వికసిత్ భారత్ జాతీయ దృక్పథానికి అనుగుణంగా తదుపరి తరం పాలనా సంస్కరణల కార్యక్రమం ద్వారా నూతన కేంద్ర ప్రాయోజిత పథకం (సీఎస్ఎస్)గా ప్రధానమంత్రి వికసిత గ్రామ స్వరాజ్ యోజన (పీఎం వీజీఎస్వై)కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2026-27 నుంచి 2030-31 వరకు (పదహారవ ఆర్థిక సంఘం కాలపరిమితితో సమానంగా) ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఆమోదం లభించింది.
ఆర్థిక పరమైన అంశాలు:
ఈ పథకం మొత్తం అంచనా వ్యయం రూ. 7,395.55 కోట్లు కాగా… కేంద్ర వాటా రూ. 4,869.48 కోట్లు, రాష్ట్ర వాటా రూ. 2,526.07 కోట్లు.
లబ్ధిదారుల సంఖ్య: దేశవ్యాప్తంగా 2.55 లక్షలకు పైగా పంచాయతీలు, సంప్రదాయ స్థానిక సంస్థల్లోని దాదాపు 32 లక్షల మంది ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, ఇతర భాగస్వాములు ఈ పథకం ద్వారా ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారు. ప్రతి అవగాహన కార్యక్రమం కనీసం కోటి మందికి చేరుతుంది.
ఉపాధి కల్పన సహా గణనీయమైన ప్రభావం:
ఈ పథకం ద్వారా ఎటువంటి శాశ్వత పోస్టులను రూపొందించరు. సాంకేతికంగా మద్దతిచ్చేందుకు, దాని లక్ష్యాలను సాధించేందుకు సంస్థాగత వ్యవస్థలో భాగంగా రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిలో అవసరం మేరకు కాంట్రాక్టు పద్దతిలో మానవ వనరులను నియమించవచ్చు.
వర్తించే రాష్ట్రాలు, జిల్లాలు:
ఈ పథకం పంచాయతీలు లేని పార్ట్-IX పరిధిలోకి రాని గ్రామీణ స్థానిక ప్రభుత్వ సంస్థల (సంప్రదాయ స్థానిక సంస్థలు)తో సహా అన్ని రాష్ట్రాలు, యూటీలకు వర్తిస్తుంది.
వివరాలు:
అమలు వ్యూహం:
ఈ పథకాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీల పరిపాలనా వ్యవస్థల ద్వారా అమలు చేస్తారు. పథక లక్ష్యాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యకలాపాలు, ప్రాధాన్యతలు, అవసరాలను పేర్కొంటూ రాష్ట్రాలు, యూటీలు వార్షిక కార్యాచరణ ప్రణాళికలను సమర్పిస్తాయి. నిర్దేశిత కేంద్ర సాధికార కమిటీ సంబంధిత విధానాలు, ప్రమాణాలకు అనుగుణంగా ఈ ప్రణాళికలను పరిశీలించి ఆమోదిస్తుంది. సమన్వయం, సాంకేతిక సహాయం, పర్యవేక్షణ, సమీక్షల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, యూటీలు కేటాయించిన బాధ్యతల పరిధిలో కార్యకలాపాలను నిర్వహిస్తాయి. గ్రామస్థాయిలో పథకం అమలుకు ఇప్పటికే ఉన్న సంస్థాగత, సామర్థ్య పెంపుదల, డిజిటల్, ప్రసార వ్యవస్థలను వినియోగిస్తారు.
***