పిఎంఇండియా
అందరికీ నమస్కారం!
ఇవాళ్టి ఈ సభ భారత్, ఆస్ట్రేలియాల వాణిజ్య బలం, ఆకాంక్షలకు సాక్ష్యంగా నిలుస్తోంది. మీరు ఈ సమావేశానికి హాజరవటం మన పరస్పర విశ్వాసాన్ని, ఉమ్మడి ఆశయాలను ప్రతిబింబిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఇటీవల అనిశ్చిత పరిస్థితులు, సరఫరా వ్యవస్థలకు అంతరాయం, ఇంధన సంక్షోభం తలెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్, ఆస్ట్రేలియా సన్నిహిత, విశ్వసనీయ భాగస్వాములుగా ముందుకు సాగటం అత్యంత అవసరం.
కొన్నేళ్లుగా రెండు దేశాల సామర్థ్యాలను వినియోగించుకుంటూ భవిష్యత్తు భాగస్వామ్యానికి అవసరమైన కీలక ఆధారాన్ని ఏర్పరచుకున్నాం. 2022లో రికార్డు సమయంలో పూర్తయిన ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందం (ఈసీటీఏ) మన ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసింది. ఇది అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆస్ట్రేలియాకు భారతదేశ ఎగుమతులు రెట్టింపయ్యాయి. అలాగే మెరుగైన మార్కెట్ అవకాశాల ద్వారా ఇరుదేశాలు వాణిజ్య లాభాలను పొందాయి.
ఇక్కడితో మనం ఆగిపోకూడదు. సమగ్ర సీఈసీఏ ఒప్పందం దిశగా మనం అడుగులు వేస్తున్నాం. ఈ ప్రయత్నాల ద్వారా ఇరుదేశాల ప్రభుత్వాలు సరికొత్త మార్గాన్ని సిద్ధం చేశాయి.
ఇప్పుడు ఈ సరికొత్త మార్గం ద్వారా పెట్టుబడులు, ఆవిష్కరణలు వృద్ధి చెందుతాయి. ఈ భాగస్వామ్యాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైనే ఉంది.
మిత్రులారా,
ఇవాళ స్వచ్ఛ ఇంధన రంగానికి చెందిన పలు కంపెనీలు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. భారతదేశంలో హైడ్రో ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, సోలార్ మాడ్యూల్స్, పవన విద్యుత్ రంగాల కోసం ఒక బలమైన తయారీ వ్యవస్థను నిర్మిస్తున్నాం.
2030 నాటికి 500 జీడబ్ల్యూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, 2070 నాటికి కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆస్ట్రేలియా సాంకేతికత, పెట్టుబడులు, వనరులు ఈ పరివర్తనను మరింత వేగవంతం చేయగలవు.
కొన్ని నెలల కిందటే శాంతి చట్టం ద్వారా అణు ఇంధన రంగాన్ని భారత్ ప్రైవేట్ కంపెనీలకు కూడా అందుబాటులోకి తెచ్చింది. 2047 నాటికి 100 జీడబ్ల్యూ అణు ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆస్ట్రేలియాలో ఉన్న విస్తారమైన యురేనియం నిల్వలకు, భారతదేశ అణు ఇంధన ప్రయాణానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ఈ ముఖ్యమైన రంగంలో ఇరుదేశాలు సహకారాన్ని విస్తరించుకోవటానికి ఇదొక అద్భుతమైన అవకాశం.
భారతదేశంలో ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు, రైల్వేలు, పట్టణ మౌలిక సదుపాయాల రంగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలనుకునే ఆస్ట్రేలియా పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో రోజుకు దాదాపు 34 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. రోజూ 8 కిలోమీటర్లకు పైగా రైల్వే ట్రాక్లను నిర్మిస్తున్నారు. ఇది పరిమాణం, వేగం, స్థిరత్వాల అద్భుతమైన కలయికకు నిదర్శనం.
ఉక్కు రంగంలో మనం ఇప్పటికే బలమైన భాగస్వాములుగా ఉన్నాం. ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ముడి ఉక్కు ఉత్పత్తిదారుగా భారత్ ఉంది. తక్కువ కార్బన్ అల్యూమినియం, గ్రీన్ ఐరన్, క్లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో మనం కలిసి పనిచేయవచ్చు.
ఏఐ మిషన్, క్వాంటం మిషన్, సెమీ కండక్టర్ ప్రోగ్రాం ద్వారా భారత ప్రభుత్వం 10 బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక సహాయాన్ని అందించింది. ప్రపంచ స్థాయి పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు డేటా సెంటర్లు, ఏఐ, క్వాంటం టెక్నాలజీస్, సెమీ కండక్టర్స్, డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో మనం కలిసి పని చేయవచ్చు.
