పిఎంఇండియా
మిత్రులారా,
దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది యువతీ యువకులకు నేడు చాలా ముఖ్యమైన రోజు. 51,000 కంటే ఎక్కువ మంది యువత నేడు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందుకున్నారు. మీరు దేశ అభివృద్ధి ప్రయాణంలో అత్యంత కీలకమైన, బాధ్యతాయుతమైన భాగస్వాములుగా మారుతున్నారు. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య, ఇతర అనేక రంగాల్లో సరికొత్త బాధ్యతలను స్వీకరించబోతున్నారు. రాబోయే సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన భారత్ సంకల్పాన్ని నెరవేర్చడంలో మీరే కీలక పాత్ర పోషిస్తారు.
మిత్రులారా,
ఈ స్థాయికి చేరుకోవడానికి మీరు సుదీర్ఘమైన సన్నద్ధత, కఠినమైన శ్రమను దాటి వచ్చి ఉంటారు. మీరు సాధించిన ఈ విజయానికి గాను మీకు, మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడంలో మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల కృషి ఎంతో ఉంది. కేవలం కుటుంబమే కాదు, మనం ఇక్కడికి చేరుకోవడంలో సమాజం కూడా చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. మనం కేవలం మన వల్లనో, లేదా కేవలం మన కుటుంబం వల్లనో ఇక్కడికి చేరుకోలేదు. ఈ విశాల దేశంలోని 140 కోట్ల మంది పౌరుల సహకారం కూడా ఇందులో ఎంతో ముఖ్యమైనది. మన బాధ్యత కేవలం మన పట్ల, మన కుటుంబం పట్ల మాత్రమే కాదు.. సమాజం మొత్తం పట్ల కూడా సమానంగా ఉంటుంది. ఈ పనులన్నింటికీ మీరు మిమ్మల్ని మరింత సమర్థులుగా తీర్చిదిద్దుకుంటారని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
మిత్రులారా,
రెండు రోజుల క్రితమే నేను అయిదు దేశాల పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. అవి కేవలం అయిదు దేశాలే అయినప్పటికీ, ఆ సమయంలో నేను డజన్ల కొద్దీ దేశాలకు చెందిన ప్రముఖ కంపెనీల అధినేతలతో చర్చలు, సమావేశాలు జరిపాను. ప్రతిచోటా నాకు ఒకే ఒక్క విషయం స్పష్టంగా కనిపించింది. దేశ యువత పట్ల, భారత్ పురోగతి పట్ల ప్రపంచం ఎంతో ఉత్సాహంగా ఉంది. నేడు దేశ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామి కావాలని ప్రపంచం కోరుకుంటోంది. భారత్ కూడా వివిధ దేశాలతో భాగస్వామ్యాలను కుదుర్చుకుంటోంది. దేశ యువతకు మరిన్ని అవకాశాలను నిర్ధారించడం, ఉపాధిని కల్పించడం, వారి సామర్థ్యాన్ని చాటిచెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. మన దేశ యువతకు అంతర్జాతీయ స్థాయి అనుభవాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. ఈ పర్యటనలో నెదర్లాండ్స్‌తో సెమీకండక్టర్లు, నీరు, వ్యవసాయం, అధునాతన తయారీ రంగాలపై చర్చించాం.స్వీడన్‌తో కృత్రిమ మేధ, డిజిటల్ ఆవిష్కరణల రంగంలో సహకారంపై…నార్వేతో హరిత సాంకేతికత, నౌకా వాణిజ్య సహకారంపై… యూఏఈతో వ్యూహాత్మక ఇంధన, సాంకేతిక భాగస్వామ్యం వంటి ముఖ్యమైన ఒప్పందాలపై చర్చించాం. ఇటలీతో రక్షణ, కీలక ఖనిజాలు, శాస్త్ర, సాంకేతికత వంటి ప్రాధాన్యత కలిగిన రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నాం.
మిత్రులారా,
ఒప్పందాలన్నీ నేరుగా దేశ యువతకే ప్రయోజనం చేకూరుస్తాయి. ఈ అంశాలన్నీ భారత్‌కు ఒక ఉజ్వలమైన, సమర్థవంతమైన భవిష్యత్తుకు హామీ ఇస్తున్న విషయాన్ని మీరు గమనించే ఉంటారు. ప్రతి కొత్త పెట్టుబడి, ప్రతి సాంకేతిక భాగస్వామ్యం, ప్రతి పారిశ్రామిక సహకారం. భారతీయ యువతకు కేవలం కొత్త అవకాశాలను తీసుకురావడమే కాకుండా, లెక్కలేనన్ని సరికొత్త మార్గాలను కూడా సృష్టిస్తుంది.
