పిఎంఇండియా
ప్రధానమంత్రి: దాదాపు 12-13 ఏళ్లుగా నేనీ భవనంలో నివాసం ఉంటున్నాను. ఇక్కడ క్రమం తప్పకుండా ఎవరినైనా కలుస్తున్నానంటే- వారు క్రీడాకారులు మాత్రమే. ఈ పుష్కర కాలంలో మీ కఠోర శ్రమ, భారత్‌ను విజయపథంలో నడిపించడంలో మీ కృషి, సరికొత్త విజయ శిఖరారోహణ సంప్రదాయం అనుపమానం. అందుకే, పాఠశాలలకు వెళ్లి “బాగా ఆడండి.. ఇలా చేయండి.. అలా చేయండి” అని విద్యార్థులకు మేం చెబితే లభించే ఫలితాలకన్నా మీరు సాధించిన పతకాలే వారికి మరింత స్ఫూర్తినిస్తాయి.
ఓ క్రీడాకారుడినుద్దేశించి- ‘మీ ఇద్దరు కుమార్తెలను క్రీడాకారులుగా మలుస్తానని మీరు లోగడ నాకు వాగ్దానం చేశారు గుర్తుందా?”
క్రీడాకారుడు: గుర్తుంది సర్! వాళ్లింకా చిన్నవాళ్లే… తదుపరి కామన్వెల్త్ గేమ్స్‌లో మా కుటుంబం నుంచే మూడు పతకాలు ఖాయమని ఆత్మవిశ్వాసంతో చెప్పగలను.
ప్రధానమంత్రి: నేనూ ఎంతో విశ్వాసంతో ఉన్నాను.
క్రీడాకారుడు: మీ నమ్మకాన్ని నిలబెడతాం సర్!
ఓ క్రీడాకారుడు: నేను మైదానంలో పోటీ పడుతున్న రోజు అంటే- గత నెల 29న గురు పౌర్ణమి. ఆ పర్వదినం నాడు నా గురువుకు కానుకగా నేను స్వర్ణ పతకం సాధించాను.
ప్రధానమంత్రి: మీరు దేశానికి ఎనలేని గౌరవం సముపార్జించి పెట్టారు. మీరు విజేతగా నిలిచిన క్షణంలో మీతోపాటు ఎందరో క్రీడాభిమానుల కనులవెంట ఆనందబాష్పాలు రాలాయి. ప్రతి కన్నీటి చుక్క నాకొక స్వర్ణ పతకంలా అనిపించింది.
క్రీడాకారుడు: ఆ రోజు నా సంతోషానికి పట్టపగ్గాల్లేవు సర్! భావోగ్వేగంతో ఉబ్బితబ్బిబ్బై ఆనందబాష్పాలు జలజలా ఉబికి వచ్చాయి. ఎందుకంటే- పారిస్ ఒలింపిక్స్‌లో కేవలం 1 కిలో తేడాతో నాకు పతకం చేజారింది. అయితే, క్రీడాకారుల జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఈ నాలుగేళ్లలో నేనూ అలాంటివెన్నో ఎదుర్కొన్నాను- నిరంతర గాయాలు, కుటుంబ సమస్యలు వగైరా.. ఆ నాలుగేళ్లు నాకొక గడ్డుకాలం. ఎట్టకేలకు మొన్న విజేతల వేదికపై నిల్చున్నపుడు, మన జాతీయ పతాకం రెపరెపలాడుతూ పైకి వెళ్తుంటే, జాతీయ గీతం వీనుల విందు చేస్తుండగా మనను మనం నియంత్రించుకోలేం… ఆనందబాష్పాలు వాటంతటవే ప్రవహిస్తాయి.
ప్రధానమంత్రి: అద్భుతం… నిజంగా ఎంతో అద్భుతం! ఈ విజయం కేవలం మీ ఒక్కరిదే కాదని నా అభిప్రాయం.. ఇది భావితరాలకు ఎనలేని స్ఫూర్తినివ్వడం ఖాయం.
క్రీడాకారుడు: బరిలో భారత్‌తో తలపడితే తొలి రౌండ్‌లోనే ఓటమి ఖాయమని, తమకు పతకం దక్కదని ఇతర దేశాల క్రీడాకారులు బెదిరిపోయారు.
ప్రధానమంత్రి: అంటే- మన క్రీడాకారులను చూసి, వారలా బెంబేలెత్తారన్న మాట!
