పిఎంఇండియా
ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మిమ్మల్ని మరోసారి కలుసుకునే అవకాశం సెప్టెంబర్ మాసంలో ఈ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో లభించింది. దేశ ప్రజలందరికీ స్వాగతం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రజల సానుకూల ప్రయత్నాలకు ఒక వేదికను అందిస్తాం. దేశం సాధించిన విజయాల గురించి చర్చిస్తాం. భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక ఘనతకు రేపటితో 10 సంవత్సరాలు నిండుతున్నాయి. ఆ ఘనతే ‘సర్జికల్ స్ట్రైక్’. పదేళ్ల కిందట 2016 సెప్టెంబర్ 28-29 తేదీలలో భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. నియంత్రణ రేఖను దాటి మన ధైర్యవంతులైన సైనికులు ఉగ్రవాదంపై చర్య తీసుకున్న తీరును చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. సర్జికల్ స్ట్రైక్ యావత్ ప్రపంచానికి భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ఒక కొత్త ఉదాహరణను ధైర్యంగా అందించింది. ఉగ్రవాద దాడుల కారణంగా భారతదేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు ‘సర్జికల్ స్ట్రైక్’ మన నిర్ణయాత్మక ప్రతిస్పందన. ఉగ్రవాదులు భారతదేశానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటానికి సాహసిస్తే, వారికి తగిన జవాబు ఇస్తామని గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సిందూర్ వరకు భారతదేశం పదేపదే స్పష్టమైన సందేశాలు ఇచ్చింది.
మిత్రులారా! ఉగ్రవాద దాడులు భారతదేశాన్ని చాలా కాలంగా గాయపరుస్తున్నాయి. భారతదేశంలో వరుస పేలుళ్లు సర్వసాధారణమైపోయిన సమయం ఒకటి ఉండేది. ఈ సెప్టెంబర్ నెలలోనే- 2008 సెప్టెంబర్ 13వ తేదీన- ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కేవలం కొన్ని వారాలకే ముంబాయిలో భారీ స్థాయిలో 26/11 దాడి జరిగింది. మిత్రులారా! ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్‌పై చర్య తీసుకోవాలన్న డిమాండ్ అంతకుముందు కూడా వచ్చేది. కానీ అప్పట్లో ఆ డిమాండుకు పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. సమయం కోసం వేచి చూడడమే జరిగేది. ఇప్పుడు- నేటి భారతదేశం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోంది. మనం దాని ఫలితాలను చూస్తున్నాం.
మిత్రులారా! 9/11 ఉగ్రవాద దాడులు జరిగి ఈ ఏడాదికి 25 సంవత్సరాలు గడిచింది. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకులలో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో భారతదేశానికి చెందినవారే ఉన్నారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులర్పించేందుకు న్యూయార్క్ వెళ్ళిన విషయం నాకు గుర్తుంది. ఈ రోజు- మరోసారి- కోట్లాది భారత ప్రజల తరఫున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈ రోజుల్లో దేశానికి సంబంధించిన ఒక బృహత్ చిత్రం ఆవిష్కృతమవుతోంది. ఈ చిత్రంలో మీరు ఉన్నారు. మీ కుటుంబం కూడా ఉంది. మీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. నేను మాట్లాడుతున్నది భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమం గురించి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జనగణన మొదటి దశ దాదాపుగా పూర్తయింది. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైంది. ఈ రోజుల్లో లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ -కాశ్మీర్, ఉత్తరాఖండ్‌లోని మారుమూల, మంచుతో కూడిన ప్రాంతాలలో కూడా ఈ పని కొనసాగుతోంది. అక్కడి నుండి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మన ముందుకొచ్చాయి. ఉత్తరాఖండ్‌లో జనాభా లెక్కల ప్రక్రియ చమోలిలోని మాణా గ్రామం నుండి ప్రారంభమైంది. దేశంలోనే మాణా మొదటి గ్రామం అని చెప్తారు. మాణాలో 83 ఏళ్ల పూర్ణిమా రావత్ దీన్ని మొదట ప్రారంభించారు. ఉత్తరకాశీలోని బగోరి గ్రామంలో హోమ్‌స్టే నడుపుతున్న హర్దేవ్ సింగ్ రాణా తన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం సహాయంతో నమోదు చేశారు.
