న్యూఢిల్లీలోని భారత్ మండపంలో భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ) వార్షిక సర్వసభ్య సమావేశం, వార్షిక సదస్సును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ఫిక్కీ శత జయంతి వేడుకల సంరద్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ.. గతంలో అనేకసార్లు ఫిక్కీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ.. సంస్థ 100 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భం ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. శతాబ్ద కాలంగా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, మారుతున్న కాలానికి అనుగుణంగా పరిణామం చెందుతూ, భారత ఆర్థిక ప్రస్థానానికి తన వంతు సహకారం అందించడం గొప్ప విజయమని అన్నారు.
గత శతాబ్ద కాలంలో భారత ఆర్థిక ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ.. గత 12 ఏళ్లలో దేశ ప్రజలు, యువత, రైతులు, కార్మికులు, పరిశ్రమలు చేసిన కృషి అభివృద్ధి ధోరణిని ఎలా మార్చిందో ప్రధానమంత్రి వివరించారు. “నేడు భారత్‌లో అభివృద్ధి అత్యంత వేగంగా ఉంది. పేదరికం నుంచి బయటపడుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంది’’ అని ప్రధాని శ్రీ మోదీ అన్నారు.
కేవలం 12 నుంచి 13 ఏళ్లలో 50 కోట్ల మంది భారతీయులు పేదరికాన్ని అధిగమించారని పేర్కొన్న ప్రపంచ బ్యాంకు తాజా నివేదికను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ ఘనత దేశానికి గర్వకారణమని ఆయన అన్నారు. “ఈ నివేదిక మనందరికీ ఎంతో గర్వాన్ని కలిగించనుంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
సరైన విధానాలు, దృఢ సంకల్పంతో గత 12, 13 ఏళ్లలో 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడిన నేపథ్యంలో, ప్రస్తుతం భారత్ అనుసరిస్తున్న అభివృద్ధి మార్గాన్ని ప్రధానమంత్రి విశ్లేషించారు. “నేడు భారత్ అనుసరిస్తున్న మార్గం సరైనదని, కచ్చితమైనదని, దేశ విజయానికి భరోసా కల్పించేదని ఇది తెలియజేస్తోంది” అని ప్రధాని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతోందని, ప్రముఖ సంస్థలు దేశ వృద్ధి రేటు సుమారు ఏడు శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అక్టోబర్‌లో వస్తువుల ఎగుమతులు దాదాపు 50 బిలియన్ డాలర్లకు చేరి నెలవారీ రికార్డు నమోదుచేశాయని తెలిపారు. ఈ ఆర్థిక పనితీరు నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థలు భారత్ వృద్ధి అంచనాలను పెంచుతున్నాయని చెప్పారు. “మూడీస్ రేటింగ్స్, ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్, ఫిచ్ రేటింగ్స్, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు మన వృద్ధి అంచనాలను పెంచుతున్నాయి” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
‘ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం, న ఆత్మానం అవసాదయేత్’ అనే ప్రాచీన శాస్త్రోక్తిని ఉదాహరిస్తూ.. వ్యక్తులు, పరిశ్రమలు, దేశాలు ఎప్పటికప్పుడు ఆత్మపరిశీలన చేసుకుంటూ తమను తాము ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ప్రధానమంత్రి సూచించారు. ఇప్పటికే బలంగా ఉన్న రంగాలు, స్వల్పకాలిక లాభాలపైనే ఆధారపడకుండా ముందుకు సాగాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వనరులను