క్రీడాకారుడు: అవును సర్.
ప్రధానమంత్రి: ఆ రోజున ఏం జరిగింది.. మీరు రెస్టారెంట్ సిబ్బందితో గొడవ పడ్డారా?
క్రీడాకారుడు: మేమెంతో అద్భుత ప్రతిభను ప్రదర్శించాం సర్. అది చివరి రోజు.. అక్కడున్న వాళ్లందరం పతక విజేతలమే. నాకు కాస్త బాధనిపించింది. అందుకే, నేను వారితో మర్యాదగా మాట్లాడి, అభ్యర్థించాను.. వారు సమాధానపడటంతో పరిస్థితి సద్దుమణిగింది.
ప్రధానమంత్రి: అది విజయానందం… సంతోషంతో, ఆనందోత్సాహాలతో సంబరం చేసుకునే సందర్భం. పోటీ ముగిశాక సహచరులతో కలిసి నవ్వుతూ, తుళ్లుతూ గడిపే వేళ… ఆ దృశ్యాన్ని కనులారా చూస్తూ ఆనందంతో ఉప్పొంగిపోవడం ఒక మధురానుభూతి. పతకాలు ప్రదానం సమయంలోనే కాకుండా మీ విజయంపై యావద్దేశం అంతర్గతంగా మీ ఆనందోత్సాహాలను అనుభవిస్తుంది. నిజం చెబుతున్నాను… ఆ వీడియో అసాధారణం.. ప్రజలంతా దాన్ని చిరకాలం గుర్తుంచుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా గల బాక్సర్లు కూడా మిమ్మల్ని చూసి బెదిరిపోయి ఉంటారు!
క్రీడాకారుడు: నిజమే సర్.. అందరూ భయపడ్డారు… ఒకటి తర్వాత మరొకటిగా మన వాళ్లు స్వర్ణ పతకాలు సాధిస్తూనే ఉన్నారు. చివరగా అదొక అపార ఉద్వేగభరిత విజయోత్సవంగా మారింది. మాకు లభించిన మద్దతు.. వరుస పోటీలు- ఇవన్నీ సామాన్యమైనవేమీ కావు. మన యువ క్రీడాకారులలో చాలా మంది ‘ఖేలో ఇండియా’ పథకం ద్వారా ఎదిగిన వారే. దేశీయ క్రీడారంగంలో పెనుమార్పు తెస్తున్న కార్యక్రమమిది.
ప్రధానమంత్రి: ‘ఖేలో ఇండియా’ ప్రతిష్ట ఇనుమడించాలంటే రిబ్బన్లు కత్తిరించడంతో మాత్రమే సాధ్యం కాదు. ఒక సాధారణ విద్యార్థి, ఓ గ్రామీణ బాలుడు లేదా యువ క్రీడాకారుడి తరహాలో అందరూ తమ ప్రతిభను ప్రదర్శించాలి. ఆ కార్యక్రమ ప్రతిష్ట పెంచడంలో మీ వంతు కృషి ఇదే. ఎందుకంటే- మనమింకా చాలా దూరం పయనించాలి… మరెన్నో పతకాలు సాధించాలి. సరే… కార్గిల్ విజయ దినోత్సవం నాడు విజేతలుగా నిలిచిన వారెవరు?
క్రీడాకారుడు: ఆనాడు కార్గిల్ దినోత్సవం… నేను పాకిస్థాన్‌తో పోరాడిన రోజు. నేను భారత సైనికుడిని కాబట్టి, శత్రువును మట్టిగరిపించే దృఢ సంకల్పం పూనాను. దానికి అనుగుణంగా పాకిస్థాన్ ప్రత్యర్థిని 5-0 పాయింట్ల తేడాతో ఓడించి, ఆ విజయాన్ని మన సైన్యంలోని కార్గిల్ వీరులకు అంకితం చేశాను.
ప్రధానమంత్రి: మీరొక అంశాన్ని గుర్తుంచుకోవాలి. మీరు స్వయంగా సైనికుడు కాబట్టి, మీరు వెలిబుచ్చిన భావన.. అంటే- మీ పతకాన్ని కార్గిల్ విజేతలకు అంకితం చేయడం ఆ విజయానికి మరింత గొప్పతనాన్నిచ్చిందని నేను విశ్వసిస్తున్నాను. పైగా, ఎవరినైతే ఓడించాలో వారినే మీరు అనుకున్నట్లు మట్టిగరిపించారు.
