకు ల‌భించింది. చెన్నై మెట్రో రైలు ను విస్త‌రించే ప‌ని జ‌రుగుతోంది. ఈ బ‌డ్జెటులో బెంగ‌ళూరు మెట్రో కోసం భారీ కేటాయింపులు జరపడమైంది. అదే విధంగా సాగ‌ర్ మాలా పేరుతో కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తున్నాం. దేశం లోని కోస్తా ప్రాంతాల ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను, వాటికి సంబంధించిన మౌలిక స‌దుపాయాల‌ను అభివృద్ధి చేయ‌డానికి సంబంధించిన కార్య‌క్ర‌మ‌ం ఇది.
మ‌త్స్య‌కార కుటుంబాల‌కు చెందిన సోద‌రులు మరియు సోద‌రీమ‌ణుల‌ కోసం మేం నీలి విప్ల‌వ ప‌థ‌కాన్ని ప్రారంభించాం. చేప‌ల వేట‌ కోసం వారు ఆధునిక మ‌ర‌ పడవలను కొనుగోలు చేయడానికి వీలుగా కేంద్ర ప్ర‌భుత్వం ఆర్ధిక సాయం చేస్తోంది. దేశంలో 100కు పైగా నౌకాయాన ర‌హదారుల‌ను అభివృద్ధి చేస్తున్నాం. రవాణా కోసం న‌దుల‌ను సైతం ఉప‌యోగించుకొంటాం. అలాంటి నౌకాయాన దారుల‌ను 110 వ‌ర‌కూ గుర్తించాం. అవి ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించ‌డ‌మే కాకుండా ర‌వాణా వ్యయాన్ని త‌గ్గిస్తాయి కూడాను. ఈ ప‌ని చేయ‌డం వ‌ల్ల ఆయా వ‌స్తువుల‌ను వినియోగ‌దారులు త‌మ‌కు అందుబాటు ధ‌ర‌ల్లో పొంద‌గ‌ల‌రు.

సోదరులు మరియు సోదరీమణులారా, మీలో ఎవ‌రైనా 2022-23లో భార‌త‌దేశానికి వ‌స్తే మీరు ఓ గొప్ప మార్పును చూడ‌గ‌ల‌రు. అది మ‌రేంటో కాదు బులిట్ ట్రేన్‌. ముంబయి, అహ‌మదాబాద్ ల మ‌ధ్య‌ బులిట్ ట్రేన్ కు సంబంధించిన ప‌నులు గ‌త ఏడాదే మొద‌ల‌య్యాయి. ఈ రైలులో మీరు అహ‌మదాబాద్ నుండి ముంబయి కి కేవ‌లం రెండు నుండి రెండు గంటల 15 నిమిషాల్లో చేరుకోగ‌ల‌రు. భార‌త‌దేశంలో అమ‌లులో ఉన్న వ్య‌వ‌స్థ‌లు.. ద‌శ‌ల‌ వారీ పురోగ‌తి ని మాత్ర‌మే సాధించ‌డం లేదు. ఆధునిక‌ సాంకేతిక‌త‌ ను, స‌రికొత్త సేవా వ్య‌వ‌స్థ‌ ను కూడా భార‌త‌దేశం అందిపుచ్చుకొంటోంది. మిత్రులారా, ఇప్పుడు భార‌త‌దేశంలో నిర్ణ‌యాల‌ను వాయిదా వేయ‌డం లేదు. ప్ర‌స్తుతం దేశం ఒక నూత‌న అల‌వాటు ను అభివృద్ధిపరచుకొంది. నిర్ణ‌యాల‌ను జాప్యం చేయ‌డ‌మ‌నేది చ‌రిత్ర‌లో క‌లిసిపోయింది. స‌వాళ్ల‌ను ఎదుర్కొనే దిశ‌గా ప్ర‌స్తుతం మేం ముందుకు అడుగులు వేస్తున్నాం. ఒక ల‌క్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ప‌థ‌కాల‌ను స‌మ‌యానికి అనుగుణంగా పూర్తి చేస్తున్నాం. భార‌త‌దేశంలో ప‌ని విధానంలో వ‌చ్చిన మార్పుకు ఇది ఉదాహ‌ర‌ణ‌. ఇది న్యూ ఇండియా. న్యూ ఇండియా కు ఇది స‌జీవ‌ నిద‌ర్శ‌నం. గ‌తంలో భార‌త‌దేశంలో ప్ర‌తి రోజూ కుంభ‌కోణాల గురించిన వార్తలు ఎక్కువ‌గా వినిపించేవి. ఫ‌లానా కుంభ‌కోణంలో కోట్ల రూపాయలు పోయాయ‌ని, మ‌రో కుంభ‌కోణంలో మ‌రికొన్ని కోట్లు మాయ‌మ‌య్యాయంటూ విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు వచ్చేవి.

