పిఎంఇండియా
శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ నెల 5వ తేదీన సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్… దేశంలోని అగ్రశ్రేణి ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటిగా ఉంది. వాణిజ్య శాస్త్రం, అర్థశాస్త్రం, మేనేజ్మెంట్ వంటి రంగాల్లో ఇది ఒక విశిష్ట విద్యా కేంద్రంగా నిలిచింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, దాత సర్ శ్రీ రామ్ 1926లో ఈ కళాశాలను స్థాపించారు. ఒక శతాబ్ద కాలంలో ఎందరో విద్యార్థులు, నిపుణులు, నిర్వాహకులు, పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలు, దేశనిర్మాతలనూ ఈ విద్యాసంస్థ తీర్చిదిద్దింది.
ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకొంటున్న సమయంలోనే ఈ శత వార్షికోత్సవాలూ జరగడం ఈ సందర్భాన్ని మరింత విశేషమైనదిగా చేస్తుంది. తరతరాలను తీర్చిదిద్దడంలోనూ, సమాజ పునాదులను బలోపేతం చేయడంలోనూ ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను ఈ సందర్భంలో దేశం గౌరవించుకుంటుంది.
****