క్రీడాకారుడు: పాకిస్థాన్ ప్రస్తావన వచ్చింది కాబట్టి, నాకొక సంఘటన గుర్తొస్తోంది సర్. అదేమిటంటే- 2015 వరల్డ్ మిలిటరీ గేమ్స్‌లో నేను తొలుత పాకిస్థాన్ క్రీడాకారుడితో తలపడాల్సి వచ్చింది. అప్పుడు మా ఉన్నతాధికారులు ఫోన్ చేసి, “పాక్ ఆటగాడి చేతిలో ఎట్టి పరిస్థితిలోనూ ఓడిపోరాదు” అని చెప్పారు. నేను కూడా కృతనిశ్చయంతో ఉన్నందువల్ల తొలి రౌండ్‌లో 4-1తో, రెండో రౌండ్‌లో 3-2తో విజేతగా నిలిచాను. అయితే, మా ఇద్దరి తలలకూ గాయాలు కావడంతో ఆసుపత్రికి వెళ్లి కుట్లు వేయించుకోవాల్సి వచ్చింది.
ప్రధానమంత్రి: అలాగా…
క్రీడాకారుడు: అవును సర్… మీరు 2014లో తొలిసారి ప్రధానమంత్రి అయ్యే నాటికి నరేంద్ర రాణా గారు ఆర్మీలో మా కోచ్. ఈ నేపథ్యంలో ఓటమి పాలైన నా పాకిస్థాన్ ప్రత్యర్థి కాసేపు ఆలోచించి- “సోదరా, నేనొక మాట చెప్పనా?” అన్నాడు… నేను సరేనన్నాను. అప్పుడతడు- “సోదరా.. నీ పేరు నరేంద్ర, నీ కోచ్ పేరు నరేంద్ర, మీ ప్రధానమంత్రి పేరు కూడా నరేంద్ర. ఇప్పుడు ఆ పేరు తలచుకుంటేనే నాలో వ్యతిరేకత పెల్లుబుకుతోంది” అని వ్యాఖ్యానించాడు.
ప్రధానమంత్రి: ఈసారి క్రీడల్లో మీరు పతకాల సంఖ్యను పెంచడమే కాకుండా ఒక తరాన్నే తీర్చిదిద్దుతున్నారు.
క్రీడాకారుడు: మీతో మాట్లాడుతుంటే భావోద్వేగంతో నా గుండె వేగం పెరిగింది సర్…
ప్రధానమంత్రి: వద్దు.. వద్దు… ఎలాంటి ఆందోళనా అవసరం లేదు.
క్రీడాకారుడు: అయితే,
ప్రధానమంత్రి: మీరు కోరుకుంటే… నాతో మాట్లాడినందుకూ ఒక పతకం లభిస్తుంది.
క్రీడాకారుడు: నా మిత్రుల బృందంలో ఒకరి మంచి కోరుతూ నేనొక సలహా ఇస్తే- “నువ్వు మోదీని కలుస్తావా” అని అడిగేవారు.
ప్రధానమంత్రి: అలాగా…
క్రీడాకారుడు: హర్యానా భాషలో- “నువ్వు మోదీని కలుస్తావా… ఆయన నీతో మాట్లాడుతారా?” అని హేళన చేసేవారు. అందుకే, ఈ రోజున మిమ్మల్ని కలిసి, మీతో మాట్లాడిన తర్వాత, వాళ్లందరితో “నేను మోదీజీని కలిశాను ఆనందోత్సాహాలతో చెప్పగలను.”
క్రీడాకారుడు: కామన్వెల్త్ క్రీడల్లో నేను రజత పతకం గెలిచాను. ఆ సమయంలో నా ఘనతను మీకే అంకితమిచ్చాను సర్… అంతర్జాతీయ స్థాయిలో ఒక్క పతకమైనా సాధించాలన్నది నా స్వప్నం. కానీ, నాకు శిక్షణ కేంద్రమేదీ అందుబాటులో లేదు. భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్‌ఏఐ) చేరిన తర్వాత కఠిన శిక్షణ లభించింది కాబట్టి, నా కల నెరవేరింది. నా ప్రతిభా ప్రదర్శనకు ఆ శిక్షణే కారణం… కాబట్టి, ఆ ఘనతను సంతోషంగా మీకు అంకితం చేశాను.