నా యువ మిత్రులారా,
రాబోయే పెట్టుబడులు, భాగస్వామ్యాలు వచ్చే మూడు నాలుగు దశాబ్దాల పాటు ప్రపంచ వృద్ధిని నిర్దేశించే పరిశ్రమలను తీర్చిదిద్దబోయే రంగాలు ఇవేనని మనం గుర్తుంచుకోవాలి. నిస్సందేహంగా ఇందులో దేశ యువత అత్యంత కీలకమైన పాత్ర పోషించబోతోంది.
మిత్రులారా,
ప్రపంచానికి భారత్ ఎలా ఒక విశ్వసనీయమైన సరాఫరా వ్యవస్థ భాగస్వామిగా మారుతోందో చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. మీలో చాలా మందికి నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ సెమీకండక్టర్ సంస్థ ఎస్‌ఎంఎల్ గురించే తెలిసే ఉంటుంది. ఈ సంస్థ దేశానికి చెందిన టాటా కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచంలోనే ఈ సంస్థతో ఇలాంటి ఒప్పందం కుదుర్చుకున్న చాలా కొద్దిపాటి దేశాల్లో భారత్ ఒకటి. ఈ ఒక్క ఎస్‌ఎంఎల్-టాటా ఎలక్ట్రానిక్స్ ఒప్పందం దేశంలో లెక్కలేనన్ని కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా, తదుపరి తరం సాంకేతికతకు మార్గాన్ని అందిస్తుంది. స్వీడన్‌తో కుదిరిన సాంకేతికత, కృత్రిమ మేధ భాగస్వామ్యాలు, యూఏఈతో సూపర్ కంప్యూటింగ్ రంగంలో ఏర్పడిన సహకారం వంటివి దేశ సాంకేతిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఈ ఒప్పందాలు మన యువతకు ఖచ్చితంగా సరికొత్త అవకాశాలను అందిస్తాయి.
మిత్రులారా,
ప్రస్తుతం స్వచ్ఛమైన ఇంధనం, కీలక ఖనిజాలు, హరిత హైడ్రోజన్, సుస్థిర ఉత్పాదకత వంటి రంగాలు శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఈ రంగాల్లో కుదురుతున్న భాగస్వామ్యాలు నూతన ఆర్థిక వ్యవస్థకు, సరికొత్త అవకాశాలకు మార్గం సుగుమం చేస్తున్నాయి. స్వీడన్, నార్వే, ఇటలీ వంటి దేశాలతో పర్యావరణ హిత మార్పు, సుస్థిర సాంకేతికత రంగాల్లోసహకారం నిరంతరం పెరుగుతోంది. ఇది పర్యావరణ అనుకూల తయారీకి సంబంధించిన భవిష్యత్తు పరిశ్రమల్లో భారత్‌ను మరింత బలోపేతం చేస్తుంది. దీనితో పాటు ఓడరేవులు, నౌకాయానం, నౌకా వాణిజ్య మౌలిక సదుపాయాలఒప్పందాలపై కూడా భారత్ వేగంగా పనిచేస్తోంది. యూఏఈ, నార్వే దేశాలతో కుదిరిన భాగస్వామ్యాలు దేశ నౌకానిర్మాణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి. నౌకల నిర్మాణానికి భారీ ఎత్తున నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరమని మీ అందరికీ బాగా తెలుసు. దీని అర్థం దేశీయ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, నైపుణ్యం కలిగిన కార్మికులకు మీరు ఊహించలేని స్థాయిలో డిమాండు పెరగబోతోంది. దీని ద్వారా అపారమైన అవకాశాలు లభిస్తాయి.