ఆయుధాలుగా వినియోగిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఫిక్కీ తన శతాబ్ద కాలపు విజయాలను అధిగమించి రాబోయే 20 ఏళ్ల కోసం ప్రణాళికలు రూపొందించాలని పిలుపునిచ్చారు. తద్వారా భారత పరిశ్రమ స్వయం సమృద్ధిని బలోపేతం చేసుకోవడంతో పాటు వ్యాపార వృద్ధికి కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. “రాబోయే 20 ఏళ్లలో మీరు తీసుకునే ప్రతి దీర్ఘకాలిక పెట్టుబడి నిర్ణయానికి ‘దేశమే ప్రథమం’ను ప్రాతిపదికగా చేసుకోండి” అని ప్రధాని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ప్రపంచ ఔషధ కేంద్రంగా భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉందని, పూర్తిస్థాయి ఔషధాల తయారీలో దేశం మంచి ప్రగతి సాధించినప్పటికీ, వందలాది విభాగాల్లో క్రియాశీల ఔషధ పదార్థాలు (ఏపీఐలు), బల్క్ డ్రగ్స్, ఔషధ మధ్యంతర ఉత్పత్తుల కోసం ఇప్పటికీ బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై ఆధారపడుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశీయంగా వీటి తయారీకి ఉన్న అవకాశాలను గుర్తించి, కొత్త సాంకేతికతలు, భారీ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటులో పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతర్జాతీయ పోటీతత్వాన్ని సాధించాలని ఔషధ రంగానికి సూచించారు. “తయారైన ఔషధాల విషయంలో మనకు బలం ఉంది. ఇప్పుడు వాటి తయారీకి అవసరమైన ముడి పదార్థాల రంగంలోనూ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఇనుము, ఉక్కు, అల్యూమినియం రంగాల్లోనూ ఇలాంటి అంతరాలు ఉన్నాయని ప్రధానమంత్రి వివరించారు. వేల కోట్ల రూపాయల విలువైన ఇనుప ఖనిజాన్ని భారత్ ఎగుమతి చేస్తోందని, దేశంలో విస్తారమైన బాక్సైట్ నిల్వలు ఉన్నప్పటికీ, తయారైన ఉక్కు, ప్రత్యేక అల్యూమినియం మిశ్రమ లోహాలు, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోందని పేర్కొన్నారు. దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తుల గ్రేడ్‌లను గుర్తించి, వాటి తయారీ సాంకేతికతలను అభివృద్ధి చేయడంతో పాటు ఖనిజాల విలువ జోడింపు ప్రక్రియలోని అన్ని దశల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని పరిశ్రమలకు పిలుపునిచ్చారు. “ఈ ఉత్పత్తుల తయారీ సామర్థ్యాన్ని కూడా దేశంలోనే అభివృద్ధి చేసుకోవాలి” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
ప్రపంచ వ్యవసాయ ఎగుమతుల్లో భారత్ వాటా కేవలం రెండు నుంచి రెండున్నర శాతం మాత్రమే ఉందని, దేశ వ్యవసాయ రంగం విస్తృతిని పరిగణనలోకి తీసుకుంటే ఇది తక్కువేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అయితే, గత 12 ఏళ్లలో వ్యవసాయ–ఆహార ఎగుమతుల్లో ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల వాటా 13 శాతం నుంచి 20 శాతానికి పైగా పెరిగిందని తెలిపారు. ప్రపంచ మార్కెట్ డిమాండుకు అనుగుణంగా పరిశ్రమలు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించుకోవాలని, వ్యవసాయ రంగంలో పెట్టుబడులను విస్తరించాలని, విదేశీ మార్కెట్ల కోసం నమ్మకమైన సేకరణ వ్యవస్థలు, ఉత్పత్తి శ్రేణులను అభివృద్ధి చేయాలని సూచించారు. “ఈ పరిస్థితిని మనమంతా కలిసి మార్చాలి. విలువ జోడింపు, ఆహార శుద్ధి పరిశ్రమకు దీన్ని ఒక గొప్ప అవకాశంగా చూడాలి” అని శ్రీ మోదీ చెప్పారు.