మిత్రులారా! జనగణన మనందరి జాతీయ బాధ్యత. దీని కోసం సమయం కేటాయించాలని నేను ఆగస్టు 15వ తేదీన దేశ ప్రజలను కోరాను. జనగణన కోసం ఈ స్వీయ-నమోదు సౌకర్యం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ నుండే మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా నమోదు చేయవచ్చు. ఈ సౌకర్యం హిందీతో సహా 16 భాషలలో అందుబాటులో ఉంది.
మిత్రులారా! దీని కోసం మీరు ఆన్లైన్ సెన్సస్ పోర్టల్‌ను సందర్శించాలి. ఈ పోర్టల్ చిరునామా se.census.gov.in. ఈ పోర్టల్‌కు వెళ్లి మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి. మీ లొకేషన్‌ను నమోదు చేసి, మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని నింపి, సమర్పించండి. ఈ మొత్తం ప్రక్రియకు సుమారు 15 నుండి 20 నిమిషాలు పడుతుంది. దీని కోసం మీరు ఎలాంటి పత్రాలను అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. వివరాలు సమర్పించిన తర్వాత మీకు ఒక ప్రత్యేక ఐడి లభిస్తుంది. గణన అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వారికి ఈ ఐడిని చూపించవచ్చు. మీరు అందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది జనగణనలో భాగంగా మారుతుంది. మిత్రులారా! ఇప్పటివరకు రెండు కోట్ల అరవై లక్షలకు పైగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి జనగణన పోర్టల్‌లో తమ సమాచారాన్ని నమోదు చేసి, స్వీయ గణనను పూర్తి చేశారు. దీనికి మీ సమయం కొంత అవసరం. కానీ ఇది దేశానికి చాలా ముఖ్యం. ఎందుకంటే మీ సరైన సమాచారం, మీ కుటుంబం గురించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తు వాస్తవ చిత్రాన్ని రూపొందించడంలో సహాయపడతాయి.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు సెప్టెంబర్ 27వ తేదీ ఒక ప్రత్యేక కారణం వల్ల మరింత ప్రత్యేకమైంది. సంస్కృతి, సమాజం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుని 100వ జయంతి ఈ రోజు. నేను మాట్లాడుతున్నది విశ్వహిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, పూజ్యులైన దివంగత అశోక్ సింఘాల్ గారి గురించి. ఆయన 1926 సెప్టెంబర్ 27వ తేదీన ఆగ్రాలో జన్మించారు. ఆయన ఈ సమాజంలో ఉంటూనే తపస్విలాంటి జీవితాన్ని గడిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి ఆయన అందించిన దిశానిర్దేశం, శక్తి ఫలితంగానే ఈ రోజు మనం అయోధ్యలో ఈ భవ్య ఆలయాన్ని చూస్తున్నాం. నేను చాలా అదృష్టవంతుడిని. నేను ఆయన జీవితాన్ని దగ్గరగా చూడటమే కాకుండా ఈ ఉద్యమంలో ఆయనతో పాలుపంచుకునే అవకాశం కూడా పొందాను. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు అశోక్ గారు పదే పదే గుర్తుకు రావడం సహజంగా జరిగింది. మిత్రులారా! అశోక్ గారి గురించి ఎక్కువగా చర్చ జరగని విషయాలు ఎన్నో ఉన్నాయి. రామ మందిర ఉద్యమంతో పాటు ఆయన సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా కూడా ఒక పెద్ద పోరాటం చేశారు. ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సివిల్ సర్వీస్ అధికారి. ఆయన తోబుట్టువులలో చాలామంది కూడా ఉన్నత పదవులను నిర్వహించారు. ఆయన స్వయంగా ఐఐటి బిహెచ్‌యు నుండి పట్టభద్రులయ్యారు. కానీ, ఇన్ని ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారు. ఇదే మహనీయుల గొప్ప సుగుణం. ఈ రోజు ఆయన శత జయంతి సందర్భంగా కోట్లాది మంది అభిమానుల తరపున వందనం చేస్తున్నాను. నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! మనం ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉత్సవంతో ప్రారంభించాం. ఈ ఉత్సవమే ‘సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవం’. వెయ్యి సంవత్సరాల కిందట 1026లో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే, సోమనాథుడిని ధ్వంసం చేసి, భారతదేశ గుర్తింపును తుడిచివేయడానికి వచ్చిన వారు ఈనాడు ఉనికిలో లేరు. సోమనాథ దేవాలయం తన పూర్తి వైభవంతో విశాల సముద్ర తీరంలో భారతదేశానికి అమరత్వ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తోంది. అందుకే ఈ సంవత్సరం మనం ‘సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవా’న్ని ఎంతో గర్వంగా జరుపుకున్నాం. మిత్రులారా! ఈ రోజు ‘మన్ కీ బాత్’లో నేను ఈ అంశాన్ని మళ్ళీ ప్రస్తావించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రీ.