పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 14న అస్సాంలో పర్యటిస్తారు. ఉదయం సుమారు 10:30 గంటల వేళలో, ప్రధానమంత్రి డిబ్రూగఢ్‌లోని మొరాన్ బైపాస్ ప్రాంతంలోని ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ఈఎల్ఎఫ్)లో విమానం నుంచి నేల మీదికి దిగుతారు. అక్కడ పోరాట విమానాలు, రవాణా విమానాలతో పాటు హెలికాప్టర్ల గగనతల విన్యాసాల్ని ఆయన వీక్షిస్తారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మాణం పూర్తి అయిన కుమార్ భాస్కర్ వర్మ సేతును మధ్యాహ్నం దాదాపు ఒంటిగంట వేళలో ప్రధానమంత్రి సందర్శిస్తారు. ఆ తరువాత, గువాహాటీలోని లచిత్ ఘాట్ వద్ద వివిధ పథకాలను మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ పథకాలకు రూ.5,450 కోట్లకు పైగా మొత్తాన్ని ఖర్చు చేశారు.
అత్యవసర ల్యాండింగ్ కేంద్రం (ఈఎల్ఎఫ్) ఈశాన్య భారతంలో మొదటిది. ఎమర్జెన్సీలలో సైనిక విమానాలు, పౌర విమానాలు నేల మీదకు దిగడానికీ, నేల మీది నుంచి నింగి లోకి ఎగురడానికీ అనుకూలంగా దీనిని భారత వాయు సేన సమన్వయంతో నిర్మించారు. ఇది అత్యవసర వేళల్లో తగిన ప్రతిస్పందనపూర్వక చర్యలను చేపట్టడంలో కీలక పాత్రను పోషిస్తుంది. ఈశాన్య ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయాల్లో సహాయక, రక్షణ కార్యకలాపాలను వెనువెంటనే మొదలుపెట్టడానికి గాని, లేదా ఆ ప్రాంతాల్లో వ్యూహాత్మక అవసరాల్ని తీర్చడానికి గానీ ఇది తోడ్పడుతుంది. రెండు రకాలుగా ఉపయోగించుకొనేటట్లు ఈ మౌలిక సదుపాయాన్ని తీర్చిదిద్దారు. 40 టన్నుల వరకూ ఉండే పోరాట విమానానికి అనుకూలంగా ఉండడంతో పాటు, గరిష్ఠంగా 74 టన్నుల వరకూ బరువు గల సామగ్రిని నింపిన రవాణా విమానం కూడా ఈఎల్ఎఫ్ నుంచి నింగికి ఎగురగలుగుతాయి.
అనేక ముఖ్య ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. వాటిలో రవాణా సేవలను వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులూ, డిజిటల్ సేవలను పటిష్ఠపరిచేవీ, ఉన్నత విద్యను ప్రోత్సహించేవీ, సార్వజనిక రవాణాను పెంపొందించేవీ ఉన్నాయి. ఫలితంగా ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి గొప్ప ఊతం లభించనుంది.
సుమారు రూ.3,030 కోట్ల ఖర్చుతో బ్రహ్మపుత్ర నది మీద నిర్మించిన కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఆరు వరసలుగా, ప్రీస్ట్రెస్‌డ్ కాంక్రీట్ (పీఎస్‌సీ)తో నిర్మించిన ఈ వంతెన గువాహాటీని ఉత్తర గువాహాటీతో కలుపుతుంది. ఈశాన్య భారతంలో అసాధారణ మోతాదులో పీఎస్‌సీని ఉపయోగించి నిర్మించిన మొదటి వంతెన ఇదే. ఈ వారధి గువాహాటీ, ఉత్తర గువాహాటీల మధ్య ప్రయాణించడానికి పట్టే కాలాన్ని ఏడు నిమిషాలకు తగ్గిస్తుంది. ఈ ప్రాంతంలో భూ కంపాలు తరచుగా నమోదు అవుతుండడాన్ని లెక్కలోకి తీసుకొని, ఈ వంతెనను నిర్మించడంలో మన్నిక నిర్ధారణకు గాను బేస్ ఐసొలేషన్ సాంకేతికతనీ, రాపిడికి తట్టుకొని నిలిచే బేరింగులనీ ఉపయోగించారు. వాస్తవ కాల స్థితి పర్యవేక్షణ, నష్టాన్ని త్వరిత గతిన గుర్తించడంతో పాటు వంతెన సురక్షనీ, వంతెన సేవల వ్యవధినీ మెరుగుపరచడం కోసం బ్రిడ్జి హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ (బీహెచ్ఎంఎస్)ను కూడా సమకూర్చారు.
దేశ ఈశాన్య ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని అస్సాంలోని కామరూప్ జిల్లా అమీన్‌గావ్‌లో ఏర్పాటు చేసిన జాతీయ డేటా సెంటరును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ అత్యంత ఆధునిక డేటా సెంటరు మొత్తం 8.5 ఎండబ్ల్యూ లోడుతో సగటున ఒక్కో ర్యాకుకూ 10 కేడబ్ల్యూ సామర్థ్యంతో పనిచేస్తుంది. ప్రభుత్వ వివిధ విభాగాలకు కీలక సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఇతర జాతీయ డేటా సెంటర్లకు డిజాస్టర్ రికవరీ సెంటరుగా ఉంటుంది. ఇది ఈశాన్య ప్రాంతాల్లో అతి ముఖ్య పౌర ప్రధాన సేవల్ని డిజిటల్ మాధ్యమం ద్వారా అందజేయడంలో ప్రభుత్వాలకు సహాయపడుతుంది. నార్త్ ఈస్టర్న్ రీజియన్ నేషనల్ డేటా సెంటరును డిజిటల్ ఇండియా దృష్టికోణానికి అనుగుణంగా ఉండేలాగానూ, ఆ ప్రాంతాల్లో ఐసీటీ వ్యవస్థను బలోపేతం చేసి, డిజిటల్ మాధ్యమం ద్వారా పటిష్ట, సురక్షిత, సర్వ కాలిక సేవల లభ్యతకు పూచీ పడే లక్ష్యంతోనూ దీనిని రూపొందించారు. ఐఐఎం– గువాహాటీని కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఉన్నత విద్యకీ, మేనేజ్మెంట్ విద్యకీ వెన్నుదన్నుగా ఐఐటీ గువాహాటీ నిలుస్తుంది.
‘పీఎమ్–ఈబస్ సేవా పథకం’లో భాగంగా 225 విద్యుత్తు బస్సులను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. వీటిలో గువాహాటీకి చెందిన 100 బస్సులు, నాగ్‌పూర్‌కు, భావ్‌నగర్‌కు చెందిన చెరి 50 బస్సులతో పాటు చండీగఢ్‌కు చెందిన 25 బస్సులు ఉన్నాయి. ఈ నాలుగు నగరాల్లో విద్యుత్తు బస్సుల సేవలను మొదలుపెడుతుండడంతో, 50 లక్షల కన్నా ఎక్కువ మంది పౌరులకు స్వచ్ఛమైన, చౌకైన, విశ్వసనీయమైన సార్వజనిక రవాణా సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ ఎలక్ట్రిక్ బస్సులు నగర ప్రాంతాల్లో గతిశీలతనీ, జీవన నాణ్యతనీ మెరుగుపరచడంలో కూడా తోడ్పడుతాయి.
***