పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు 18వ రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల జీవితాల్లో కొత్త సంతోషాలను తెస్తూ, రాజ్యాంగపరమైన బాధ్యతలతో దేశ పౌరులను అనుసంధానిస్తూ 2026 సంవత్సరం ప్రారంభమైందన్నారు. ఇది గణతంత్ర మహోత్సవ వేళ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశం పరాక్రమ్ దివస్ జరుపుకొందని, రేపు అంటే జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం, ఆ వెంటనే గణతంత్ర దినోత్సవం వస్తున్నాయని శ్రీ మోదీ గుర్తు చేశారు. ‘జన గణ మన’ను జాతీయ గీతంగా, ‘వందేమాతరా’న్ని జాతీయ గేయంగా రాజ్యాంగం ఆమోదించిన ఈ రోజు కూడా ఎంతో విశేషమైనదని ప్రధానమంత్రి చెప్పారు. ఈ విశేషమైన రోజున 61 వేలకు పైగా యువత ప్రభుత్వోద్యోగాలకు నియామక పత్రాలను స్వీకరించి.. తమ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నియామక పత్రాలను దేశ నిర్మాణానికి ఆహ్వానంగానూ, అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను మరింత వేగంగా ఆవిష్కరించే ప్రతినగానూ శ్రీ మోదీ అభివర్ణించారు. చాలా మంది యువత దేశ భద్రతను బలోపేతం చేస్తారనీ, విద్య – ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను శక్తిమంతం చేస్తారని, ఆర్థిక సేవలు – ఇంధన భద్రతనూ పటిష్టం చేస్తారని, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యువత అందరికీ ఈ సందర్భంగా ప్రధానమంత్రి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
యువతలో నైపుణ్యాలను పెంచడం, వారికి ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. నిర్దేశిత లక్ష్యాలతో ప్రభుత్వ నియామకాలను చేపట్టేందుకు రోజ్‌గార్ మేళాను ప్రారంభించామని, క్రమంగా ఇది ఒక వ్యవస్థగా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షలాది యువత నియామకాలను అందుకున్నారని ప్రధానమంత్రి తెలిపారు. ఈ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా.. నేడు దేశవ్యాప్తంగా నలభైకి పైగా ప్రాంతాల్లో రోజ్‌గార్ మేళాలను నిర్వహిస్తున్నామన్న శ్రీ మోదీ.. వేదికలన్నింటి వద్ద హాజరైన యువతకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
“ప్రపంచంలో అత్యంత యువ జనాభా ఉన్న దేశాల్లో భారత్ ముందుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా యువతకు కొత్త అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం అనేక దేశాలతో వాణిజ్య, రవాణా ఒప్పందాలను కుదుర్చుకుంటోందని, ఇవి యువ భారతీయులకు లెక్కలేనన్ని కొత్త అవకాశాలను అందుబాటులోకి తెస్తున్నాయని ఆయన తెలిపారు.
ఆధునిక మౌలిక సదుపాయాల్లో మునుపెన్నడూ లేని రీతిలో భారత్ ఇటీవల పెట్టుబడులు పెట్టిందని, దీనివల్ల నిర్మాణ సంబంధిత రంగాల్లో ఉపాధి పెరిగిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. భారతదేశ స్టార్టప్ వ్యవస్థ వేగంగా విస్తరిస్తోందని, దాదాపు రెండు లక్షల అంకుర సంస్థలు కొత్తగా నమోదవగా.. 21 లక్షల మంది యువత వాటితో ఉపాధి పొందుతున్నారని వివరించారు. డిజిటల్ ఇండియా ఓ సరికొత్త ఆర్థిక వ్యవస్థను విస్తరించిందన్నారు. యానిమేషన్, డిజిటల్ మీడియా, అనేక ఇతర రంగాల్లో అంతర్జాతీయ కేంద్రంగా భారత్ అవతరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. దేశ సృజనాధార ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తోందని, యువతకు కొత్త అవకాశాలను అందిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు.