శ. 1026లో సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు, అదే సంవత్సరం గుజరాత్‌లోని మోఢేరాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఈ సంవత్సరంతో మోఢేరా ఆలయ విధ్వంసం జరిగి వెయ్యి సంవత్సరాలు పూర్తవుతున్నాయి. అయితే ఆ ఆలయాన్ని నిర్మించి అప్పటికి కేవలం ఒక సంవత్సరం మాత్రమే అయింది. ఈ ఆలయాన్ని 1025లో భీమదేవ రాజు నిర్మించారు. మిత్రులారా! ఆ కాలం గురించి ఆలోచించండి. అంతటి భారీ దాడి జరిగి సోమనాథ ఆలయం వంటి ఒక ప్రధాన విశ్వాస కేంద్రం ధ్వంసమైంది. ఇంకా అనేక ఇతర ప్రదేశాలపై దాడి జరిగింది. అది ఏ సమాజం లేదా ప్రభుత్వం మనోధైర్యాన్ని అయినా దెబ్బతీసి ఉండేది. అయినప్పటికీ మొదటి భీమదేవ రాజు గజనీతో పోరాడటమే కాకుండా తక్కువ సమయంలోనే మోఢేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మించారు. ఈ దృఢ సంకల్పం కారణంగా పదేపదే విధ్వంసానికి గురైనప్పటికీ సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది.
మిత్రులారా! ఆ తర్వాతి కాలంలో కూడా మోఢేరా సూర్య దేవాలయంపై దాడులు ఆగలేదు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అద్భుతమైన వాస్తు నిర్మాణ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశాడు. కానీ, మిత్రులారా! మనం భారతీయులం సూర్యుడిని కేవలం వాస్తుశిల్పం, ఆలయాల ద్వారా మాత్రమే ఆరాధించం. మన సూర్యారాధన అంటే కాంతి, శక్తి, విజ్ఞానం, నిర్విరామాలకు ప్రేరణ కూడా. అందువల్ల మోఢేరా కేవలం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. గుజరాత్‌లోని ఈ గ్రామం దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా మారింది. నేడు మోఢేరా పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ, సుస్థిరతకు ఒక ఉదాహరణగా నిలుస్తోంది. మోఢేరా అనేక పర్యాటక ఆకర్షణలను, సౌకర్యాలను కూడా ప్రవేశపెట్టింది. మకర సంక్రాంతి తర్వాత జనవరిలో మోఢేరా నృత్యోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ సాంస్కృతిక, శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన ఉంటుంది. మీరందరూ మోఢేరాను సందర్శించి, భారతదేశ ఈ ఘనమైన వారసత్వాన్ని వీక్షించాలని నేను కోరుతున్నాను.
మిత్రులారా! గతంతో మనకున్న అనుబంధం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలపరుస్తున్న వారి అంకితభావం, కృషి దీని వెనుక ఉన్నాయి. తమిళనాడు తిరుచిరాపల్లి లోని మనప్పారైలో ఇలాంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతోంది. కళాశాలలోని తమిళ అధ్యయన విభాగంతో అనుబంధం ఉన్న ఎ. సెల్వరాజు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఒక విద్యార్థి నుండి కొన్ని పురాతన విగ్రహాల గురించి తెలుసుకున్నారు. ఆ అంశంపై చర్చించిన తర్వాత ఆయన ఒక క్షేత్ర పర్యటనను ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో వారు వివిధ ప్రదేశాలలో అనేక విగ్రహాలను, పురాతన దేవాలయాలను కనుగొన్నారు. గతంతో మమేకమవ్వడానికి ఇది ఒక ఆసక్తికరమైన ప్రయత్నం. ఈ విధంగా మనం మన వారసత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోగలం. దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మన చరిత్రను నిశితంగా పరిశీలించి, అర్థం చేసుకోవడానికి మనకు ఒక అవకాశాన్ని ఇస్తుంది.