సోదరులు మరియు సోదరీమణులారా, పార‌ద‌ర్శ‌క‌మైన విధానంతో, చిత్త‌శుద్ధితో నిర్ణ‌యాలు తీసుకొంటే కోట్ల రూపాయ‌ల ప్ర‌భుత్వ ధ‌నం ఆదా అవుతుంది. ప‌నుల‌ను స‌మ‌ర్థ‌వంత‌మైన ప‌ద్ధ‌తిలో చేస్తే ప్ర‌భుత్వ డ‌బ్బు వృథా కాకుండా ఆదా అవుతుంది. ఉత్త‌మ‌మైన మార్గాలు ఏవి వీల‌యితే వాటిని అనుస‌రించడం వ‌ల్ల‌ మ‌న‌కు అందుబాటు లోని వ‌న‌రుల‌ను ఉప‌యోగించుకొంటే కోట్ల రూపాయ‌లు ఆదా అవుతాయి.

సాంకేతిక సాయంతో, ల‌బ్ధిదారుల‌కే నేరుగా న‌గ‌దును స‌ర‌ఫ‌రా చేసే ప‌థ‌కం కార‌ణంగా మా ప్ర‌భుత్వం 57 వేల కోట్ల‌ కు పైగా ధ‌నాన్నిఆదా చేసింది. గ‌తంలో ఈ డ‌బ్బంతా అక్ర‌మార్కుల చేతుల లోకి వెళ్లిపోయేది. పేద‌వాళ్ల‌కు చెందాల్సిన డ‌బ్బును ప్ర‌తి రూపాయి ని మేం ఆదా చేస్తున్నాం. ప్ర‌త్య‌క్ష ల‌బ్ధి పథ‌కం అంటే ఏంటో చెబుతాను.. రాయితీలు, పింఛ‌న్ లు, ఉపకార వేతనాలు, కూలీ చెల్లింపులు మొద‌లైన వాటికి సంబంధించి ల‌బ్ధిదారుల‌కు చెల్లించాల్సిన డ‌బ్బును నేరుగా వారి ఖాతాలలోకి బ‌దిలీ చేయ‌డం జ‌రుగుతుంది. గ‌తంలో త‌ప్పుడు పేర్ల‌ను పేర్కొంటూ ఈ డ‌బ్బును అక్ర‌మార్కులు కొట్టేసే వారు. ఇలాంటి అక్ర‌మాల‌కు మా ప్ర‌భుత్వం ఇప్పుడు స్వస్తి ప‌లికింది. అదే విధంగా దేశ ప్ర‌జ‌ల‌కు చెందిన డ‌బ్బును, ముఖ్యంగా మ‌ధ్య‌త‌ర‌గ‌తికి చెందిన డ‌బ్బును ఉజాలా ప‌థ‌కం ద్వారా ఆదా చేయ‌డం జ‌రుగుతోంది.

సోదరులు మరియు సోదరీమణులారా,

మ‌న దేశంలో గ‌తంలో అంటే 2014 కంటే ముందు ఎల్ ఇడి బ‌ల్బు ధ‌ర రూ.350 కంటే ఎక్కువ ఉండేది. అదే ఎల్ ఇడి బ‌ల్బును ఇప్పుడు ఒక్కొక్క‌టి రూ.40-45 కి అందించడం జ‌రుగుతోంది. ప్ర‌జ‌ల‌కు అందుబాటు ధ‌ర‌లలో ల‌భిస్తున్న ఎల్ ఇడి బ‌ల్బుల కార‌ణంగా వాటిని ఉప‌యోగిస్తున్న గృహాలు ప్ర‌తి ఏడాది విద్యుత్తు బిల్లుల రూపంలో రూ.15 వేల కోట్ల దాకా ఆదా చేస్తున్నాయి.

