ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం…2026 నుంచి 2033-34 కాలానికి మొత్తం రూ.1,856.67 కోట్ల అంచనా వ్యయంతో ఖేలో ఇండియా క్రీడా పరికరాల తయారీ పథకానికి ఆమోదం తెలిపింది. పెట్టుబడులు, తయారీ, ఆవిష్కరణలు, ఎగుమతులను ప్రోత్సహించడంతో పాటు ప్రపంచ క్రీడా వస్తువుల రంగంలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యం.
కేంద్ర బడ్జెట్ 2026–27లో ఈ పథకాన్ని ప్రకటించారు. పెట్టుబడులు, సాంకేతిక స్వీకరణ, పరిశోధన, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి, నాణ్యతా ధ్రువీకరణ, మార్కెట్ అభివృద్ధి కోసం లక్షిత సాయం అందించడం ద్వారా భారతదేశంలో క్రీడా పరికరాల తయారీని బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యం. అంతర్జాతీయంగా పోటీపడగల క్రీడా పరికరాల పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడటంతో పాటు ప్రపంచ సరఫరా వ్యవస్థల్లో భారత్ స్థానాన్ని ఈ పథకం బలోపేతం చేస్తుంది.
ఖేలో భారత్ నీతి–2025, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ పథకం పెట్టుబడులను ఆకర్షిస్తుందని, ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని, దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేస్తుందని, అంతర్జాతీయంగా పోటీపడేలా భారతీయ క్రీడా పరికరాలను తీర్చిదిద్దుతుందని అంచనా వేస్తున్నారు.
సమీకృత క్రీడా పరికరాల తయారీ వ్యవస్థల నిర్మాణం
తయారీదారులు, సరఫరాదారులు, పరీక్షా కేంద్రాలు, రూపకల్పన, నమూనాలను తయారు చేసే కేంద్రాలు, అనుబంధ సంస్థలను ఈ పథకం ఒకే చోట ఏర్పాటు చేస్తుంది. తద్వారా క్లస్టర్ ఆధారిత తయారీని ప్రోత్సహించడానికి, సమీకృత పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలను సృష్టించడానికి అవసరమైన ప్రత్యేక క్రీడా వస్తువుల తయారీ జోన్లను (ఎస్జీఎంజడ్) అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. భవ్య పథకం, ఎన్ఐసీడీసీ పారిశ్రామిక పార్కుల పరిధిలో ఉన్న ప్రస్తుత పారిశ్రామిక మౌలిక సదుపాయాలతో అనుసంధానం చేయడం ద్వారా ఈ జోన్లను అభివృద్ధి చేస్తారు. ఇది క్రీడా పరికరాల విలువ ఆధారిత వ్యవస్థ అంతటా సమర్థమైన తయారీకి, బలమైన పారిశ్రామిక అనుసంధానాలకు, పోటీతత్వం పెరగడానికి వీలు కల్పిస్తుంది.
సమీకృత ఉత్పాదక సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి, పారిశ్రామిక అనుసంధానాలను బలోపేతం చేయడానికి, కార్యాచరణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఈ జోన్లు తోడ్పడతాయి. ఈ చర్యలు పెట్టుబడులు సులభతరం చేస్తాయని, ఉత్పత్తి సామర్థ్యాలను పెంపొందిస్తాయని, దేశంలో పటిష్ఠమైన క్రీడా వస్తువుల తయారీ రంగం అభివృద్ధికి మద్దతు ఇస్తాయని భావిస్తున్నారు.
పెట్టుబడులను ఆకర్షించడం, దేశీయ తయారీ రంగాన్ని విస్తరించడం:
క్రీడా పరికరాల రంగంలో నూతన పెట్టుబడులను ఆకర్షించడం, దేశీయ తయారీ రంగం సామర్థ్యాన్ని బలోపేతం చేయడంపై ఈ పథకం ప్రధాన దృష్టి సారిస్తుంది. నిర్దేశిత క్రీడాపరికరాల జోన్లలో పరిశ్రమలను ఏర్పాటు చేసేలా ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ తయారీదారులను, బ్రాండ్లను, రీటైల్ వ్యవస్థలను యాంకర్ ఇన్వెస్ట్మెంట్ మద్దతు విభాగం ప్రోత్సహిస్తుంది. అలాగే పటిష్ఠమైన సరఫరాదారులు, అనుబంధ వ్యవస్థల అభివృద్ధికి దోహదపడుతుంది. దీనికి తోడుగా అధిక ఉత్పత్తిని, సామర్థ్య విస్తరణను, సుస్థిరమైన తయారీ వృద్ధిని టర్నోవర్ ఆధారిత తోడ్పాటు విభాగం ప్రోత్సహిస్తుంది.
మొత్తంగా రూ.1,130 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ కార్యక్రమాలు దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తాయని, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే దేశీయంగా విలువ జోడింపును పెంచుతాయని, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తాయని, విలువ ఆధారిత వ్యవస్థ అంతటా ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని, అంతర్జాతీయ మార్కెట్లలో భారతదేశ పోటీతత్వాన్ని మెరుగుపరుస్తాయని కూడా భావిస్తున్నారు.
ఎంఎస్ఎంఈలను, ఇప్పటికే ఉన్న తయారీ క్లస్టర్లను బలోపేతం చేయడం:
క్రీడా పరికరాల రంగంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) పోషించే ముఖ్యమైన పాత్రను గుర్తించిన ఈ పథకం ఇప్పటికే ఉన్న తయారీ క్లస్టర్లను బలోపేతం చేయడానికి, చిన్నస్థాయి పరిశ్రమల వృద్ధికి సహాయం అందించడానికి ప్రాధాన్యమిస్తుంది.