నా ప్రియమైన దేశవాసులారా! పూజ్య బాపూజీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ మరికొన్ని రోజుల్లో రాబోతోంది. బాపూజీ మనకు ఎన్నో జీవన మంత్రాలను అందించారు. పరిశుభ్రత వాటిలో ఒకటి. మన చుట్టూ పరిశుభ్రతకు సంబంధించిన ఎన్నో ప్రయత్నాలను మనం తరచుగా చూస్తుంటాం. ఈ ప్రయత్నాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లోని ఇటువంటి చిత్రాలు, వీడియోలు, రీల్స్ కూడా మన దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. ఇటీవలి కాలంలో నేను ఇటువంటి ఎన్నో ప్రయత్నాలను చూశాను. మధ్యప్రదేశ్‌లో ఒకచోట కొంతమంది యువకులు ఒక నదిని శుభ్రం చేస్తున్నారు. వారి ఈ చిన్న ప్రయత్నంలో యావత్ సమాజం పాలుపంచుకుంటోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో యువకులు పాత మెట్ల బావులను, ఇతర బావులను శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించడానికి సహాయపడుతోంది. ముంబాయిలో కొంతమంది యువకులు బీచ్‌లను శుభ్రంగా ఉంచడానికి చొరవ తీసుకుంటున్నారు. ప్రతి వారం వందలాది మంది యువ మిత్రులు ఏదో ఒక బీచ్ వద్ద గుమిగూడి, పరిశుభ్రత సేవలో పాల్గొంటున్నారు. ఇక్కడ ఢిల్లీలో పిల్లలు, యువత చెత్తను వేరు చేయడం, తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం గురించి ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక ప్రజలతో కలిసి యువకులు, విద్యార్థులు పిక్నిక్ ప్రదేశాలలోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. మిత్రులారా! ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదలుపెడితే మరికొందరు అతనితో చేరతారు. అలా ఆ యాత్ర పెరుగుతూ పోతుంది. ఇదే ప్రజా భాగస్వామ్యం. బాపూజీకి మనం అర్పించే అత్యంత సుందరమైన నివాళి పరిశుభ్రత మాత్రమే.
ప్రియమైన దేశప్రజలారా! మనం పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడు మొక్కలు, జంతువులను మాత్రమే కాపాడడం కాకుండా మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తాం. దేశంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని చాలా అందమైన రీతిలో ముందుకు తీసుకువస్తున్నాయి.
మిత్రులారా! అస్సాంలో సోనాయి రూపాయ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు నివసించేవి. కానీ క్రమంగా అటవీ భూములపై మానవ ఆక్రమణలు పెరగడంతో ఏనుగులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండిపోయాయి. మూడు సంవత్సరాల కిందట ఈ భూమిని ఆక్రమణల నుండి విముక్తి లభించింది. ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఏనుగులు ఇక్కడికి తిరిగి వచ్చాయి. సంవత్సరాలుగా కనిపించని ప్రాంతంలో ఇప్పుడు ఏనుగుల గుంపులు కనిపిస్తున్నాయి. మిత్రులారా! అస్సాంలోనే మరో అందమైన ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నం పిగ్మీ హాగ్ అనే చాలా చిన్న జీవిని కాపాడటానికి సంబంధించినది. ఒకానొక సమయంలో దాని మనుగడ ప్రమాదంలో పడింది. అయితే వాటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల కేవలం ఆరు పిగ్మీ హాగ్‌లతో ఒక సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి, వాటిని తిరిగి అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాలను కూడా అభివృద్ధి చేశారు. నేడు ఈ కార్యక్రమం ఫలితంగా పిగ్మీ హాగ్‌ల జనాభా 190కి పైగా పెరిగింది.