మిత్రులారా,

ఎల్ ఇడి బ‌ల్బుల‌ను ఉప‌యోగించ‌డంద్వారా ఆదా చేసిన విద్యుత్తు ను ఉత్ప‌త్తి చేయాలంటే మ‌నం 45 వేల కోట్ల రూపాయ‌ల‌ కంటే ఎక్కువ‌గా ఖ‌ర్చు చేయాలనే విష‌యం తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు. ఉత్ప‌త్తి వ్య‌యాన్ని, విద్యుత్తు బిల్లులు క‌ట్టేట‌ప్పుడు త‌గ్గిపోయిన క‌రెంటు బిల్లు మొత్తాన్ని క‌లిపితే ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వం చేసిన ఆదా అంచ‌నా దాదాపుగా 60 వేల కోట్ల రూపాయ‌లు. ఎరువుల రంగంలో కూడా ఇలాంటిదే ఓ ఉదాహ‌ర‌ణ ఉంది. సోదరులు మరియు సోదరీమణులారా, మా విధానాల కార‌ణంగా ఒక కొత్త ఎరువుల త‌యారీ కేంద్రాన్ని స్థాపించ‌కుండానే యూరియా ఉత్ప‌త్తిని అద‌నంగా 18 నుండి 20 ల‌క్ష‌ల ట‌న్నుల మేరకు సాధించ‌గ‌లిగాం. ఇది దాదాపుగా మ‌న‌కున్న పాత ఎరువుల త‌యారీ కేంద్రాల‌ తోనే సాధ్య‌మైంది. వాటి స‌మ‌ర్థ‌త‌ను పెంచ‌డం ద్వారా, దుర్వినియోగాల‌ను అరిక‌ట్ట‌డం ద్వారా ఈ ప‌ని ని సాధించగ‌లిగాం. ఈ 20 ల‌క్ష‌ల ట‌న్నుల యూరియా ఉత్ప‌త్తికిగాను ఖ‌ర్చు పెట్టే 7 వేల కోట్ల నుండి 8 వేల కోట్ల రూపాయ‌ల‌ వరకు ఆదా చేసి, దానిని ప్ర‌జ‌ల‌కు అందుబాటు లోకి తీసుకురావడం జ‌రిగింది. మేం చేసిన ఆదాతో ల‌బ్ధి దీనికే ప‌రిమితం కాలేదు. విదేశాల‌ నుండి యూరియా ను దిగుమ‌తి చేసుకోవ‌డానికి ఖ‌ర్చు చేసే 3.5 వేల కోట్ల రూపాయల నుండి 4 వేల కోట్ల రూపాయ‌లు ఆదా అయ్యాయి. దీనికి తోడు స‌బ్సిడీ కింద ప్ర‌భుత్వం చేసే ఖ‌ర్చు రూ.800 కోట్ల నుండి 900 కోట్ల వ‌ర‌కు ఆదా అయ్యాయి. విధానప‌ర‌మైన నిర్ణ‌యాలు, ప‌ర్య‌వేక్ష‌ణ కార‌ణంగా స‌మ‌ర్థ‌త‌ను పెంచ‌డంద్వారా కేవ‌లం ఎరువుల రంగంలోనే మా ప్ర‌భుత్వం దాదాపుగా 12 వేల కోట్ల రూపాయ‌ల‌దాకా ఆదా చేసింది. ఈ డబ్బు మీకు అంటే ప్ర‌జ‌ల‌కు చెందిన‌ది. ఇది దేశ ప్ర‌జ‌ల డ‌బ్బు.

సోదరులు మరియు సోదరీమణులారా,

పెట్రోలియమ్, గ్యాస్ రంగాలలో మ‌న దేశానికి ఇత‌ర దేశాల‌కు జ‌రిగిన ఒప్పందాల‌ను పున‌:ప‌రిశీలించ‌డం జ‌రుగుతోంది. ఈ ఒప్పందాలు ఎలా ఉన్నాయో లోతుగా అధ్య‌య‌నం చేశాం. వీటిని 20 నుండి 25 సంవ‌త్స‌రాల‌కు లేదా 30 సంవ‌త్స‌రాల‌కు కుదుర్చుకోవ‌డం జ‌రిగింది. వాటిని మేం అధ్య‌య‌నం చేశాం. ఇప్పుడు అంత‌ర్జాతీయంగా భార‌త‌దేశానికి పేరు ప్ర‌తిష్టలు పెరిగాయి కాబ‌ట్టి.. ఈ స‌మ‌స్య‌ను ఆయా దేశాల ముందుకు తీసుకుపోయాం. కతర్‌ తో, ఆస్ట్రేలియాతో చేసుకొన్న ఒప్పందాల విష‌యంలో తిరిగి సంప్ర‌దింపులు జ‌రిపామ‌నే విష‌యం తెలిస్తే మీరు సంతోషిస్తారు. దాంతో ఆ దేశాలు ఒప్పందాలలో స‌వ‌ర‌ణలు చేశాయి. ఈ మార్పుల కార‌ణంగా మ‌నం గ‌తంలో చేసే చెల్లింపులు కాకుండా వాటిని త‌గ్గించి, చేస్తున్నాం. దాంతో 12 వేల కోట్ల రూపాయ‌లు ఆదా అవుతున్నాయి. అంటే ప్ర‌జ‌ల‌కు చెందిన 12 వేల కోట్ల రూపాయ‌ల‌ను ఆదా చేయ‌గ‌లిగాం.