భారత్‌పై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరుగుతుండడంతో యువత కొత్త అవకాశాలను పొందుతున్నారని శ్రీ మోదీ చెప్పారు. ప్రపంచంలో దశాబ్ద కాలంలో తన జీడీపీని రెట్టింపు చేసుకున్న ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థ మన దేశమేనని, నేడు వందకు పైగా దేశాలు ఎఫ్‌డీఐ ద్వారా భారత్‌లో పెట్టుబడులు పెడుతున్నాయని ఆయన వివరించారు. 2014కు ముందున్న దశాబ్దంతో పోలిస్తే.. భారత్ రెండున్నర రెట్లు ఎక్కువ ఎఫ్‌డీఐలను సాధించిందన్నారు. విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వస్తే దేశ యువతకు ఉపాధి అవకాశాలు మరింత ఎక్కువగా లభిస్తాయన్నారు.
ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వ్యాక్సిన్లు, రక్షణ, ఆటోమొబైల్స్ వంటి రంగాలకు సంబంధించి.. ఉత్పత్తి, ఎగుమతుల్లో మునుపెన్నడూ లేనంత వృద్ధితో భారత్ దూసుకుపోతోందని, ఆ రంగాల్లో ప్రధాన ఉత్పాదక శక్తిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి వివరించారు. 2014 నుంచి దేశ ఎలక్ట్రానిక్స్ తయారీ ఆరు రెట్లు పెరిగి, ఇప్పుడు రూ. 11 లక్షల కోట్లను దాటిందని, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ. 4 లక్షల కోట్లు దాటాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఆటో మొబైల్ పరిశ్రమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఒకటిగా నిలిచిందన్నారు. 2025లో ద్విచక్ర వాహనాల విక్రయాలు రెండు కోట్ల యూనిట్లను దాటాయన్న శ్రీ మోదీ.. ఆదాయపు పన్ను, జీఎస్టీ తగ్గింపుల ద్వారా ప్రజల్లో పెరిగిన కొనుగోలు శక్తిని ఇది ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు. దేశంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు ఈ ఉదాహరణలు నిదర్శనంగా నిలుస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలోనే 8,000 మందికి పైగా మన ఆడబిడ్డలు నియామక పత్రాలను అందుకున్నారని చెబుతూ.. గత 11 ఏళ్లలో శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం దాదాపు రెట్టింపైందని శ్రీ మోదీ అన్నారు. ముద్ర, అంకుర భారత్ వంటి పథకాలు మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూర్చాయన్నారు. దీంతో మహిళల స్వయం ఉపాధి సుమారు 15 శాతం పెరిగిందని తెలిపారు. నేడు అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల్లో పెద్ద సంఖ్యలో మహిళలు డైరెక్టర్లుగా, వ్యవస్థాపకులుగా ఉన్నారని, అలాగే గ్రామాల్లోని సహకార రంగాలు, స్వయం సహాయక బృందాలకు వారు నేతృత్వం వహిస్తున్నారని ప్రధానమంత్రి చెప్పారు.