మిత్రులారా! ప్రకృతితో మనకున్న సంబంధం కేవలం దానిని పరిరక్షించడానికే పరిమితం కాదు. కొన్నిసార్లు మనం ప్రకృతిని పోషించినప్పుడు అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా నిలుస్తుంది. పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్ లో కొందరు మహిళలు ఈ సంబంధానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తున్నారు. జార్ఖాళీకి చెందిన ఈ మహిళలు మడ అడవులను అభివృద్ధి చేస్తున్నారు. వీరిలో చాలా మంది పులుల దాడిలో భర్తలను కోల్పోయినవారే. భర్తలను కోల్పోయిన తర్వాత వారికి సుందర్బన్ లో జీవనోపాధి లభించింది. వారు నాటిన మడ మొక్కలు నేడు గ్రామాలకు సహజ రక్షణ కవచంగా మారుతున్నాయి. వాటిని నాటడం ద్వారా ఈ మహిళలు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. మిత్రులారా! మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం. ప్రకృతి సమతుల్యతను గౌరవిద్దాం. దాని వైవిధ్యాన్ని పరిరక్షిద్దాం. మనం చేసే ఇటువంటి ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత.
నా ప్రియమైన దేశవాసులారా! ఇటీవల దేశంలోని లక్షలాది మంది యువతీయువకులు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకుంది. ఇదంతా ‘మాదకద్రవ్య రహిత యువజన ఉద్యమం’ కింద జరుగుతోంది. ఈ ఉద్యమం 100 వారాల పాటు కొనసాగుతుంది. మై భారత్ వాలంటీర్లు ఇందులో పాలుపంచుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న మన యువత కూడా ఇందులో భాగమే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక, ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో చేరాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా! ఈ ప్రచారంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం ‘నిషా విముక్తి సందేశం’. మన యువత ఈ సందేశాన్ని వారి సొంత భాషలో, వారి సొంత పద్ధతిలో వ్యాప్తి చేస్తున్నారు. ‘మన్ కీ బాత్’లో నా యువ మిత్రులను వారి సృజనాత్మకత ద్వారా ఈ ప్రచారంలో చేరమని నేను కూడా కోరాను. ఈ పిలుపుకు వేలాది మంది యువత స్పందించి, ముందుకు రావడం నాకు సంతోషంగా ఉంది. మై భారత్‌లో గీతం, నినాదాల రచన, వీధి నాటకం వంటి వివిధ పోటీలు జరిగాయి. అదేవిధంగా మన యువత తమ సృజనాత్మక కంటెంట్‌ను “#DrugFreeYouth” అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అంటే సందేశం యువతది, మాధ్యమం యువతది. దాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి కూడా యువతదే. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాల వంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి.
మిత్రులారా! మన పండుగలు, వేడుకలు ఎన్నో త్వరలో రాబోతున్నాయి. ఈసారి పండుగల ఆనందం నడుమ మన చుట్టూ ఉన్నవాటిని కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఏ యువత అయినా ఏదైనా చెడు అలవాటు వైపు వెళుతుంటే వారితో మాట్లాడండి. ఎవరైనా వ్యసనాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తుంటే వారికి సహకరించండి. మాదకద్రవ్య రహిత యువత- అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఈ సంకల్పంలో మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
నా ప్రియమైన దేశప్రజలారా! క్రీడల కోసం ఒక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని ఈసారి ఎర్రకోట నుండి నేను ప్రకటించాను. భారతదేశం నిరంతరం ఉత్తమంగా రాణించాలంటే గ్రామాలు, పట్టణాలకు చేరుకుని క్రీడా ప్రతిభను కనుగొనడం చాలా అవసరం. ఈ పనికి తమను తాము అంకితం చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. ప్రతిభను కనుగొని, పోషించడమే వారి ఏకైక అభిరుచి. మన పంజాబ్‌లో రాజిందర్ సింగ్ గారు ఇదే పని చేస్తున్నారు. సీనియర్ అనే పదం కూడా పేరులో మిళితమైన వారు రాజిందర్ సింగ్ గారు. 1980 ఒలింపిక్స్‌లో హాకీలో స్వర్ణ పతకం గెలిచిన జట్టులో ఆయన సభ్యులు. 1982 ప్రపంచ కప్‌లో ఆయన ఒక స్టార్. 2001లో భారతదేశం మొదటిసారిగా పురుషుల జూనియర్ ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. 2003లో దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఈ రెండు టోర్నమెంట్లలోనూ ఆయన కోచ్‌గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ద్వారా తన అభిరుచిని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆయన కృషి ఫలితంగా గ్రామాలలో కొత్త హాకీ ఆస్ట్రో-టర్ఫ్ రూపకల్పన జరుగుతోంది. రాజిందర్ గారి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మంచి కోచింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న గ్రామాలలో పిల్లలను గుర్తించడం. ఇటువంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో జూనియర్, సీనియర్ స్థాయిలో చాలా మంది క్రీడాకారులు తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. రాజిందర్ సింగ్ గారి ఈ అంకితభావాన్ని ఎంత పొగిడినా తక్కువే.
