Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చిన్మయ అమృత్ మహోత్సవ్ గ్లోబల్ మిషన్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

చిన్మయ అమృత్ మహోత్సవ్ గ్లోబల్ మిషన్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


చిన్మయ అమృత్ మహోత్సవ్ గ్లోబల్ మిషన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడాన్ని మునులు తనకు అందించిన వాత్సల్యం, ఆశీర్వాదాల తాలూకు ప్రగాఢ ఆధ్యాత్మిక అనుభూతిగా వర్ణించారు. చిన్మయ మిషన్ కేవలం ఒక సంస్థ కాదనీ, అది ఒక ముని స్థాపించిన శాశ్వత చేతన అనీ, అంతేకాకుండా దశాబ్దాల తరబడి తీసుకున్న పవిత్ర సంకల్పాలకు మూలమనీ ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఉత్సవానికి పెట్టిన పేరు సరిగ్గా సరిపోలుతోందని శ్రీ మోదీ అన్నారు.

పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానందతో ఒక హోలోబాట్ ద్వారా మాటామంతీని నిర్వహించడం ఈ కార్యక్రమ భావోద్వేగాన్ని ఇనుమడింపచేసిందనీ, దీనిలో ఆధునిక సాంకేతికత పాత్ర వ్యక్తమవుతోందనీ ప్రధానమంత్రి అన్నారు. ముప్ఫయ్ మూడు సంవత్సరాల కిందట, అంటే 1993లో వడోదరాలో స్వామీజీతో తాను సమావేశమైన ఘట్టాన్ని ప్రధానమంత్రి కార్యక్రమ ఆహ్వానితులతో పంచుకున్నారు. గురుదేవుల ఆప్యాయతనీ, సంభాషణనీ, ఆయన ఆశీస్సుల్నీ గమనిస్తుంటే నేను మళ్లీ ఆయన సమక్షంలో నిలిచానా ఏమిటని నాకు అనిపిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. హృదయాన్ని స్పర్శించే విధంగా నివాళి కార్యక్రమానుభూతిని మిగిల్చినందుకు మిషన్ సభ్యులకు ప్రధాని మనసారా కృతజ్ఞత‌లను తెలియజేశారు. ‘‘నా వరకూ చూస్తే, ఇవి అత్యంత భావావేశపూరిత ఘడియలు’’ అని ప్రధానమంత్రి శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

శికాగోలో సర్వ మత సమ్మేళనాన్ని నిర్వహించి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా స్వామి చిన్మయానందను శికాగోకు ఆహ్వానించడానికని 1993 ఫిబ్రవరి-మార్చి మధ్య తాను వెళ్లిన సంగతిని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. అది స్వామి వివేకనంద చరిత్రాత్మక ప్రసంగానికి వంద సంవత్సరాలైన సందర్భం కూడా. అయితే గురుదేవులు అవిశ్రాంతంగా అమెరికా అంతటా పర్యటించి  అశేష జనులు ఆ కార్యక్రమంలో పాలుపంచుకొనేటట్లు చూశారనీ, అదే ఏడాది ఆగస్టు 3న శాన్ డియగోలో గురుదేవులు కాలం చేశారనీ ప్రధాని ప్రస్తావించారు. సెప్టెంబర్ 11నాటి సమావేశంలో శికాగోలో ఏర్పాటు చేసిన సమావేశంలో గురుదేవులు లేని లోటు ఎంతగా బాధించిందీ ప్రధానమంత్రి స్ఫురణకు తెచ్చుకుంటూ, తమ తుది సంభాషణ అంతా యువ శక్తిని సమీకరించడంపైనే ప్రధానంగా కేంద్రీకృతం అయిందన్నారు. ‘‘యువ శక్తి నిర్మాణం, యువ శక్తి ద్వారా బలమైన, సమర్థమైన భారత్ నిర్మాణం అన్న అంశాల మీదే మేం మాట్లాడుకున్నాం’’ అని శ్రీ మోదీ వెల్లడించారు.

