పిఎంఇండియా
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2025 డిసెంబర్ 19 సాయంత్రం 4:30కు సంప్రదాయ వైద్యంపై డబ్ల్యూహెచ్‌వో నిర్వహిస్తున్న రెండో అంతర్జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారు. అంతర్జాతీయ, శాస్త్రీయ ఆధారిత, ప్రజా కేంద్రక సంప్రదాయ వైద్య అజెండాను రూపొందించడంలో పెరుగుతున్న భారత్ నాయకత్వ స్థాయిని, చేపడుతున్న మార్గదర్శక పథకాలను ఈ కార్యక్రమం వివరిస్తుంది.
పరిశోధన, ప్రామాణీకరణ, అంతర్జాతీయ సహకారం ద్వారా సంప్రదాయ వైద్యాన్ని, భారతీయ విజ్ఞాన వ్యవస్థను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు ప్రధానమంత్రి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ దార్శనికతకు అనుగుణంగా, ఆయుష్ రంగంలో మై ఆయుష్ సమీకృత సేవల పోర్టల్ (ఎంఏఐఎస్‌పీ)తో సహా పలు కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అలాగే ఆయుష్ ఉత్పత్తులు, సేవలు నాణ్యతకు అంతర్జాతీయ ప్రామాణికంగా రూపొందించిన ఆయుష్ మార్కును ఆవిష్కరిస్తారు.
యోగా శిక్షణలో డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక నివేదికను ప్రధానమంత్రి ఈ కార్యక్రమంలో విడుదల చేస్తారు. అలాగే ‘‘ఫ్రం రూట్స్ టు గ్లోబల్ రీచ్: 11 ఇయర్స్ ఆఫ్ ట్రాన్సఫర్మేషన్ ఇన్ ఆయుష్’’ అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందుతున్న భారతీయ సంప్రదాయ వైద్య వారసత్వాన్ని సూచిస్తూ.. అశ్వగంధపై స్మారక తపాలా బిళ్లను కూడా విడుదల చేస్తారు.
2021-2025 సంవత్సరాల్లో యోగా ప్రచారానికి, అభివృద్దికి విశేష కృషి చేసిన వారికి ప్రధానమంత్రి పురస్కార గ్రహీతలను ఆయన సత్కరిస్తారు. ఇది అంతర్జాతీయంగా యోగాను ప్రచారం చేయడంలో వారి అంకితభావానికి దక్కిన గుర్తింపు. సమతౌల్యం, ఆరోగ్యం, సామరస్యాన్ని కాలానికి అతీతంగా చేసే సాధనగా, ఆరోగ్యమైన, దృఢమైన కొత్త భారత్‌ను తయారు చేసేందుకు దోహదపడేదిగా యోగాను ఈ పురస్కారాలు గుర్తిస్తాయి.
భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న సంప్రదాయ వైద్య విజ్ఞాన వ్యవస్థల వైవిధ్యాన్ని, స్థాయిని, ప్రస్తుత సమయంలో వాటి ప్రాధాన్యాన్ని వివరించే ‘ట్రెడిషనల్ డిస్కవరీ మెడిసిన్ స్పేస్’ ఎగ్జిబిషన్ను ప్రధాని సందర్శిస్తారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం 2025 డిసెంబర్ 17 నుంచి 19 వరకు కొనసాగుతుంది. ‘‘రిస్టోరింగ్ బ్యాలెన్స్: ది సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్‌బీయింగ్’’ అనే ఇతివృత్తంతో న్యూఢిల్లోని భారత్ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. సమానమైన, సుస్థిరమైన, సాక్ష్యం ఆధారిత ఆరోగ్య వ్యవస్థల అభివృద్ధిపై ఈ సదస్సులో జరిగిన చర్చల్లో ప్రపంచ నాయకులు, విధాన రూపకర్తలు, శాస్త్రవేత్తలు, వైద్యులు, దేశీయ పరిజ్ఞానం ఉన్నవారు, పౌర సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు.
***