ఉమ్మడి సౌకర్యాలు, భాగస్వామ్య మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా ప్రస్తుతం ఉన్న క్రీడా వస్తువుల తయారీ క్లస్టర్ల ఉన్నతీకరణకు సాయం అందిస్తుంది.
అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల నుంచి ధృవీకరణ పత్రాలను పొందడానికి, వాటిని పునరుద్ధరించుకోవడానికి రూ.105 కోట్ల రూపాయలతో తయారీదారులకు తోడ్పాటును అందిస్తుంది.
ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరచడానికి, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశాన్ని సులభతరం చేయడానికి, భారతదేశంలో తయారైన క్రీడా వస్తువులపై విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి ఈ చర్యలు తోడ్పడతాయి.
పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల్లో పెట్టుబడులు
క్రీడా పరికరాల రంగంలో పరిశోధన, రూపకల్పన, ఆవిష్కరణలను బలోపేతం చేయడంపై ఈ పథకం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది.
క్రీడా పరికరాలు, మెటీరియల్ సైన్సెస్, రక్షణ పరికరాలు, అధునాతన తయారీ సాంకేతిక పరిజ్ఞానాల్లో పరిశోధనను ప్రోత్సహించడానికి ప్రముఖ విద్యా, పరిశోధన సంస్థల్లో ఎక్సలెన్స్ సెంటర్ల ఏర్పాటుకు సాయం అందిస్తుంది.
అనుసంధాన్ జాతీయ పరిశోధనా ఫౌండేషన్‌తో సమన్వయం చేసుకోవడం ద్వారా పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను కూడా ప్రోత్సహిస్తుంది.
స్టార్టప్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా అంకురసంస్థలకు సాయం అందించడం ద్వారా క్రీడా పరికరాల తయారీ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. క్రీడా పరికరాల తయారీ వ్యవస్థలో సరికొత్త సాంకేతికతలు, ప్రక్రియలు, ఉత్పత్తుల అభివృద్ధి, పరీక్ష, ధ్రువీకరణ, వాణిజ్యీకరణను సులభతరం చేస్తుంది.
భవిష్యత్తు అవసరాల కోసం నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి అభివృద్ధి
క్రీడా పరికరాల తయారీ రంగంలో ఉపాధి కల్పనకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఈ పథకం గుర్తించింది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు అందిస్తుంది.
మారుతున్న పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వశాఖతో పాటు సంబంధిత పరిశ్రమ వర్గాల సహకారంతో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలవుతాయి.
నైపుణ్యాలు కలిగిన మానవ వనరులకు పెరుగుతున్న డిమాండును ఈ ప్రయత్నాలు తీరుస్తాయి. క్రీడా పరికరాల తయారీ రంగం దీర్ఘకాలిక అభివృద్ధికి తోడ్పడతాయి.
అంతర్జాతీయ మార్కెట్లకు భారతీయ క్రీడా పరికరాలను తీసుకెళ్లడం:
ప్రత్యేక బ్రాండింగ్, ప్రచారం, మార్కెట్ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయ క్రీడా పరికరాల మార్కెట్లలో భారతదేశ ఉనికిని విస్తరించడమే ఈ పథకం లక్ష్యం. ఎగుమతుల ప్రోత్సాహక పథకం సహకారంతో చేపట్టే ఈ చర్యలు భారతీయ క్రీడా పరికరాలకు అంతర్జాతీయంగా గుర్తింపును పెంచడంతో పాటు, విదేశీ మార్కెట్లలో అవకాశాలను మెరుగుపరుస్తాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో తమ ప్రభావాన్ని విస్తరించుకొనేలా తోడ్పాటును అందిస్తాయి.
భారతదేశం నిర్దేశించుకున్న అంతర్జాతీయ క్రీడా లక్ష్యాలకు తోడ్పాటు:
అధిక నాణ్యతతో పాటు అంతర్జాతీయ ధ్రువీకరణ పొందిన క్రీడా వస్తువుల తయారీని ప్రోత్సహించడం ద్వారా భారతదేశ క్రీడా రంగం అవసరాలకు, క్రీడాకారుల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలకు ఈ పథకం మద్దతు అందిస్తుంది. ఆవిష్కరణలను ప్రోత్సహించడం, నాణ్యతకు సంబంధించిన మౌలిక వసతులను, తయారీ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా లాంటి కార్యక్రమాలకు కూడా ఈ పథకం తోడ్పాటును అందిస్తుంది.
క్రీడా పరికరాల రూపకల్పన, అభివృద్ధి, తయారీలో అంతర్జాతీయంగా పోటీనిచ్చే కేంద్రంగా భారతదేశాన్ని నిలబెట్టడానికి ఈ పథకం దోహదపడుతుందని భావిస్తున్నారు. తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలను విస్తరించడం ద్వారా వృద్ధికి, ఉపాధికి, ఎగుమతులకు అవకాశాలు పెరుగుతాయి. అలాగే క్రీడారంగంలో అగ్రస్థానానికి చేరుకోవాలన్న దేశ ఆకాంక్షకు మద్దతు లభించడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్–2047 లక్ష్యాల సాధనకు ఈ పథకం తోడ్పడుతుంది.
***