సోదరులు మరియు సోదరీమణులారా,

మీకు కేవ‌లం నాలుగు ప‌థ‌కాల ద్వారా చేసిన ఆదాకు సంబంధించిన ఉదాహ‌ర‌ణ‌లను వివరించాను. ఈ పథకాలలో చేసిన ఆదా కార‌ణంగా ఒక ల‌క్షా న‌ల‌భై వేల కోట్ల రూపాయ‌ల‌ను ఆదా చేయ‌గ‌లిగాం. సోదరులు మరియు సోదరీమణులారా, గ‌తంలో మ‌నం వృథా చేసిన ఈ ఒక ల‌క్షా న‌ల‌భై వేల కోట్ల రూపాయ‌లు పేద ప్ర‌జ‌ల‌కు చెందిన‌దా కాదా మీరే చెప్పండి. అది పేద ప్ర‌జ‌ల‌కు చెందిన‌దా, కాదా ? ఆ డ‌బ్బును ఆదా చేయాలా, వ‌ద్దా ? ఆ డ‌బ్బును పేద ప్ర‌జ‌ల‌ కోసం ఖ‌ర్చు పెట్టాలా వ‌ద్దా ? అవినీతి కి, న‌ల్ల‌ధ‌నాని కి వ్య‌తిరేకంగా మా ప్ర‌భుత్వం యుద్ధాన్ని భారీ స్థాయిలో ప్ర‌క‌టించింది. నిబ‌ద్ద‌త‌తో, నిజాయతీగా ఈ యుద్ధాన్ని మొద‌లుపెట్టాం. కోట్లాది రూపాయ‌లు సంపాదిస్తూ ప్ర‌భుత్వానికి ప‌న్నులు చెల్లించ‌ని వారు, ఇత‌రుల పేరు మీద కోట్ల రూపాయ‌ల సంప‌ద‌ను మూట‌గ‌ట్టుకున్న‌ వారు, దొంగ కంపెనీల‌ను ప్రారంభించిన‌ వారు, న‌ల్ల‌ధ‌నాన్ని వెన‌కేసుకున్న‌ వారు, ఈ పెద్ద పెద్ద అక్ర‌మార్కులమీద కేసులు పెట్టి విచార‌ణ చేస్తున్నాం. గ‌డచిన ఒక సంవత్సరం లో దాదాపు 3.5 ల‌క్ష‌ల దొంగ కంపెనీల రిజిస్ట్రేష‌న్ ను ర‌ద్దు చేసి, వాటి కార్యాల‌యాల‌కు సీలు వేయ‌డం జ‌రిగింద‌నే విష‌యం తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు.

మిత్రులారా,

విదేశాల్లో ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బును భార‌తీయులు దేశానికి పంపుతున్నారు. ఇది దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌కు ల‌బ్ధి ని చేకూరుస్తోంది. వారు పంపే డ‌బ్బు ను దేశంలో సౌక‌ర్యాల‌ను అభివృద్ధి చేయ‌డానికిగాను ఉప‌యోగిస్తే త‌ద్వారా అది గుణాత్మ‌కమైన ప్ర‌భావాన్ని చూపుతుంది. అంతే కాదు, మీకు కూడా సంతృప్తి క‌లుగుతుంది. నిజాయతీగా సంపాదించిన డ‌బ్బు ను నిజాయతీ గా ఖ‌ర్చు పెడితే వ‌చ్చే ఫ‌లితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ నిజాయతీనే ప్రోత్స‌హించ‌డానికి మా ప్ర‌భుత్వం కృతనిశ్చ‌యంతో ఉంది.