ప్రధానమంత్రి: మీ సహృదయంతో నాకు ఎనలేని గౌరవం దక్కింది. శ్రమించింది మీరే అయినా, నన్ను కూడా గుర్తుంచుకున్నందుకు నేనెంతో కృతజ్ఞుడిని మిత్రమా!
ప్రధానమంత్రి: మీరు వారణాసిలో సాధన చేసేవారు కదా?
క్రీడాకారుడు: అవును సర్…
ప్రధానమంత్రి: అక్కడి స్టేడియంలో సదుపాయాలు ఎలా ఉన్నాయి?
క్రీడాకారుడు: చాలా బాగున్నాయి సర్.. శిక్షణ కోసం అక్కడికి వెళ్లాను కాబట్టి, నేను గుడికి కూడా వెళ్తూ వచ్చాను. కాశీ విశ్వనాథుడంటే నాకెంతో ఇష్టం… అందుకే, ఆ నగరంలోనే స్థిరపడాలని నేనిప్పుడు భావిస్తున్నాను సర్.
ప్రధానమంత్రి: మీరు భోపాల్‌లో శిక్షణ పొందారు కదా?
క్రీడాకారుడు: అవును సర్.
ప్రధానమంత్రి: మీరెప్పుడైనా ఉజ్జయినికి వెళ్లారా?
క్రీడాకారుడు: వెళ్లాను సర్…
ప్రధానమంత్రి: మరి… సమీపంలోని మహాకాలుని ఆలయానికి వెళ్లారా?
క్రీడాకారుడు: వెళ్లాను సర్…
ప్రధానమంత్రి: మీరొకసారి కాశీ విశ్వనాథుని కూడా దర్శించుకున్నారు కదా?
క్రీడాకారుడు: అవును సర్…
ప్రధానమంత్రి: ఇప్పుడిది శ్రావణ మాసం కదా!
క్రీడాకారుడు: అవును సర్… ముందుగా నేను మా ఇంటికి వెళ్లి, తర్వాత దైవ దర్శనానికి వెళ్తాను.
క్రీడాకారుడు: భారత క్రీడా ప్రాధికార సంస్థ కూడా నాకెంతో చేయూతనిచ్చింది సర్… అందువల్లనే నేనీ స్థాయికి వచ్చాను. అలాగే, 2018 నాటి తొలి ‘ఖేలో ఇండియా’ క్రీడల్లో పాల్గొని, రజత పతకం సాధించాను. అప్పటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మిమ్మల్ని కూడా చూశాను. అక్కడ పతకం గెలవడంతో మొదలుపెట్టి, నేడీ స్థాయికి చేరాను సర్.
ప్రధానమంత్రి: క్రీడా సదుపాయాల కల్పన ఒక ఎత్తయితే, దేశంలో క్రీడా సంస్కృతి పరిఢవిల్లితేనే దేశం పతకాలు సాధించగలదు. మిత్రులారా! మీరు అద్భుతంగా ఆడారు… దేశానికి గర్వకారణంగా నిలిచారు. మీకందరికీ నా హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్తులోనూ మీరెన్నో విజయాలు సాధిస్తారు. ఆ విధంగా మనం మళ్లీమళ్లీ కలుస్తూనే ఉంటాం… మీకందరికీ శుభాకాంక్షలు.
ప్రధానమంత్రి: మీరు దేశం కోసం పతకం గెలవడం ఇది మూడోసారి కదా? అభినందనలు..
క్రీడాకారుడు: ధన్యవాదాలు సర్..
ప్రధానమంత్రి: ప్రధానమంత్రి- మీకు నా ఆశీర్వాదాలు…
క్రీడాకారుడు: మీకు అనేకానేక ధన్యవాదాలు సర్… నిన్న నా పుట్టిన రోజు.. ఇవాళ మీ చేత్తో ఇచ్చిన లడ్డూ స్వీకరించడం నాకెంతో సంతోషంగా ఉంది.
ప్రధానమంత్రి: అద్భుతం… అభినందనలు.. మీరెప్పుడూ ఇలాగే చిరునవ్వులు చిందిస్తూండాలి!
ఎవరైతే బాగా ఆటలు ఆడుతుంటారో… వారంతా జీవితంలో ఎంతో వృద్ధి చెందుతారు..
గమనిక: ప్రధానమంత్రి హిందీ సంభాషణకు ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.
***