నా ప్రియమైన దేశవాసులారా! ఉసిరికాయ మనందరికీ బాగా తెలుసు. దానితో చేసిన ఊరగాయలు, జామ్ లాంటి మురబ్బాలను చాలా ఇళ్లలో ఉపయోగిస్తారు. చాలా మంది ఉసిరికాయ రసాన్ని ఇష్టపడతారు. చలికాలంలో చ్యవన్‌ప్రాశ మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. మన పెద్దలు తరతరాలుగా ఉసిరికాయ గుణాల గురించి మనకు చెబుతూనే ఉన్నారు. మిత్రులారా! ఉత్తర ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఈ ఉసిరికాయ నేడు కొత్త అవకాశాలకు మాధ్యమంగా మారుతోంది. ప్రతాప్‌గఢ్‌కు, ఉసిరికాయకు మధ్య సంబంధం చాలా పురాతనమైనది. ఇక్కడి రైతులు తరతరాలుగా ఉసిరికాయను సాగు చేస్తున్నారు. ఉసిరికాయ ప్రతాప్‌గఢ్‌కు ఒక బలమైన గుర్తింపును ఇచ్చింది. ఇప్పుడు ఈ పాత గుర్తింపు ఇక్కడి రైతులకు, మహిళలకు కొత్త అవకాశాలను తెస్తోంది. ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’ లేదా ODOP పథకం ద్వారా స్థానిక ఉసిరికాయ సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించారు. నేడు ప్రతాప్‌గఢ్‌లో ఉసిరికాయ ప్రాసెసింగ్‌కు సంబంధించిన సుమారు 100 యూనిట్లు పనిచేస్తున్నాయి. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అటువంటి బృందాలలో ఒకటి దేవగఢ్ కమాసి గ్రామానికి చెందిన సావిత్రి ఫూలే స్వయం సహాయక బృందం. దీనితో సంబంధం ఉన్న మహిళలు ఉసిరికాయతో క్యాండీ, జామ్ లాంటి మురబ్బా, జ్యూస్ లను తయారు చేస్తున్నారు. ODOP కింద కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావడం పెరగడం వల్ల వారి ఆదాయం కూడా పెరిగింది. ఒక గ్రామంలో వింధ్యవాసిని స్వయం సహాయక బృందం ఉంది. ఈ బృందంలోని మహిళలు ఉసిరికాయ పచ్చడి, డైజెస్టివ్ పౌడర్, అనేక ఇతర వస్తువులను తయారు చేస్తున్నారు. ఈ మహిళలు ప్రాసెసింగ్ కోసం యంత్రాలు, రుణ సౌకర్యాలను పొందారు. వారికి స్థానిక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా లభించడంతో అతి తక్కువ సమయంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది.
మిత్రులారా! మన దేశంలోని ప్రతి ప్రాంతానికి దానికంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఒకచోట ఒక ప్రత్యేకమైన పండు. మరో చోట ఒక సంప్రదాయ కళ. ఇంకొక చోట ఒక విశిష్టమైన నైపుణ్యం ఉన్నాయి. ఈ ప్రత్యేకతలను ప్రోత్సహించడానికే ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’ – వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ – ODOP- అనే ప్రచారం మొదలైంది. మన గ్రామాలు, చిన్న పట్టణాల గుర్తింపు కేవలం స్థానిక మార్కెట్‌కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, చివరికి ప్రపంచానికి కూడా చేరేలా చూడటమే మన ప్రయత్నం కావాలి. ఇది ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా దేశం స్వయం సమృద్ధి సాధించడానికి స్ఫూర్తినిస్తుంది. రాబోయే పండుగల సమయంలో కూడా మనం ‘వోకల్ ఫర్ లోకల్’ మంత్రాన్ని ఎన్నటికీ మరచిపోకూడదు.