రోజువారీ వినియోగానికి అవసరమైన ఇంజినీరింగ్ ఉత్పత్తుల రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ చేతి పనిముట్లు, పవర్ టూల్స్ ఎగుమతుల్లో భారత్ వాటా ఇంకా తక్కువగానే ఉందని, అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలకు అనుగుణంగా యంత్రాల తయారీలోనూ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉందని అన్నారు. నాణ్యమైన ఉత్పత్తుల తయారీలో చిన్న సంస్థలు ఎదిగేందుకు పెద్ద కంపెనీలు సహకరించాలని, ప్యాకేజింగ్ పరికరాలు, సాగునీటి వ్యవస్థలు, ఫ్యాక్టరీ యంత్రాల మార్కెట్లపై దృష్టి సారించాలని పరిశ్రమలకు సూచించారు. “ప్రపంచ మార్కెటులో మన ఉనికిని పెంచుకునేందుకు ఈ రంగంలో కృషి చేయవచ్చు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
రైతులు, చిన్న వ్యాపారవేత్తలు, పరిశ్రమలు, సంపద సృష్టికర్తలు, పన్ను చెల్లింపుదారులను గౌరవించినప్పుడే ఒక దేశం ప్రగతి సాధిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. వ్యాపార అనుకూల, పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చే సంస్కరణలను ఆయన వివరించారు. 2014లో 30 శాతంగా ఉన్న ప్రాథమిక కార్పొరేట్ పన్ను రేటును 22 శాతానికి తగ్గించడం, ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు రూ.12 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు కల్పించడం, పన్ను రిటర్నులు, రీఫండ్ ప్రక్రియలను సరళీకరించడం, డిమాండును పెంచేందుకు అనేక వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గించడం వంటి చర్యలను ప్రస్తావించారు. “దీని ప్రత్యక్ష ప్రయోజనం మన పరిశ్రమలకు, వ్యాపార సంస్థలకు చేకూరుతోంది” అని ప్రధాని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఇటీవల భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలను, సంస్కరణల వేగాన్ని అందిపుచ్చుకుని, 140 కోట్ల జనాభా కలిగిన దేశీయ మార్కెట్‌తో పాటు విదేశీ అవకాశాలను కూడా వినియోగించుకోవాలని పరిశ్రమలకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పరిశ్రమల నుంచి వచ్చే సూచనల కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను రూపొందించడం, పంపిణీ వ్యవస్థలను అభివృద్ధి చేయడంపై వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టాలని సూచించారు. సదస్సులో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని ప్రసంగాన్ని ముగించారు. ‘‘మన దేశీయ మార్కెట్ మనకు సౌకర్యవంతమైన పరిధిగా ఉండకూడదు. ప్రపంచ మార్కెట్లలో పోటీపడేందుకు అది మనకు ఆత్మవిశ్వాసాన్ని అందించాలి” అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
***
India's growth story is creating new opportunities. Our industries must be ready to seize them. Speaking at FICCI's centenary convention. @ficci_india https://t.co/tJCw2NnpjW
— Narendra Modi (@narendramodi) November 19, 2026
FICCI अपनी स्थापना के 100 वर्ष पूरे कर रहा है। एक संस्था का सौ वर्षों तक लगातार सजग और सक्रिय रहना, बदलते समय के साथ खुद को आगे बढ़ाना और देश की आर्थिक यात्रा में अपनी भूमिका निभाते रहना, ये बहुत बड़ी उपलब्धि है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 19, 2026
FICCI ने अपने 100 वर्षों में देश की Industry को बहुत कुछ Achieve करते हुए देखा है। अब समय ये तय करने का है कि Indian Industry अगले 20 वर्षों में क्या Achieve कर सकती है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 19, 2026
FICCI ने अपने 100 वर्षों में देश की Industry को बहुत कुछ Achieve करते हुए देखा है। अब समय ये तय करने का है कि Indian Industry अगले 20 वर्षों में क्या Achieve कर सकती है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 19, 2026
अगले 20 वर्षों के अपने हर long-term investment decision में India First को अपना आधार बनाइए। इससे देश आत्मनिर्भर होगा और आपके business की growth के लिए भी नए अवसर खुलेंगे: PM @narendramodi at @ficci_india centenary convention
— PMO India (@PMOIndia) November 19, 2026
हमारा Domestic Market हमारा Comfort Zone नहीं होना चाहिए। हमें इससे वो आत्मविश्वास मिलना चाहिए जिससे हम Global Markets में Compete कर सकें। इसलिए दुनिया के अलग-अलग Regions के Customers की जरूरतों को समझने में Invest करिए: PM @narendramodi at @ficci_india centenary convention
— PMO India (@PMOIndia) November 19, 2026