ఆ నాటి సమావేశం ముగిసిన తరువాత కొన్ని సంవత్సరాలకు గుజరాత్ రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రి అయింది మొదలు, గత 25 ఏళ్లుగా ప్రజలకు నిలకడగా సేవలను అందిస్తూ వస్తున్న సంగతిని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇంతకాలంలో తాను అనుసరిస్తున్న విధానాల్లో యువతకు కేంద్ర స్థానాన్నిస్తూ వచ్చినట్లు తెలిపారు. ప్రధాన బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకొని 300 రోజులుపాటు 40,000 కిలోమీటర్లు చుట్టి ఒక లక్ష కన్నా ఎక్కువ మంది యువజనులను కూడగట్టినందుకు చిన్మయ అమృత్ మహోత్సవ్  యువ  స్వచ్ఛంద సేవకులను ప్రధాని ప్రశంసించారు. ‘‘ఈ అద్భుత ప్రయత్నాన్ని నెరవేర్చినందుకు పూర్తి జట్టును కూడా నేను అభినందిస్తున్నాను’’ అని ప్రధాని శ్రీ మోదీ అన్నారు.  

వయం అమృతస్య పుత్రః (మనం అమరత్వ బాలలం) అన్న ఉపనిషద్సూక్తిని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, భారత్ వేల సంవత్సరాలుగా జ్ఞానం, కాంతుల అన్వేషకురాలుగా ఉందనీ, దేశ చేతన, వివేకం శాశ్వతత్వాన్ని కలిగివుండటమే దీనికి కారణమనీ ప్రధానమంత్రి అన్నారు.  ఇదే తనకు, స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవ ఘట్టంతో ‘వికసిత్ భారత్‌’ దిశగా దూసుకుపోవడానికి శుభారంభం చేద్దామనీ, సహస్రాబ్దుల నుంచీ మానవ జాతి శ్రేయం కోసం తపిస్తున్న భారత్‌ను పునరుద్ధరిద్దామనీ పిలుపునివ్వడానికి స్ఫూర్తిని అందించిందనీ ఆయన తెలిపారు. అది మొదలు అసంఖ్యాక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సంస్థలు అనేక  ముఖ్య సందర్భాల్లో పవిత్ర ప్రతిజ్ఞ పాఠాలను స్వీకరించాయని ఆయన తెలిపారు. దేశ అమృత్ కాల్ ప్రచార ఉద్యమంలో చిన్మయ మిషన్ మమేకం కావడం భేషుగ్గా ఉందని ఆయన అన్నారు. ‘‘మనం అమృతస్య పుత్రః గా నిలిచామనడానికిదే అసలైన నిదర్శనం’’ అని శ్రీ మోదీ అన్నారు.

దేశ ప్రజల జాగృతినీ, ఉన్నతినీ దృష్టిలో పెట్టుకొని ‘‘వయం రాష్ట్రే జాగ‌ృమయ పురోహితః’’ అన్న వేదోక్తిని ప్రధానమంత్రి ఉదాహరించారు. స్వామి చిన్మయానంద ఆధ్యాత్మికతపై ఎంత ధారాళంగా ప్రసంగించే వారో జాతీయ ప్రాధాన్యాల విషయంలోనూ అంతే వాగ్ధాటిని కనబరిచారని ప్రధాని అన్నారు. దేశమంటే మన సంస్కృతికి, మన ఉనికికి పట్టుగొమ్మనీ, ఇందువల్ల ఆధ్యాత్మిక ఉన్నతి వ్యక్తిగత అభివృద్ధికీ, దేశ ప్రగతికీ దన్నుగా నిలవాలని స్వామీజీ బోధించే వారని శ్రీ మోదీ అన్నారు. జాతీయ ఆత్మగౌరవాన్ని ప్రజలలో పాదుగొల్పే నిమిత్తం స్వామీజీ గీతా జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి ఉపనిషత్తుల్నీ, వేదాంతాన్నీ, ధర్మ గ్రంథాల్నీ సామాన్యులకు చేరువగా తీసుకువచ్చారనీ, ఇవాళ లక్షల మంది చిన్మయ మిషన్ యువత సాంస్కృతిక రాయబారులుగా మారి భారతీయ విలువల ప్రచారంలో పాలుపంచుకుంటున్నారంటే అది ఆ కార్యక్రమ ఫలితమనీ ప్రధానమంత్రి అన్నారు. ‘‘పూజ్య గురుదేవులు అందించిన ఈ తోడ్పాటు భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక పునరుజ్జీవనంలో ఓ ముఖ్య అధ్యాయమని చెప్పి తీరాలి’’ అని ప్రధానమంత్రి శ్రీ మోదీ అన్నారు.