ప్రియమైన దేశప్రజలారా! ఈ సెప్టెంబర్ మాసం పోషకాహార లోపంపై పోరాటానికి అంకితమైంది. పోషకాహార మాసం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు, సంస్థలు ఈ గొప్ప పని కోసం ఏకమవుతారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి ఈ సంవత్సరం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్‌గఢ్ ‘హర్ ఘర్ మునగ-ఘర్ ఘర్ మునగ – అంటే ‘ప్రతి ఇంట్లో మునగ – ఇంటింటా మునగ’ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రజలను తమ ఆహారంలో పోషకపదార్థమైన మునగను చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. గుజరాత్ కూడా చిరుధాన్యాలతో చేసిన వంటకాలతో ‘వాంగీ స్పర్థ’ అనే పోటీని ప్రారంభించింది. ఈ కార్యక్రమం సరసమైన, పౌష్టికత ఉన్న స్థానిక ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటివరకు రెండు లక్షల మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మహారాష్ట్ర కూడా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఈ అవగాహన ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. మిజోరంలో ఈ సంవత్సరం పోషకాహార తోటలను నిర్వహించేందుకు ప్రజలు ఏకమై ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. ఇది “తలో-మడ్-యనా” అనే మిజో సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. దీని అర్థం “నిస్వార్థ సేవ- ఇతరులకు సహాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందుండటం”. ఇటువంటి ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి కార్యక్రమాలలో భాగమైన అంగన్వాడీ కేంద్రాలతో సంబంధం ఉన్న వారందరి పట్ల నేను కూడా గర్వపడుతున్నాను. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు “పోషణ్ ట్రాకర్”కు డిజిటల్‌గా అనుసంధానమయ్యాయి. దాదాపు 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇది పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మెరుగైన సంరక్షణను అందించడానికి వీలు కల్పించింది. పోషకాహార లోపంపై ఈ పోరాటాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలి. మన సమాజాన్ని పోషకాహార లోపం నుండి పూర్తిగా విముక్తి చేయాలి.
మిత్రులారా! ఈ నెలలో మనమందరం గణేష్ ఉత్సవాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంతో జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా గణపతి బప్పాకు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వాగతం పలికారు. ఈ శుభ సందర్భం మొత్తం వాతావరణాన్ని ఆనందం, ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా! విఘ్నాలను తొలగించే గణేశుడు జ్ఞానం, వివేకం, శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై ఉన్న అపారమైన భక్తి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకు థాయ్‌లాండ్‌కు చెందిన పాంథన్ థీర్ ఖానోన్ గారిని తీసుకోండి. థాయిలాండ్ లో గణేశుడిని ’ఫ్రా ఫికానెత్’ గా పూజిస్తారు. పాంథన్ థీర్ ఖానోన్ గారు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తండ్రి గణేశుడి ఫోటోను బహుమతిగా ఇచ్చారు. అప్పుడే ఆయనలో ప్రగాఢ భక్తి మేల్కొంది. ఆయన నాలుగు దశాబ్దాలకు పైగా గణేశుడికి సంబంధించిన సంప్రదాయాలను అధ్యయనం చేయడంలో గడిపారు. ఆయన భారతదేశం, నేపాల్ సహా అనేక ఆసియా దేశాలకు ప్రయాణించారు. ఆయనకు మహారాష్ట్ర అంటే ప్రత్యేక అనుబంధం ఉంది. అష్టవినాయక సంప్రదాయం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. ఆయన కృషి వల్ల థాయ్‌లాండ్‌లోని భక్తులలో కూడా అష్టవినాయక యాత్ర ప్రాచుర్యం పొందింది. ఆయన ఉత్తర థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మాయిలో 2002 సంవత్సరంలో గణేష్ హిమాల్ మ్యూజియాన్ని స్థాపించారు. ఈనాడు అక్కడ 10,000కు పైగా గణేశ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశానికి రాలేని భక్తుల కోసం ఆ మ్యూజియంలో అష్టవినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రతి ఆదివారం ఉదయం సుమారు 10 గంటలకు గణేశుడి పూజ నిర్వహిస్తారు. గణేశుడికి సంబంధించిన ప్రత్యేక సందర్భాలలో కూడా పూజలు నిర్వహిస్తారు. భారతదేశపు విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ఇతర దేశాలలో ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయో ఇది చూపిస్తుంది. గణపతి బప్పా ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను.