మిత్రులారా,
ప్రతి కొత్త భాగస్వామ్యంతోనూ భారతీయ అంకుర సంస్థలు, పరిశోధకులు, యువ నిపుణులు ప్రపంచంతో అనుసంధానం కావడానికి మనం సరికొత్త మార్గాలను సృష్టిస్తున్నాం. ఇది మన భారతీయ యువతకు అధునాతన నైపుణ్యాలను, అంతర్జాతీయ మార్కెట్లను, అభివృద్ధికి కొత్త అవకాశాలను అందిస్తుంది. నేడు ప్రపంచం వినూత్నంగా ఆలోచించే, సరికొత్తగా నిర్మించే, భారీ స్థాయిలో ఫలితాలను అందించే దేశాలను ఎంతగానో గౌరవిస్తోంది. భారత్ ఈ మూడు దిశల్లోనూ శరవేగంగా ముందుకు దూసుకుపోతోంది. ఈ అద్భుతమైన మార్పు వెనుక ఉన్న అతిపెద్ద శక్తి మీరే. నా యువ సహచరులు, దేశ యువశక్తి. నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా దేశ యువశక్తి గురించి చర్చించడానికి చాలా సమయాన్ని కేటాయిస్తాను.
మిత్రులారా,
నేడు ప్రతి భారతీయుడు ఒక గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఆ సంకల్పమే… 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించడం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి దేశం వివిధ రంగాలలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఈ పెట్టుబడులు మన యువతకు లక్షలాది సరికొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. ఉదాహరణకు… సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన పూర్తి సరఫరా వ్యవస్థను భారత్ ఇక్కడే నిర్మిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో దేశానికి చెందిన పది భారీ సెమీకండక్టర్ కేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రత్యేక గుర్తింపును చాటుకోబోతున్నాయి. ఇవన్నీ భారతీయ యువత సామర్థ్యం, మేధస్సు, నిబద్ధతతో నడుస్తాయి. తద్వారా సహజంగానే భారీగా ఉపాధి లభిస్తుంది. నౌకానిర్మాణ, నౌకల మరమ్మతు, వ్యవస్థను కూడా భారత్ వేగంగా అభివృద్ధి చేస్తోంది. దీనికోసం సుమారు 75,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెడుతోంది. మనం భారత్‌లోనే పూర్తి స్థాయి ఎంఆర్‌ఓ వ్యవస్థను (విమానాల నిర్వహణ, ఓవర్‌హాలింగ్, మరమ్మతుల సౌకర్యాలను) నిర్మిస్తున్నాం. ఇది విమానయాన రంగానికి ఎంతో అండగా నిలవడమే కాకుండా దేశ యువత కోసం సరికొత్త ఉపాధి రంగాన్ని అందుబాటులోకి తీసుకువస్తుంది.
మిత్రులారా,
నేడు భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ దేశంగా అవతరించింది. ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన పూర్తి విలువ వ్యవస్థను మనం భారత్‌లోనే నిర్మిస్తున్నాం. పీఎల్ఐ పథకం ద్వారా దేశంలో రికార్డు స్థాయిలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి జరుగుతోంది. దీని ద్వారా యువతకు లక్షలాది ఉద్యోగాలు లభిస్తున్నాయి.
మిత్రులారా,
ఇలాంటి మరెన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలపై భారత ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండూ కలిసి భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ పెట్టుబడులు దేశంలోని యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ వారి కలలను నిజం చేస్తున్నాయి. ఈ రోజు నియామక పత్రాలను అందుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా మీకు లభించే ఈ కొత్త గుర్తింపుతో ఎల్లప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేశానికి వ్యాపార సౌలభ్యం ఎంత ప్రాధాన్యత కలిగిన అంశమో మీ మనసులో నిరంతరం మెదలాలి.
