Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గౌరవనీయ శ్రీ అటల్ జీవితం నుంచి పొందే స్ఫూర్తిని ప్రస్ఫుటిస్తూ సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని, ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందే దిశగా ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా-

“యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః.

స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే”

అని ఆయన ఉటంకించారు. అంటే- “మహనీయులు ఏది ఆచరించినా… సామాన్య ప్రజానీకం వారిని శ్రద్ధతో అనుసరిస్తారు” అని అర్థం. మరో మాటలో- ఒక నాయకుడు లేదా ఆదర్శప్రాయుడైన వ్యక్తి ప్రవర్తన వారి అనుచరులతో పాటు సమాజానికీ మార్గనిర్దేశం చేస్తుంది.

అటల్ జీ హుందాతనం, ప్రవర్తన ఔన్నత్యం, సైద్ధాంతిక స్థిరత్వం, దేశ ప్రయోజనాలకు అగ్ర ప్రాధాన్యమిచ్చే సంకల్పం వంటి సుగుణాలు భారత రాజకీయాలకు ఆదర్శ ప్రమాణాలని శ్రీ మోదీ అభివర్ణించారు. “పదవితో కాకుండా, ప్రవర్తనతోనే శ్రేష్ఠత్వం సిద్ధిస్తుందని, సమాజానికి మార్గనిర్దేశం చేసేది రుజువర్తనేనని తన జీవనశైలితో ఆయన ఉద్బోధించారు” అని శ్రీ మోదీ అన్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“గౌరవనీయ అటల్ జీ జయంతి, మనమంతా ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందే ఒక విశిష్ట సందర్భం. ఆయన నడవడిక, మన్నన, సైద్ధాంతిక దృఢత్వం, జాతీయ ప్రయోజనాలకు పెద్దపీట వేసే ఉక్కు సంకల్పం మన దేశ రాజకీయాలకు ఆదర్శప్రాయం. జీవితౌన్నత్యం పదవి ద్వారా కాకుండా ప్రవర్తనతో సిద్ధిస్తుందనడానికి ఆయనే నిలువెత్తు సాక్ష్యం. సమాజాన్ని నడిపించేది ఆయన అత్యున్నత వ్యక్తిత్వమే. ఈ నేపథ్యంలో ఆయన జీవితాన్ని ప్రతిబింబించే ఒక సుభాషితాన్ని నేనిక్కడ ఉటంకిస్తున్నాను…

यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः।

स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते  ” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.