ఆస్ట్రేలియా పెన్షన్ ఫండ్లు నేడు 4 ట్రిలియన్ డాలర్లకు పైగా విలువైన ఆస్తులను నిర్వహిస్తున్నాయి. భారతదేశంలో పెన్షన్ పొదుపులను విశ్వసనీయంగా భావిస్తారు. మేం వాటిని కేవలం పెట్టుబడిగా మాత్రమే భావించలేం… లక్షలాది కుటుంబాల నమ్మకంగా భావిస్తాం. మీ ఫండ్లు సురక్షితమైన, స్థిరమైన వృద్ధిని సాధించటానికి భారత్ గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. మీ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయటం, మీ పెట్టుబడి వృద్ధి చెందటానికి సహాయపడటమే మా ప్రయత్నం.
విద్య, నైపుణ్యాల రంగాల్లో ఇరుదేశాల మధ్య పరస్పర బంధం ఉంది. డీకిన్ యూనివర్సిటీ, వోలోంగాంగ్ యూనివర్సిటీలు గిఫ్ట్ సిటీలో క్యాంపస్లను ప్రారంభించి, కొత్త అధ్యాయానికి నాంది పలికాయి. ఇది భారతదేశంపై వాటికున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. విద్యార్థుల వలసలను ఒక ప్రతిభావంతమైన భాగస్వామ్యంగా మార్చటమే మన ఉమ్మడి లక్ష్యం కావాలి.
మిత్రులారా,
ఈ అన్ని రంగాల్లో మనం ముందుకు సాగాలంటే మరో ముఖ్యమైన అంశంపై దృష్టి సారించాలి. మన భాగస్వామ్యం కేవలం రెండు రాజధానులు లేదా కొన్ని నగరాలకే పరిమితం కాకూడదు. మన రాష్ట్రాలు, చిన్న, పెద్ద నగరాలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు వీటన్నింటినీ భాగస్వాములుగా మార్చాలి.
వెస్ట్రన్ ఆస్ట్రేలియా కీలక ఖనిజాల బలాన్ని ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల్లోని తయారీ రంగ సామర్థ్యాలతో అనుసంధానించవచ్చు. క్వీన్స్లాండ్, టాస్మేనియాకు చెందిన స్వచ్ఛ ఇంధనం, వ్యవసాయ రంగ నైపుణ్యాలు… పంజాబ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పునరుత్పాదక ఇంధన కారిడార్లకు, ఆహార శుద్ధి వ్యవస్థలకు ఊతమిస్తాయి.
న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాల్లోని ఆర్థిక, విద్య, వైద్య సాంకేతికత, ఆవిష్కరణల రంగాలు… మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో కలిసి పనిచేయటం ద్వారా ప్రపంచ స్థాయి పరిష్కారాలను కనిపెట్టవచ్చు. సౌత్ ఆస్ట్రేలియాలోని రక్షణ, అంతరిక్షం, తయారీ రంగాలు… ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల భాగస్వామ్యంతో సరికొత్త అవకాశాలను సృష్టించగలవు.
రాబోయే రోజుల్లో మనం కొన్ని నిర్దిష్టమైన రాష్ట్రాల మధ్య, రంగాల మధ్య భాగస్వామ్యాలను గుర్తించి, వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన వ్యూహాలను రూపొందించాలని సూచిస్తున్నా.
మిత్రులారా,
ప్రజాస్వామ్య విలువలు, ఇండో–పసిఫిక్ ప్రాంతం పట్ల ఇరుదేశాలకున్న ఉమ్మడి దృక్పథం ఆధారంగా మన మధ్య బలమైన వ్యూహాత్మక అనుసంధానం ఏర్పడింది. మన వాణిజ్య భాగస్వామ్యాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఈ ప్రయత్నంలో మీ పాత్ర కీలకమైనది.
ఇవాళ్టి చర్చలు నూతన ఆలోచనలకు, నూతన భాగస్వామ్యాలకు, నూతన నిర్ణయాలకు దారి తీస్తాయని విశ్వసిస్తున్నాను.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు గౌరవ ప్రధానమంత్రికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
అందరికీ నా శుభాకాంక్షలు.
ధన్యవాదాలు.
గమనిక: ఇది ప్రధానమంత్రి ప్రసంగానికి స్వేచ్ఛానువాదం. అసలు ప్రసంగం హిందీలో ఇచ్చారు.
***
India's growth story presents immense opportunities for Australian businesses. Together, we can build trusted and future-ready partnerships. https://t.co/SpniY4kdLB
— Narendra Modi (@narendramodi) July 9, 2026
Addressed the Australia-India CEO Forum in Melbourne this morning. Since 2023, this forum has gained remarkable momentum, reflecting the growing confidence in our economic partnership.
— Narendra Modi (@narendramodi) July 9, 2026
I thank PM Anthony Albanese for joining the interaction and sharing his vision for taking our… pic.twitter.com/6GDcsAkJUv