‘మైక్రో యూనిట్ల రుణ గ్యారంటీ నిధి’ (సీజీఎఫ్ఎంయూ) పథకాన్ని 31.03.2031 వరకు మరో ఐదేళ్ల పాటు కొనసాగించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (ఎన్సీజీటీసీ) ద్వారా ఎగవేతల నుంచి రుణాన్ని మంజూరు చేసే సంస్థలకు గ్యారంటీ రక్షణను అందిస్తుంది.
2026 సెప్టెంబర్ నాటికి ఉన్న గణాంకాల ప్రకారం పీఎం ముద్రా యోజన (పీఎంఎంవై) ప్రారంభమైనప్పటి నుంచి రుణాలు మంజూరు చేసే సంస్థలు రూ. 43.34 లక్షల కోట్ల విలువైన 60.36 కోట్లకు పైగా రుణాలను మంజూరు చేశాయి. 2016 జనవరిలో ప్రారంభమైన సీజీఎఫ్ఎంయూ.. దేశంలో పీఎం ముద్రా రుణాల వేగవంతమైన విస్తరణ, వృద్ధికి ఒక ప్రధాన ఉత్ప్రేరకంగా వ్యవహరించింది.
పథకంలోని ముఖ్యాంశాలు:
రుణాన్ని మంజూరు చేసే సంస్థలకు కింది వాటిపై రుణ గ్యారంటీ రక్షణను అందించడమే ఈ నిధి ప్రధాన లక్ష్యం:
ప్రధానమంత్రి ముద్రా యోజన కింద అర్హత కలిగిన సూక్ష్మ పరిశ్రమలకు అందించే రూ. 20 లక్షల వరకు రుణాలకు గ్యారంటీ.
ప్రధానమంత్రి జన ధన్ యోజన ఖాతాల కింద బ్యాంకులు మంజూరు చేసే రూ. 10,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయానికి గ్యారంటీ.
రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు పోర్ట్‌ఫోలియో ఉన్న స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసే రుణాలకు గ్యారంటీ.
గ్యారంటీ కవరేజీ: రుణాన్ని మంజూరు చేసే సంస్థల వాస్తవిక నష్ట భయాన్ని ప్రతిబింబించేలా నిర్వహణ మూలధన పరిమితుల విషయంలో ఇచ్చిన మొత్తానికి, టర్మ్ లోన్ ఖాతాల విషయంలో బకాయి ఉన్న మొత్తానికి గ్యారంటీ కవరేజ్ అనుసంధానమై ఉంటుంది.
గ్యారంటీ ఫీజు: వార్షిక గ్యారంటీ ఫీజును 1 శాతం నుంచి 0.75 శాతానికి తగ్గించారు. స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) ఎలాంటి మార్పు లేదు. వారు మొదటి సంవత్సరానికి 0.25 శాతం, తదుపరి సంవత్సరాల్లో 0.50 శాతం చొప్పున గ్యారంటీ ఫీజును చెల్లించడం కొనసాగిస్తారు.
పథకం అమలు కాలం: ఈ పథకం 16వ ఆర్థిక సంఘం కాలానికి.. అనగా 2026-27 నుంచి 2030-31 వరకు పీఎంఎంవై కింద మంజూరు చేసే అన్ని రుణాలకు వర్తిస్తుంది.
పథకం ప్రభావం:
ప్రధానమంత్రి ముద్రా యోజన కింద అందించే పూచీకత్తు లేని రుణాలు గతంలో సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి రుణాలు పొందలేకపోయిన నూతన తరం వ్యాపారవేత్తలను తయారు చేశాయి.
సీజీఎఫ్ఎంయూ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించడం ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో రూ. 12.6 లక్షల కోట్ల విలువైన ముద్రా రుణాల పంపిణీకి మార్గం సుగమమవుతుంది.
ఈ పథకం యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను ప్రారంభించడానికి, మరింత విస్తరించడానికి ఒక ప్రధాన ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది.
***