‘‘దేశ సంస్కరణల ఎక్స్‌ప్రెస్ నేడు పట్టాలెక్కింది. సామాన్య ప్రజల జీవితాలను, వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయడమే దీని లక్ష్యం’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. జీఎస్టీలో చేపట్టిన నవతరం సంస్కరణలు యువ పారిశ్రామికవేత్తలకు, ఎంఎస్ఎంఈలకు ఎంతో ప్రయోజనం చేకూర్చాయని ఆయన చెప్పారు. అలాగే చరిత్రాత్మక కార్మిక సంస్కరణలు కార్మికులు, ఉద్యోగుల సామాజిక భద్రతను పటిష్టం చేయడమే కాకుండా.. వ్యాపార సంస్థలకు కూడా మేలు చేశాయని తెలిపారు. కొత్త కార్మిక నియమావళులు సామాజిక భద్రత పరిధిని విస్తరించి, శక్తిమంతం చేశాయని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
ప్రభుత్వ కార్యాలయాలు, పనితీరుతో తమకు ఎదురైన గత అనుభవాలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని.. తాము పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, తమ ఉద్యోగ కాలంలో సామాన్యులకు అలాంటి కష్టాలు కలగనీయొద్దన్న సంకల్పంతో పనిచేయాలని కొత్తగా నియమితులైన యువతను ప్రధానమంత్రి కోరారు. ప్రభుత్వంలో భాగంగా.. ప్రజా సంక్షేమాన్ని పెంపొందించడం కోసం తమ స్థాయిలో చిన్న చిన్న సంస్కరణలను చేపట్టాలని ఆయన సూచించారు. విధాన సంస్కరణలతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల నిజాయితీ ద్వారానే జీవన సౌలభ్యం, సులభతర వాణిజ్యం బలోపేతమవుతాయని వ్యాఖ్యానించారు. వేగంగా మారుతున్న ఈ సాంకేతిక యుగంలో.. దేశ అవసరాలు, ప్రాధాన్యాల్లో కూడా వేగంగా మార్పులు వస్తున్నాయన్నారు. ఉద్యోగులు ఎప్పటికప్పుడు వాటిని అందిపుచ్చుకోవాలని శ్రీ మోదీ చెప్పారు. ఐగాట్ కర్మయోగి వంటి వేదికలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అది ఇప్పటికే 1.5 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులను సాధికారులను చేసిందన్నారు. ‘నాగరిక దేవో భవ’ స్ఫూర్తితో పనిచేయాలని యువతను ప్రధానమంత్రి కోరారు. మరోసారి వారందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
నేపథ్యం
ఉపాధి కల్పనకు పెద్దపీట వేయాలన్న ప్రధానమంత్రి నిశ్చయానికి అనుగుణంగా.. ఆ దార్శనికతను ఆచరణలోకి తెచ్చే లక్ష్యంతో చేపట్టిన కీలక కార్యక్రమం రోజ్‌గార్ మేళా. ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించిన రోజ్‌గార్ మేళాల ద్వారా 11 లక్షలకు పైగా నియామక పత్రాలను ప్రభుత్వం జారీ చేసింది.
18వ రోజ్‌గార్ మేళాను దేశవ్యాప్తంగా 45 ప్రదేశాలలో నిర్వహించారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంపికైన ఈ అభ్యర్థులు.. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య – కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరనున్నారు.
***
Addressing the Rozgar Mela. It reflects our Government’s strong commitment to empowering the Yuva Shakti. https://t.co/ngfXRnXfcZ
— Narendra Modi (@narendramodi) January 24, 2026
बीते वर्षों में रोज़गार मेला एक institution बन गया है।
— PMO India (@PMOIndia) January 24, 2026
इसके जरिए लाखों युवाओं को सरकार के अलग-अलग विभागों में नियुक्ति पत्र मिल चुके हैं: PM @narendramodi
आज भारत, दुनिया के सबसे युवा देशों में से एक है।
— PMO India (@PMOIndia) January 24, 2026
हमारी सरकार का निरंतर प्रयास है कि भारत की युवाशक्ति के लिए देश-दुनिया में नए-नए अवसर बनें: PM @narendramodi
आज भारत सरकार, अनेक देशों से trade और mobility agreement कर रही है।
— PMO India (@PMOIndia) January 24, 2026
ये trade agreement भारत के युवाओं के लिए अनेकों नए अवसर लेकर आ रहे हैं: PM @narendramodi
आज देश reform express पर चल पड़ा है।
— PMO India (@PMOIndia) January 24, 2026
इसका उद्देश्य, देश में जीवन और कारोबार, दोनों को आसान बनाने का है: PM @narendramodi