మిత్రులారా,
దేశ వృద్ధి గాథ, ఉపాధి కల్పన.. ఈ రెండూ మీ అందరికీ బాగా తెలిసినవే. దీనిలో మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. గ్రామాలు, చిన్న పట్టణాలు, మారుమూల ప్రాంతాలు అభివృద్ధితో అనుసంధానమైనప్పుడు దేశ ప్రగతి ప్రయోజనాలు మరింత ఎక్కువ మంది ప్రజలకు చేరుతాయి. గడిచిన పన్నెండేళ్ల కాలంలో రైల్వేలు, రహదారులు, విమానాశ్రయాలు, సరుకు రావణా, ఓడరేవులు, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో మునుపెన్నడూ లేని విధంగా విస్తరణ జరిగింది. ప్రతి స్థాయిలోనూ అభివృద్ధి సాకారమైంది. ఈ రోజు మీరు ఏ దిశలోనైనా 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే, అక్కడ భారత ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక ప్రాజెక్టు పనులు సాగుతూ ఉండటం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. గ్రామాల్లో సైతం మార్పు వేగంగా జరుగుతుండటం కూడా కనిపిస్తోంది. మెరుగైన అనుసంధానం వల్ల రైతులకు, చిన్న వ్యాపారులకు, విద్యార్థులకు సరికొత్త మార్గాల తెరుచుకున్నాయి. నేడు లక్షలాది కుటుంబాలకు శాశ్వత గృహాలు లభించాయి. వాస్తవానికి మనం నిర్మిస్తున్న ఇళ్ల సంఖ్య ప్రపంచంలోని అనేక దేశాల మొత్తం గృహాల సంఖ్య కంటే కూడా ఎక్కువ. నేను ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్‌ను ఎప్పటికీ మర్చిపోను, ప్రజలను కూడా మర్చిపోనివ్వను.ఇందులో మరుగుదొడ్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా చేరింది. ఇంటిపై ఏర్పరిచే సౌరశక్తి విధానం వల్ల ఈ రంగంలోకి ఎంతో మంది కొత్త సరఫరాదారులు వచ్చారు. జల జీవన్ మిషన్ ద్వారా ఇళ్లకు కుళాయిల ద్వారా నీరు అందుతోంది. నగరాల్లో పీఎన్‌జీ కనెక్షన్లను విస్తరించాలని నేను భావించినప్పుడు మనకు ప్లంబర్ల కొరత ఎదురవడం నేను గమనించాను. ఎందుకంటే అప్పటికే చాలా మంది ప్లంబర్లు జల జీవన్ మిషన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కొన్నిసార్లు నైపుణ్యం కలిగిన వ్యక్తుల డిమాండు, సరఫరాను మించిపోవడాన్ని, అవకాశాలు ఎంత శరవేగంగా పెరుగుతున్నాయో చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం.
మిత్రులారా,
ఈ మార్పుల ప్రభావం కేవలం సామాన్య పౌరుల సౌకర్యాల కల్పనకు మాత్రమే పరిమితం కాలేదు. గ్రామాలకు రోడ్లు చేరినప్పుడు మార్కెట్లకు చేరుకోవడం సులభతరమవుతుంది. మెరుగైన విద్యుత్ సదుపాయాల వల్ల చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. గ్రామాల్లో సైతం వ్యవసాయ రంగానికి విలువ జోడింపు లభిస్తోంది. గతంలో వారు కేవలం ఎర్ర మిరపకాయలను మాత్రమే విక్రయించేవారు. కానీ ఇప్పుడు విద్యుత్ సౌకర్యం ఉండటం వల్ల కారం పొడి తయారు చేసి, దానిని ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ఈ విధంగా గ్రామాల్లో చిన్న పరిశ్రమలు నిరంతరం విస్తరిస్తున్నాయి. పెరుగుతున్న డిజిటల్ అనుసంధానం వల్ల గ్రామస్తులు ప్రపంచం మొత్తంతో అనుసంధానమవుతూ, ఆధునికతను అలవర్చుకుంటున్నారు. నగరాలకు, గ్రామాలకు మధ్య ఉన్న వ్యత్యాసం క్రమంగా కనుమరుగవుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థ వేగాన్ని మరింత పెంచింది. వీటన్నింటి వల్ల దేశ యువతకు ఒక ఉజ్వలమైన భవిష్యత్తుకు హామినిచ్చే సానుకూల ప్రభావం ఏర్పడుతుంది. ఉద్యోగాలు లభిస్తున్నాయి. అంతకుమించి దేశం ఒక సరికొత్త ఆత్మగౌరవంతో ముందుకు సాగుతోంది. కోట్లాది మంది ప్రజలు కొత్త అవకాశాలను పొందుతున్నారు.
