Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హలైన్‌తో ప్రధానమంత్రి చర్చలు

మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హలైన్‌తో ప్రధానమంత్రి చర్చలు


మయన్మార్ అధ్యక్షుడు శ్రీ యు మిన్ ఆంగ్ హలైన్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఫలప్రదమైన చర్చలు జరిపారు.

 

అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత యు మిన్ ఆంగ్ హలైన్‌ తన తొలి విదేశీ పర్యటన కోసం భారత్‌ ఎంచుకోవడంపై భారత్ ఎంతో గర్విస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అధ్యక్షుడు తన భారత పర్యటనను భగవాన్ బుద్ధుని ఆశీస్సులతో బోధ్‌గయ నుంచి ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

 

చర్చల సందర్భంగా ఇరు దేశాల నాయకులు భారత్-మయన్మార్ సంబంధాల్లో అన్ని అంశాలను సమీక్షించారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై సుదీర్ఘంగా చర్చించారు.

 

వాణిజ్యం, అరుదైన ఖనిజాలు, ఆరోగ్య సంరక్షణ, రవాణా అనుసంధానం, చారిత్రక వారసత్వ కట్టడాల పునరుద్ధరణ, సామర్థ్య పెంపొందింపు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలపై చర్చలు జరిగాయి. వీటితో పాటు సముద్ర భద్రత, సైబర్ భద్రత, పరస్పర ప్రయోజనాలు ఉన్న ఇతర రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి.

 

భారతదేశపు ‘‘నైబర్‌హుడ్ ఫస్ట్’’ (పొరుగుదేశాలే ప్రథమ ప్రాధాన్యత), ‘యాక్ట్ ఈస్ట్’, ఇండో-పసిఫిక్ విధానాలకు మయన్మార్ అత్యంత కీలకమైనదని ప్రధానమంత్రి  మయన్మార్‌తో ఉన్న సంబంధాలకు భారత్‌ ఇచ్చే ప్రాధాన్యతను ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

‘‘మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హలైన్‌తో‌ ఫలప్రదమైన సమావేశం జరిగింది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తన తొలి విదేశీ పర్యటన కోసం భారత్‌ను ఎంచుకోవడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. తన పర్యటనను భగవాన్ బుద్ధుని ఆశీస్సులతో బోధ్‌గయ నుంచి ప్రారంభించడంమరో సంతోషకరమైన విషయం. మేం భారత్-మయన్మార్ సంబంధాల్లో అన్ని అంశాలను సమీక్షించాం. భారతదేశపు ‘నైబర్‌హుడ్ ఫస్ట్’, ‘యాక్ట్ ఈస్ట్’, ఇండో-పసిఫిక్ విధానాలకు మయన్మార్ అత్యంత కీలక దేశం’’.

 

‘‘వాణిజ్యం, అరుదైన ఖనిజాలు, ఆరోగ్య సంరక్షణ, అనుసంధానత, వారసత్వ కట్టడాల పునరుద్ధరణ, సామర్థ్య పెంపొందింపు రంగాల్లో సహకారాన్ని మరింత లోతుగా పెంచే మార్గాలపై మా చర్చలు సాగాయి. సముద్ర భద్రత, సైబర్ భద్రత వంటి మరిన్ని రంగాల్లో కూడా కలిసికట్టుగా పనిచేయడానికి మేం అంగీకరించాం’’.

***