మిత్రులారా,

ఇక్క‌డ మీరు అప్పుడ‌ప్పుడు ఎదుర్కొంటున్న స‌వాళ్లను గురించి మాకు తెలుసు. మీరు ఓమాన్ లో ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై మేం ఓమాన్ ప్ర‌భుత్వంతో నిత్యం సంప్ర‌దింపులు జరుపుతూనే ఉన్నాం. ఎంత త్వర‌గా వీలైతే అంత త్వర‌గా మీ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డానికిగాను మేం అన్ని విధాలా కృషి చేస్తున్నాం. ‘మైగ్రేట్ సిస్ట‌మ్’, ‘మ‌ద‌ద్ పోర్ట‌ల్’ ల సహాయంతో మీ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే ప‌నిని ఇప్పటికే చేశాం. ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఇలాంటి ప‌లు కార్య‌క్ర‌మాల ఫ‌లితంగా విదేశాలలో నివ‌సించే ప్ర‌తి భార‌తీయుడిలో మా ప్ర‌భుత్వం పైన న‌మ్మ‌కం పెరిగింది. త‌మ‌కు విదేశాలలో ఏ స‌మ‌స్య వ‌చ్చినా సహాయాన్ని అందించడానికి భార‌తదేశ ప్ర‌భుత్వం స‌దా సిద్ధంగా ఉంద‌నే న‌మ్మ‌కం ప్ర‌వాస భార‌తీయులలో పెరిగింది. విదేశాల లోని ప్ర‌తి భార‌తీయ కుటుంబంలో మా ప్ర‌భుత్వం గౌర‌వ స‌భ్య‌రాలిగా చేరిపోయింది.

మిత్రులారా,

మా ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న స‌బ్ కా సాథ్, స‌బ్ కా వికాస్ విధానం యావత్తు ప్ర‌పంచ ఆలోచ‌నా విధానం లోనే మార్పు తెస్తోంది. ఐక్య‌ రాజ్య‌ స‌మితి అంత‌ర్జాతీయ యోగ దినోత్స‌వాన్ని ప్ర‌క‌టించింది. అలాగే మ‌న దేశం ప‌ట్టుద‌ల కార‌ణంగా అంత‌ర్జాతీయ సౌర కూటమి ఏర్ప‌డింది. ఇవి ప్ర‌పంచ‌ వ్యాప్తంగా మ‌న దేశానికి పెరుగుతున్న పేరు ప్ర‌తిష్ట‌ల‌ను స‌మ‌ర్థ‌తను తెలియ‌జేస్తున్నాయి. మీకు ఉన్నటువంటి అనుభ‌వం కార‌ణంగా, మీరు ఇస్తున్నటువంటి మ‌ద్ద‌తు కార‌ణంగా దేశం ప్రయోజనాన్ని పొందుతోంది. ఇందుకోసం యావత్తు దేశం మీకు రుణ‌ప‌డి ఉంది. దేశాభివృద్ధిలో, జాతి నిర్మాణంలో మిమ్మ‌ల్ని నేను ప్ర‌ధాన భాగ‌స్వామిగా ప‌రిగ‌ణిస్తున్నాను. న్యూ ఇండియా నిర్మాణ‌ం అనే క‌ల‌ను పండించేందుకు మీరు చేసే తీర్మానాలు భార‌త‌దేశంలో కూడా ప్ర‌తిఫ‌లిస్తాయి. ఈ విష‌యంలో నాకు న‌మ్మ‌కం ఉంది. నా ప్రియ‌మైన సోదరులు మరియు సోదరీమణులారా, ఈ రోజున మీతో మాట్లాడే అవ‌కాశం నాకు ల‌భించింది. మీరు ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాల‌ని కోరుకుంటూ ఈ ఉప‌న్యాసాన్ని ముగిస్తున్నాను. మీకు ఇవే నా శుభాభినంద‌న‌లు.

మీకు ఉన్నటువంటి శ‌క్తినంతా ఉప‌యోగించి నాతో పాటు ఇలా నినదించండి. ‘‘భార‌త్ మాతా కీ జయ్;
భార‌త్ మాతా కీ జయ్; భార‌త్ మాతా కీ జయ్.

వందే మాత‌రమ్; వందే మాత‌రమ్; వందే మాత‌రమ్; వందే మాత‌రమ్; వందే మాత‌రమ్; వందే మాత‌రమ్.’’

***