మిత్రులారా,
నేడు దేశ యువతకు ముందుకు సాగడానికి, తమ కలలను నిజం చేసుకోవడానికి మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. నేను ఎవరినీ నిందించడం లేదు. కానీ నేటి వాస్తవికత ఏమిటంటే.. ప్రతిదీ అత్యంత వేగంగా, భారీ స్థాయిలో, అపారమైన వైవిధ్యంతో జరుగుతోంది. తయారీ రంగం, సాంకేతికత, అంకుర సంస్థలు, డిజిటల్ సేవలు, రైల్వేలు, రక్షణ, అంతరిక్ష రంగాల వ్యాప్తంగా లెక్కలేనన్ని అవకాశాలు మన కోసం వేచి ఉన్నాయి. గరిష్ట సంఖ్యలో యువత ఈ అవకాశాల ద్వారా లబ్ధి పొందేలా చేయడం, దేశ యువతకు తమ ప్రతిభను చాటుకునే ప్రతి అవకాశాన్ని కల్పించడమే మా ప్రయత్నం. అందుకే నైపుణ్యాభివృద్ధి , పరిశ్రమలతో ముడిపడిన విద్య, భవిష్యత్తు సాంకేతికతలపై నిరంతరం ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ఐటీఐలను ఆధునీకరిస్తున్నాం. జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థలను బలోపేతం చేస్తున్నం. పీఎం సేతు వంటి కార్యక్రమాలు ఈ దిశగా పనిచేస్తున్నాయి.
మిత్రులారా,
ఇటీవలి కాలంలో దేశంలో స్వయం ఉపాధి, వ్యవస్థాపకతకు సంబంధించి ఓ కొత్త సంస్కృతి అభివృద్ధి చెందింది. భారత్ నేడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా నిలిచింది. దేశంలో 2,30,000 కంటే ఎక్కువ గుర్తింపు పొందిన అంకుర సంస్థలు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కదాని వెనుక యువతీ యువకుల బృందాలు ఉన్నాయి. ఈ మార్పు కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాకపోడం నాకు అత్యంత సంతృప్తిని ఇస్తోంది. నేడు టైర్-2, టైర్-3 నగరాల నుంచి యువత కూడా అంకుర సంస్థలు, ఆవిష్కరణల ప్రపంచంలో పెద్ద సంఖ్యలో సత్తా చాటుతున్నారు. వారి సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తోంది. ఈ మార్పు జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఈ మార్పులో మన మహిళా శక్తి పాత్ర కూడా నిరంతరం పెరుగుతోంది. నేడు మహిళల నేతృత్వంలో నడుస్తున్న అనేక అంకుర సంస్థలు మనల్ని గర్వపడేలా చేస్తున్నాయి. దేశంలో మహిళలు స్టార్టప్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారని నేను ప్రపంచవ్యాప్తంగా చెప్తుంటాను. ముద్ర యోజన కింద కోట్లాది మంది మహిళలు ఆర్థిక సహాయం పొందారు. పీఎం స్వనిధి వంటి పథకాలు కోట్లాది మంది మహిళలకు స్వయం సమృద్ధి సాధించే అవకాశాన్ని కల్పించాయి. నేడు గ్రామాలు, చిన్న పట్టణాల్లో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో మహిళలు తమకు తాముగా సొంతంగా సరికొత్త వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు.
మిత్రులారా,
ఈ విధానాలు, నిర్ణయాల మధ్య మీరు ఇంకొక విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఏ వ్యవస్థకైనా అసలైన బలం అక్కడి ప్రజలలోనే ఉంటుంది. ప్రజల శక్తి దేశ శక్తిగా మారుతుంది. మీరు భాగం కాబోతున్న ఈ వ్యవస్థ కోట్లాది మంది పౌరుల జీవితాలతో, వారి ఆశలు, ఆకాంక్షలతో నేరుగా ముడిపడి ఉంది. ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రజల జీవితాలను సులభతరం చేసే ఒక సాధనం. మీరు ఏ శాఖలో పనిచేసినప్పటికీ మీ ప్రవర్తన, సున్నితత్వం, పనిచేసే విధానం అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. దేశం మీపై నమ్మకం ఉంచింది. ఇప్పుడు మీ పని, ప్రవర్తన, మాట, నడవడిక ద్వారా ఆ నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. మిమ్మల్ని కలవడం పౌరుల్లో సరికొత్త నమ్మకాన్ని నింపాలి. కొత్త ఆశలతో ముందుకు సాగేలా వారిని ప్రోత్సహించాలి. ప్రతి యువ కర్మయోగి తమ పనిని ఒక గొప్ప బాధ్యతగా భావించాలి.