మిత్రులారా! ‘మన్ కీ బాత్’ ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను వివిధ అంశాలపై మీ సందేశాలను అందుకుంటున్నాను. దయచేసి ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథలను పంపడం కొనసాగించండి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాలను మీరు అభినందించినప్పుడు వారి ఉత్సాహం మరింత పెరుగుతుంది. ‘మన్ కీ బాత్’ ద్వారా వాటి గురించి తెలుసుకోవడం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్ఫూర్తి పొందుతున్నారు. మీ సహకారంతో ఈ ప్రయాణం నిరంతరం ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. రాబోయే పండుగలను మీ కుటుంబం, స్నేహితులతో పూర్తి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం!
*****
Do listen to this month's #MannKiBaat as we discuss a range of subjects. https://t.co/uNlANtGly7
— Narendra Modi (@narendramodi) September 27, 2026
India has made it clear that terrorism will be met with a strong and decisive response.#MannKiBaat pic.twitter.com/xwDUFCAGZs
— PMO India (@PMOIndia) September 27, 2026
The Census is a national responsibility and every citizen has a role to play.#MannKiBaat pic.twitter.com/DikrJ8RimG
— PMO India (@PMOIndia) September 27, 2026
Tributes to Shri Ashok Singhal Ji on his birth centenary. His lifelong dedication to society and the nation continues to inspire generations.#MannKiBaat pic.twitter.com/rWa6GJaNyL
— PMO India (@PMOIndia) September 27, 2026
From the historic Sun Temple to becoming a solar village, Modhera beautifully connects our rich heritage with a sustainable future.#MannKiBaat pic.twitter.com/QAY9ynzcwI
— PMO India (@PMOIndia) September 27, 2026
Tamil Nadu's A. Selvaraju Ji's efforts are helping people discover ancient idols and temples. Such initiatives help us connect with and better understand our heritage.#MannKiBaat pic.twitter.com/gMUU959cih
— PMO India (@PMOIndia) September 27, 2026
Nature conservation is bringing positive change in Assam.#MannKiBaat pic.twitter.com/Xmi5Ft1ncy
— PMO India (@PMOIndia) September 27, 2026
In the Sundarbans, women are planting mangroves that protect villages and support their livelihoods. pic.twitter.com/1Hyh0nX8PM
— PMO India (@PMOIndia) September 27, 2026
India's youth are coming together against drugs. Through the Nasha Mukt Yuva Abhiyan, they are spreading awareness through creative campaigns and activities.#MannKiBaat pic.twitter.com/iL0Rqd5MR3
— PMO India (@PMOIndia) September 27, 2026
Rajinder Singh Senior Ji is helping discover and train young hockey talent. His efforts are giving children in villages better opportunities to pursue the sport.#MannKiBaat pic.twitter.com/xZmiA246mW
— PMO India (@PMOIndia) September 27, 2026
Pratapgarh's famous Amla is creating new opportunities for farmers and women working in Self-Help Groups.#MannKiBaat pic.twitter.com/iVggcTUp5q
— PMO India (@PMOIndia) September 27, 2026
Across India, people are coming together to promote better nutrition and support healthier communities.#MannKiBaat pic.twitter.com/pmiG3ueyo6
— PMO India (@PMOIndia) September 27, 2026
Bhagwan Shri Ganesh's devotion goes beyond India... In Thailand, the Ganesh Himal Museum has over 10,000 Ganesh idols, reflecting the deep cultural ties shared between the two countries.#MannKiBaat pic.twitter.com/RSSGBGqwYB
— PMO India (@PMOIndia) September 27, 2026