2015లో గురుదేవ్ శత జయంతి సందర్భంగా స్మారక నాణేన్ని విడుదల చేసిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. స్వామి చిన్మయానంద జీవితాన్ని జ్ఞానం, కర్మ, భక్తిల అద్భుత సమ్మేళనంగా అభివర్ణించారు. ఆయన గురు స్వామి శివానంద ఇచ్చిన ‘‘వెళ్లు, సింహంలా గర్జించు” ఆశీర్వాదాన్ని స్వామీజీ తన జీవితంలో సార్థకం చేశారని పేర్కొన్నారు. స్వామీజీ అంతర్గత విశ్వాసం, ఆయన ప్రసంగాలను వినేవారిపై చెరగని ముద్ర వేసిందని.. ఆయన నిర్వహించిన ‘ఆర్ట్ ఆఫ్ మ్యాన్ మేకింగ్’ రేడియో కార్యక్రమం ఎంతోమంది జీవితాలకు మార్గదర్శకంగా నిలిచిందని తెలిపారు. “స్వామీజీ స్వరంలో ఉన్న ఆత్మవిశ్వాసం, అంతర్గతంగా ఉన్న శక్తి ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన ఆలోచనల ముద్ర వేసేవి” అని ప్రధానమంత్రి శ్రీ మోదీ పేర్కొన్నారు.

గొప్ప వ్యక్తుల ఆశయాలు వారు జీవించి ఉన్న కాలానికే పరిమితం కావని, వారి జీవితకాలం తర్వాత కూడా కొనసాగుతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. చిన్మయ మిషన్‌ దేశవ్యాప్తంగా విస్తృతమైన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100కు పైగా చిన్మయ విద్యాసంస్థలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాయని తెలిపారు. “ఈ విద్యాసంస్థల్లో విద్యార్థులు ఆధునిక విద్యను అభ్యసించడంతోపాటు భారతీయ విలువలను కూడా అలవర్చుకుంటున్నారు” అని ప్రధాని శ్రీ మోదీ పేర్కొన్నారు.

స్వామి చిన్మయానంద వంటి మేధావులు స్వాతంత్ర్యానంతరం కలలుగన్న దేశ దార్శనికతకు అనుగుణంగా ప్రస్తుత పాలన సాగుతోందని ప్రధానమంత్రి తెలిపారు. నూతన భారత్ నిర్మాణంలో భాగంగా విద్యా వ్యవస్థను ఆధునికీకరించాల్సిన బాధ్యతను దేశం చురుకుగా నిర్వర్తిస్తోందని పేర్కొన్నారు. భారతీయ జ్ఞాన సంప్రదాయం, మాతృభాషలో విద్య, ఆధునిక విజ్ఞానశాస్త్రం, సాంకేతికతలను సమన్వయం చేసే జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. ‘‘ఈ నూతన విద్యా విధానంలో వీటన్నింటికీ ప్రాధాన్యత కల్పించాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

భారతీయ వారసత్వ పరిరక్షణకు స్వామీజీ జీవితాంతం అంకితమయ్యారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. కన్యాకుమారి వద్ద సముద్రంలో వివేకానంద రాక్‌ మెమోరియల్‌ నిర్మించాలన్న ఏకనాథ్‌ రానడే సంకల్పానికి గురుదేవ్‌ స్వామి చిన్మయానంద మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు కోసం తొలిసారిగా ఆర్థిక సహకారం అందించింది కూడా ఆయనేనని తెలిపారు. నేడు ఈ స్మారక కట్టడం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ‘‘భారతీయ వారసత్వంపై గర్వం కలిగి ఉండటం, దానిని పరిరక్షించడం కూడా స్వామీజీ జీవిత లక్ష్యాల్లో ఒకటి” అని ప్రధాని శ్రీ మోదీ అన్నారు.

దేశంలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు విస్తరిస్తున్న గొప్ప సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని ప్రస్తావిస్తూ.. కాశీ విశ్వనాథ ధామ్, అయోధ్యలోని శ్రీరామ మందిరం, ఉజ్జయినిలోని మహాకాళ్‌ మహాలోక్‌, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ వంటి పుణ్యక్షేత్రాల అభివృద్ధి, పునరుద్ధరణతోపాటు సాంస్కృతిక ప్రదేశాలకు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు లభించడాన్ని ప్రధానమంత్రి వివరించారు. గతంలో భారత్‌కు చెందిన పురాతన కళాఖండాలు దొంగతనానికి గురై.. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే విదేశాల్లో విక్రయించిన పరిస్థితులను గుర్తుచేశారు. గత పన్నెండేళ్లలో భారతీయ వారసత్వ సంపదను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చిన విషయాన్ని ఆయన వివరించారు. “గత 12 ఏళ్లలో 650కు పైగా ఇటువంటి పురాతన విగ్రహాలను కూడా మనం తిరిగి తీసుకువచ్చాం” అని శ్రీ మోదీ తెలిపారు.

భారతీయ తత్వశాస్త్రాన్ని స్వామీజీ ప్రపంచానికి పరిచయం చేసిన విధానాన్ని, నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచ దేశాలను భారత్‌తో అనుసంధానిస్తున్న తీరుతో పోల్చుతూ ప్రధానమంత్రి మాట్లాడారు. భారతీయ వారసత్వం పట్ల దేశంలో పెరుగుతున్న గర్వభావం, వలసవాద మనస్తత్వం నుంచి బయటపడటం వంటివి ప్రాచీన ఋషులు, దేశభక్తులు చూపిన మార్గంలో భారత్‌ ముందుకు సాగుతోందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో వారి మేధో వారసత్వమే దేశానికి అతిపెద్ద బలమని ఆయన స్పష్టం చేశారు. “మన వారసత్వం పట్ల గర్వం కలిగించే ఈ ఆత్మవిశ్వాసం, బానిస మనస్తత్వం నుంచి విముక్తి పొందామనే ఈ నమ్మకం.. దేశం ఇప్పుడు ఆ మార్గంలో ముందుకు సాగుతోందనడానికి నిదర్శనం’’ అని శ్రీ మోదీ అన్నారు.

వివిధ సంస్థలు వేరు వేరు లక్ష్యాల కోసం పనిచేస్తున్నప్పటికీ.. అవన్నీ దేశ అభివృద్ధి, కీర్తి అనే ఒకే గమ్యాన్ని చేరుకుంటాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వామి చిన్మయానంద తన కాలంలోని సవాళ్లకు అనుగుణంగా తన సంకల్పాలను రూపొందించుకున్నట్లుగానే, నేటి తరం కూడా ఆధునిక సమాజంలో నెలకొన్న వక్రధోరణులు, సవాళ్లను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని విభజించే శక్తులకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్యం చేయడం, స్వావలంబనను ప్రోత్సహించడం, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రతి పౌరుడిని అనుసంధానించడం కోసం చురుకైన చర్యలు చేపట్టాలని సూచించారు. ‘‘సమాజాన్ని విభజించే శక్తులకు వ్యతిరేకంగా నేడు మనమంతా ఐక్యం కావాలి’’ అని ప్రధానమంత్రి శ్రీ మోదీ అన్నారు.

2047లో భారత్‌ స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తిచేసుకునే సమయంలోనే, చిన్మయ మిషన్‌ శతాబ్ది ఉత్సవాలు కూడా జరగడం ఒక చారిత్రాత్మక కలయికగా ప్రధానమంత్రి అభివర్ణించారు. ఈ రెండు ప్రయాణాల లక్ష్యాలు ఒకటేనని, అవి కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. చిన్మయ మిషన్‌కు చెందిన ప్రపంచవ్యాప్త ఆచార్యులు, ఆధ్యాత్మిక సాధకులు, స్వచ్ఛంద సేవకుల కుటుంబం.. గురుదేవుల వారసత్వాన్ని, దశాబ్దాల అనుభవాన్ని సద్వినియోగం చేసుకుని వికసిత్ భారత్‌ నిర్మాణానికి సహకరిస్తుందనే పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చివరగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘చిన్మయ మిషన్‌ శతాబ్ది ప్రయాణం, వికసిత్ భారత్‌ నిర్మాణ ప్రయాణం రెండూ కలిసి ముందుకు సాగుతాయి” అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు.

 

***