నా దృష్టిలో మీరు అంతకంటే ఎక్కువే. పూర్వ కాలంలో మనం వెయ్యి చేతులు ఉన్న ‘‘సహస్రబాహు’’ గురించి విన్నాం. నేడు మీరే ప్రభుత్వ బాహువులు, మీరే ప్రభుత్వానికి బలమైన శక్తి. ఇప్పటికే సేవలో ఉన్నవారు, కొత్తగా చేరుతున్నవారంతా ఈ వ్యవస్థలో భాగమే. దేశ ప్రజల ఆకాంక్షలు నిరంతరం పెరుగుతున్నాయి. దీనిని నేను అభివృద్ధికి ఒక సానుకూల సంకేతంగా చూస్తున్నాను. మనం మన ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి, వాటిని నెరవేర్చడానికి అదే వేగంతో పని చేయాలి. ఇందులో ప్రజాసేవలోకి అడుగుపెడుతున్న యువత పాత్ర ఎంతో కీలకమైనది. మీరు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. సరికొత్త సాంకేతికతలకూ, కొత్త వ్యవస్థలకూ, మారుతున్న అవసరాలకు అనుగుణంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. ఇందులో ఐగాట్ కర్మయోగి వేదిక మీకు ఎంతగానో సహాయపడుతుంది. కర్మయోగి వంటి మాడ్యూళ్లు మీ బాధ్యతలను సులభంగా అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి. ఈ వనరులను మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను.
మిత్రులారా,
నేడు దేశ యువత ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఇదే స్ఫూర్తి, ఇదే శక్తి మీ ప్రజాసేవలోనూ ప్రతిబింబించాలి. తమ పనిని దేశ సేవగా, ప్రజల సేవగా భావించే యువత ప్రయత్నాల వల్లే అభివృద్ధి చెందిన భారత్ కల సాకారమవుతుంది. మన సంస్కృతిలో ప్రజా సేవే దైవ సేవ అనే మాట ఉంది. నేడు నియామక పత్రాలను అందుకుంటున్న యువ సహచరులు దేశ అభివృద్ధి ప్రయాణానికి సరికొత్త వేగాన్ని అందిస్తారని నేను పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. మీ పని, నిర్ణయాల ద్వారా వికసిత్ భారత్ సంకల్పం నెరవేరుతుంది. ప్రజలే దైవం అనే మన మంత్రాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. పౌరుల సంక్షేమమే మన కర్తవ్యం. ఈ రోజు నియామక పత్రాలను అందుకుంటున్న యువకులందరికీ భవిష్యత్తు కోసం, దేశానికి సేవ చేసే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.
***
India’s youth are playing a vital role in accelerating the journey towards a Viksit Bharat. Rozgar Mela reflects our Government’s commitment to empowering the Yuva Shakti with new opportunities.
— Narendra Modi (@narendramodi) May 23, 2026
https://t.co/u3CQqgrluM
दुनिया भारत के युवाओं और भारत की technological progress को लेकर बहुत उत्साहित है।
— PMO India (@PMOIndia) May 23, 2026
आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है: PM @narendramodi
आज clean energy, critical minerals, green hydrogen और sustainable manufacturing से जुड़े sectors भी तेजी से आगे बढ़ रहे हैं।
— PMO India (@PMOIndia) May 23, 2026
इनसे जुड़ी partnership एक नई economy के...new opportunities के दरवाजे खोल रही हैं: PM @narendramodi
आज हर भारतीय एक बड़े संकल्प के साथ आगे बढ़ रहा है। ये संकल्प, 2047 तक विकसित भारत के निर्माण का है।
— PMO India (@PMOIndia) May 23, 2026
इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग-अलग sectors में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं: PM @narendramodi
आज गांवों में भी बदलाव तेजी से दिखाई दे रहा है।
— PMO India (@PMOIndia) May 23, 2026
Connectivity बढ़ने से किसानों, छोटे व्यापारियों, विद्यार्थियों के लिए नए रास्ते खुले हैं: PM @narendramodi
आज भारत का युवा दुनिया के हर क्षेत्र में अपनी पहचान बना रहा है।
— PMO India (@PMOIndia) May 23, 2026
यही spirit, यही ऊर्जा public service में भी दिखाई देनी चाहिए।
विकसित भारत ऐसे ही युवाओं के प्रयास से बनेगा, जो अपने काम को देशसेवा का माध्यम मानते हैं: PM @narendramodi